వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న హార్ముజ్ జలసంధి పేరును మార్చే అంశం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై వైట్‌హౌస్ ఏకంగా మ్యాప్‌నే మార్చి ‘ట్రంప్ స్ట్రెయిట్’గా చూపించింది. అంతేకాదు.. దానికి ‘It’s got a nice ring to it’ అంటూ క్యాప్షన్ పెట్టింది. అంటే.. ‘పేరు వినడానికి బాగానే ఉంది’ అన్నట్టుగా స్పందించింది. దీంతో, అమెరికా చర్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.
ట్రంప్ బుధవారం తన ట్రూత్ సోషల్ ఖాతాలో హార్ముజ్ జలసంధికి ‘ట్రంప్ స్ట్రెయిట్’గా పేరు మార్చాలా? అని ప్రశ్నించారు. ‘ఇప్పుడు ఇది అమెరికా నియంత్రణలో ఉంది కాబట్టి.. హార్ముజ్ స్ట్రెయిట్ పేరును ట్రంప్ స్ట్రెయిట్‌గా మార్చాలా? అమెరికా మాదిరిగానే ఇది కూడా మునుపెన్నడూ లేనంత ‘హాట్’గా ఉంటుంది!’ అంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలు వెలువడిన కొద్దిసేపటికే వైట్‌హౌస్ అధికారిక సోషల్ మీడియా ఖాతా స్పందించింది. హార్ముజ్ జలసంధిని ‘Trump Strait’గా పేర్కొంటూ ఓ మ్యాప్‌ను పోస్టు చేసి.. ‘It’s got a nice ring to it’ అని రాసుకొచ్చి అందరికీ షాకిచ్చింది. దీంతో అధ్యక్షుడి వ్యాఖ్యను వైట్‌హౌస్ కూడా సరదాగా స్వీకరించినట్టు స్పష్టమైంది.
నిజంగానే పేరు మారుస్తారా?
అయితే ప్రస్తుతానికి హార్ముజ్ జలసంధికి అధికారికంగా ‘ట్రంప్ స్ట్రెయిట్’ అనే పేరు పెట్టినట్లు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఇది ట్రంప్ చేసిన ప్రతిపాదన, దానికి వైట్‌హౌస్ ఇచ్చిన వ్యంగ్యాత్మక స్పందన మాత్రమే. అంతర్జాతీయ జలమార్గమైన హార్ముజ్ పేరును అమెరికా ఒక్కపక్షంగా మార్చడం అంత సులభం కాదు. అంతేకాదు.. ట్రంప్ తర్వాత తన ప్రతిపాదనను కొంత తేలికగా తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. పేరు మార్చడం గురించి తాను సీరియస్‌గా అన్నారా అని ప్రశ్నించగా, ‘అది అలా సరదాగా చెప్పాను’ అన్నట్టుగా పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే, ట్రంప్ గతంలో సరదాగా ప్రస్తావించిన కొన్ని పేరు మార్పులు తర్వాత అధికారిక చర్యలుగా మారడంతో ఈ వ్యవహారంపై ఆసక్తి నెలకొంది.
ఇది మొదటిసారి కాదు..
ట్రంప్ భౌగోళిక పేర్ల మార్పుపై ఆసక్తి చూపడం ఇదే మొదటిసారి కాదు. 2025లో ఆయన ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా పిలవాలని ఆదేశించారు. ఇటీవల కెనడాతో వాణిజ్య వివాదం మధ్య లేక్ ఒంటారియోకు ‘లేక్ అమెరికా’ అనే పేరు ప్రతిపాదించి, దానిపై అధికారిక చర్యలు కూడా చేపట్టారు.
ఇదీ చదవండి: ఇరాన్‌పై ఇజ్రాయెల్ మిషెన్ ఇంకా పూర్తి కాలేదు: నెతన్యాహు


