కీవ్: ఉక్రెయిన్ లక్ష్యంగా రష్యాసేనల దాడు లు బుధవారమూ కొనసాగాయి. దీంతో డినిప్రో నగరంలోని పలు అపార్ట్‌మెంట్ భవంతులు దాడులతో దద్దరిల్లాయి. బుధ వారం రష్యా జరిపిన 174 డ్రోన్ దాడులు, రెండు క్షిపణి దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయ పడ్డారు. యుద్ధం మొదలై నాలుగేళ్లు పూర్త యినా ఇరు దేశాల మధ్య దాడుల తీవ్రత ఏమాత్రం తగ్గట్లేదు.
తూర్పు, దక్షిణ ఉక్రెయి న్ ప్రాంతాల్లో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. సయోధ్యకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సానుకూల ఫలితాలు కనుచూపు మేరలో కన్పించట్లేవు. మరోవైపు మంగళవారం అర్ధరాత్రి తదుపరి దాడులు భీకరంగా ఉంటాయని అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ పరస్పరం హెచ్చరికలు చేసుకోవడం గమనార్హం. ‘‘రష్యా గగనత లంలో ప్రయాణించే విదేశీ ఎయిర్‌లైన్స్ సంస్థల విమానాలకు దాడులు ముప్పు పెరగొచ్చు.
ఎందుకంటే ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి డ్రోన్ దాడులతో పరిస్థితి మారుతోంది. శాంతి చర్చలకు ముందుకొచ్చేలా రష్యాపై ఒత్తిడి పెంచడమే మా లక్ష్యం’’ అని జెలెన్‌స్కీ అన్నారు. దీనిపై పుతిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఇది ప్రభుత్వ ప్రయోజిత ఉగ్రవాదంలా ఉంది. ఇలాంటి ఉగ్రవాదులతో మేం చర్చలు జరపబోం’’ అని అన్నారు. పుతిన్ వ్యాఖ్యలను ఉక్రెయిన్‌లోని తప్పుడువార్తలను ఖండించే ప్రభుత్వ విభాగం తప్పుబట్టింది. ‘‘రష్యానే ఏకపక్షంగా ఈ యుద్ధం మొదలెట్టింది.
రోజూ ఉక్రెయిన్ అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. తీరా ఇప్పుడేమో మమ్మల్ని ఉగ్రవాదులు అంటోంది. తమను బాధిత దేశంగా చిత్రీకరించుకునే కుట్ర ఇది’’ అని ఆ విభాగం తూర్పారబట్టింది. ‘‘ఉక్రెయిన్ బెదిరింపులకు బెదరబోం. మా గగనతల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తాం. విమానాల రాకపోకలకు యతాతథంగా సాగుతాయి’’ అని రష్యా రవాణా మంత్రి ఆండ్రీ నికితిన్ తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ దాడులతో బెల్గార్డ్ సరిహద్దు ప్రాంతంలో ఇద్దరు చనిపోయారని రష్యా రక్షణ శాఖ బుధవారం తెలిపింది. 130 డ్రోన్లను కూల్చేశామని వెల్లడించింది.


