పుతిన్‌ ధీమా.. ఉక్రెయిన్‌పై బిగ్‌ స్టేట్‌మెంట్‌ | Putins Big Claim: Ukraine’s Collapse Is Inevitable | Sakshi
Sakshi News home page

పుతిన్‌ ధీమా.. ఉక్రెయిన్‌పై బిగ్‌ స్టేట్‌మెంట్‌

Sep 2 2026 8:00 AM | Updated on Sep 2 2026 8:20 AM

Putins Big Claim: Ukraine’s Collapse Is Inevitable

ఉక్రెయిన్‌పై యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు మాస్కో ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని అన్నారాయన. అయితే వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ నేతృత్వంలోని ఉక్రెయిన్‌ నాయకత్వాన్ని ‘ఉగ్రవాదులు’గా అభివర్ణిస్తూ.. వారితో చర్చలు జరపడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. కిర్గిజిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (SCO) సదస్సు ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా దూసుకెళ్తోందని పుతిన్‌ ప్రకటించారు. రష్యా సేనల పురోగతి వేగం పెరిగిందని, ఉక్రెయిన్‌ బలగాలు త్వరలో కుప్పకూలుతాయని ధీమా వ్యక్తం చేశారు. జెలెన్‌స్కీ ఉన్నంతకాలం శాంతి చర్చలు జరగడం అనుమానమే అని వ్యాఖ్యానించారాయన. చర్చలనేవి జరిగితే.. ఉక్రెయిన్‌ నాయకత్వం మారిన తర్వాతే అనే సంకేతాలు ఇచ్చారు.

ముందుకు దూసుకెళ్తున్నాం..
ఆగస్టులో డొనెట్స్క్‌ ప్రాంతంలో 270 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నామని పుతిన్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. రష్యా సైన్యం చాకచక్యంగా 4,500–4,800 మంది, మరో 2,000 మంది ఉక్రెయిన్‌ సైనికులతో కూడిన రెండు బృందాలను చుట్టుముట్టిందని పేర్కొన్నారు. స్లోవియాన్స్‌క్‌, క్రామటోర్స్క్‌ నగరాల వైపు రష్యా బలగాలు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ఈ వాదనలను స్వతంత్రంగా నిర్ధారించలేదని రాయిటర్స్‌ తెలిపింది.

‘డ్రోన్లతో ఉగ్రవాదం’
రష్యాలోకి ఉక్రెయిన్‌ జరుపుతున్న డ్రోన్‌ దాడులను పుతిన్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఉగ్రవాదం మరో స్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆరోపించారు. రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులతో నష్టం జరిగినట్లు తొలిసారిగా అంగీకరించిన ఆయన.. తమ రిఫైనరీల్లో కేవలం 10 శాతం మాత్రమే మరమ్మతులు అవసరమని చెప్పారు.

చర్చలకు ఓకే.. కానీ!
యుద్ధాన్ని పూర్తిగా ముగించే ఉద్దేశంతో జరిగే చర్చలకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్‌ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతినిధులతో చర్చలకు కూడా తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే చర్చల ప్రక్రియను సాగదీస్తూ కాలయాపన చేయడం మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు.

కొత్త సైనిక సమీకరణ ఉండదు
రష్యాలో మరోసారి సైనిక సమీకరణ చేపట్టాల్సి వస్తుందన్న ప్రచారాన్ని పుతిన్‌ కొట్టిపారేశారు. అదంతా ‘పచ్చి అర్ధంలేని మాటలు’ అని వ్యాఖ్యానించారు. రష్యా సైనిక పరిస్థితి బలంగానే ఉందన్న సందేశాన్ని పుతిన్‌ తాజా వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement