అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడుతో అన్ని దేశాలూ కొత్త కొత్త దారులు వెదుక్కుంటున్నాయి. ఉన్న కూటములు విస్తరిస్తున్నాయి. సైనిక సహకార ఒప్పందాలు పుట్టుకొస్తున్నాయి. మంగళవారం ముగిసిన రెండు రోజుల షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశాలు దీన్నే నిరూపించాయి. 2001లో అయిదు సభ్యదేశాలతో మొదలైన ఆ సంస్థ 2017లో మనదేశంతోపాటు పాకిస్తాన్‌ను కూడా చేర్చుకోగా... 2023లో ఇరాన్, ఆ మరుసటి ఏడాది బెలారస్ కూడా సంస్థలోకి ప్రవేశించాయి. ఈసారి తుర్కియే, అజర్‌బైజాన్, ఆర్మేనియా, మంగోలియా, లావోస్, టోగో, నేపాల్, మాల్దీవులు, బహ్రెయిన్, శ్రీలంక తదితర 14 దేశాలు ‘సంభాషణ భాగస్వాములు’గా ఇందులో పాలుపంచుకున్నాయి. ఎస్‌సీఓ పాతికేళ్ల ప్రస్థానాన్ని జాగ్రత్తగా గమనిస్తే అది క్రమేపీ రష్యా పరిధినుంచి చైనా పరిధిలోకి జారుకుంటున్నదన్న అభిప్రాయం కలుగుతుంది.
ఇప్పటికైతే మధ్య ఆసియాలోని పూర్వపు సోవియెట్ ప్రాంతాలైన కజఖ్‌స్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్కుమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లు భద్రత, సంస్కృతి, సంస్థాగత, వ్యూహాత్మక అంశాల్లో ఇంకా రష్యాకు సాన్నిహిత్యంగానే ఉన్నాయి. అది కొనసాగుతుంది కూడా. కానీ మరోపక్క ఈ దేశాల్లో చైనా ఆర్థిక ప్రాబల్యం పెరుగుతోంది. అది ఈసారి సమావేశాల్లో బాహాటంగానే కనబడింది. చైనాను పశ్చిమాసియా, యూరప్, పశ్చిమాసియాలతో అనుసంధానించే బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్‌ఐ) బృహత్తర ప్రాజెక్టు ద్వారా వచ్చే రోడ్లు, రైల్వేలు, పైప్‌లైన్లు, పోర్టులు వగైరాలు తమ ప్రాంత ఆర్థిక చిత్రాన్ని సమూలంగా మార్చేస్తాయని ఆ దేశాలు భావిస్తున్నాయి. చైనా వీటికి ఆయుధ సామగ్రి విక్రయాన్ని కూడా మొదలెట్టింది. అసలే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉండే రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగి మరింత నష్టపోయింది. ఈ దశలో చైనాతో భాగస్వామ్యం కలిసొస్తుందని పూర్వపు సోవియెట్ దేశాలు భావించటంలో వింతేమీ లేదు. ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో ఈ విషయంలో చైనాతో విభేదించే ఓపిక, తీరిక రష్యాకు లేవు. అందుకే ఈ పరిణామాలను మౌనంగా వీక్షిస్తోంది.
ఈ నేపథ్యంలో మన దేశం కూడా ఆచితూచి అడుగేయటం అవసరం. ప్రధాని నరేంద్ర మోదీ సెక్యూరిటీ (భద్రత), కనెక్టివిటీ (అనుసంధానం), ఆపర్చ్యునిటీ (అవకాశం) అనే మూడుస్తంభాలుగా ఎస్‌సీఓ దేశాలమధ్య సహకారం పటిష్టపడాలనీ... అది కొలవగలిగే ఫలితాల సాధన దిశగా ఉండాలనీ సదస్సులో పిలుపునివ్వటం గమనించదగింది. చైనా మాదిరే ఆ సంస్థ ఛత్రఛాయలో మనం కూడా ఎదగటానికి, ఆర్థికంగా విస్తరించటానికి మరింతగా ప్రయత్నించాల్సి వుంది. ఇందుకు అవరోధాలు తక్కువేం లేవు. సంస్థలోని రెండు సభ్య దేశాలు రష్యా, ఇరాన్ యుద్ధాల్లో కూరుకుపోయాయి. వాటితో ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలపై అమెరికా ఆంక్షల కత్తి వేలాడుతోంది. భారత్, పాకిస్తాన్ మధ్య వైరం అలాగే ఉంది. అమెరికా ఒత్తిళ్ల కారణంగా ఇరాన్ నుంచి మన దేశం చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించుకుంది. ఏడేళ్ల తర్వాత ఇటీవలే ముడి చమురు దిగుమతి చేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో రాగల కాలంలో ఆ దేశంతో మరిన్ని రంగాలకు వాణిజ్యాన్ని విస్తరించదల్చుకున్నట్టు మోదీ చెప్పారు. ఇరాన్‌పై మహా ఆర్థిక దిగ్బంధనాన్ని అమలు చేస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఇది కీలక వాగ్దానం.
భిన్న ప్రయోజనాలున్న, వివిధ రాజకీయ వ్యవస్థలున్న దేశాలమధ్య అర్థవంతమైన సహకారం విస్తరించటం అంత సులభమేమీ కాదు. ఈ పాతికేళ్లలో గణనీయంగా పెరిగిన ఎస్‌సీఓ... ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనాలన్న చైనా ప్రతిపాదనకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నా, ఆచరణలో అదేమీ అమలుకావటం లేదు. మన దేశంలో ఉగ్రవాద దాడుల వెనక తన హస్తం లేదని దబాయించటంతోపాటు తమ దగ్గర జరిగే అలాంటి దాడుల్లో భారత్ ప్రమేయం ఉందని పాకిస్తాన్ ఎదురు ఆరోపిస్తోంది. ఇలాంటి డ్రామాలు కట్టిపెట్టి సభ్యదేశాలు చిత్తశుద్ధితో వ్యవహరించినప్పుడే ఏ సంస్థలైనా లక్ష్యసాధనలో విజయం సాధిస్తాయి. ఎస్‌సీఓ విస్తరణ మంచిదే... దాని మాటెలావున్నా ఆ సంస్థ బలపడాలంటే పెడ ధోరణులను అరికట్టడం తప్పనిసరి.


