breaking news
SCO
-
మీ బోర్డర్ దాటి వస్తున్న పాక్ టెర్రరిస్టుల సంగతేంటి?
న్యూఢిల్లీ: షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు ద్వైపాక్షిక అంశాలను చర్చించారు. ఇందులో చైనా సరిహద్దుల నుంచి భారత్‌లోకి చొరబడుతున్న పాక్ టెర్రరిస్టుల అంశాన్ని కూడా ప్రధాని మోదీ.. జిన్‌పింగ్ వద్ద ప్రస్తావించారు. అయితే దీనికి చైనా తన సంపూర్ణ మద్దతును భారత్‌కు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ‘ జిన్‌పింగ్ వద్ద పాక్ ఉగ్రవాద కార్యకలాపాలను కూడా మోదీ ప్రస్తావించారు. ఇందుకు చైనా సానుకూలంగా స్పందించింది. టెర్రర్ కార్యకలాపాల వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తామని జిన్‌పింగ్ అన్నారు. ఎటువంటి ఉగ్రవాద చర్యల నిర్మూలనకైనా తమ మద్దతు ఉంటుందని జిన్‌పింగ్ అన్నారు. ఇరుదేశాలకు ప్రమాదంగా మారిన ఉగ్రవాద అంశాన్ని జిన్‌పింగ్ కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నారు. ఉగ్రవాద నిర్మూలనకు భారత్‌కు తమ వంతు సహకారం అందిస్తామన్నారు’ అని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. టియాంజిన్ నగరంలో ఎస్సీవో సదస్సులో పాల్గొన్న మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రాంతీయ శాంతి, ఆర్థిక స్థిరత్వం, సరిహద్దు ఉద్రిక్తతల తగ్గింపు, సాంకేతిక రంగాల్లో సహకారం పెంచుకునే వంటి అంశాలపై చర్చలు జరిగాయి.వాణిజ్య, టెక్నాలజీ, రక్షణ రంగాల్లో ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. భారత్-చైనా మధ్య స్థిరమైన, స్నేహపూర్వక సంబంధాలు ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, శ్రేయస్సుపై సానుకూల ప్రభావం చూపుతాయి అని ప్రధాని మోదీ తెలపడంతో ఇరు దేశాల సంబంధాలు బలోపేతం కావడానికి అడుగులు పడ్డాయి. ఈ పర్యటన ద్వారా భారత్ తన ప్రాంతీయ ప్రాబల్యాన్ని చాటింది. ఇది భారత్-చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉంది. -
చైనాలో సందడి చేస్తున్న రోబో షామా
-
మిత్ర లాభం
అంతా సవ్యంగా ఉన్న రోజుల్లో భిన్న దేశాలతో దౌత్య సంబంధాలు సాఫీగా సాగి పోతాయి. కానీ సవాళ్లు ఎదురయ్యే కాలంలో వాటిని నిలబెట్టుకోవటం, కొత్త బంధాలు ఏర్పర్చుకోవటం సులభం కాదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైఖరి కారణంగా భారత్–అమెరికా సంబంధాల్లో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జపాన్‌లో రెండు రోజుల పర్యటన ప్రారంభించారు. ఈ నెల 31న, ఆ మర్నాడూ చైనాలోని తియాన్జిన్లో జరగబోయే షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సులో కూడా ఆయన పాలుపంచుకుంటారు. జపాన్‌తో మనకు చిరకాల మైత్రి ఉంది. మన స్వాతంత్య్రోద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ)ని స్థాపించి పోరాడినప్పుడు అన్ని విధాలా చేయూతనందించింది జపానే. స్వాతంత్య్రానంతరం ఆ బంధం మరింత బలపడింది. రెండో ప్రపంచ యుద్ధ పరిసమాప్తి అనంతరం లాంఛనంగా 1951 సెప్టెంబర్ 8న శాన్ఫ్రాన్సిస్కో శాంతి ఒప్పందం కుదిరినప్పుడు జపాన్‌కు పాక్షిక సార్వభౌమత్వం మాత్రమే ఇవ్వాలన్న నిబంధనను మన దేశం తీవ్రంగా వ్యతిరేకించి సంతకం చేసేందుకు నిరాకరించింది. అందుకు జపాన్ ఈనాటికీ మన పట్ల కృతజ్ఞతగా ఉంటుంది. తొలిసారి 2014లో ఎన్డీయే సర్కారు ఏర్పడినప్పుడే మోదీ జపాన్ను సందర్శించారు. ఈ దశాబ్ద కాలంలో ఇరు దేశాల సంబంధాలూ మోదీ అన్నట్టు ఎన్నో రెట్లు పెరిగాయి. మన దేశంలో ప్రస్తుత జపాన్ పెట్టుబడుల విలువ 4,200 కోట్ల డాలర్లు. దేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మెట్రో రైలు ప్రాజెక్టులు జపాన్ ఆర్థిక సహకారంతో సాకారమయ్యాయి. ఢిల్లీ–ముంబై పారిశ్రామిక వాడ, సెమీకండక్టర్లు తదితరాలపై జపాన్ ముద్ర బలంగా ఉంది. ముంబై–అహ్మదాబాద్ మధ్య సాకారం కానున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అత్యాధునిక ఈ–10 రకం బుల్లెట్ రైలును అందించాలని జపాన్ నిర్ణయించింది. వచ్చే పదేళ్లలో మన దేశంలో జపాన్ పెట్టుబడుల్ని పది లక్షల కోట్ల యెన్ల(6,800 కోట్ల డాలర్ల) స్థాయికి తీసుకెళ్లాలని మోదీ, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా శిఖరాగ్ర సమావేశంలో నిర్ణయించటం, పెట్టుబడులతోపాటు నవీకరణ, పర్యావరణం, ఆరోగ్యం తది తరాల్లో కలిసి పనిచేయాలనుకోవటం... రాగల అయిదేళ్లలో భిన్న రంగాల నిపుణుల సేవలు పొందేందుకు పరస్పరం అయిదు లక్షల మందిని బదలాయించుకోవాలను కోవటం భారత్, జపాన్ల మైత్రి పటిష్ఠతకు నిదర్శనం. ఈ క్రమంలో సహజంగానే సవాళ్లుంటాయి. స్వేచ్ఛాయుత, శాంతియుత, సంపద్వంత ఇండో–పసిఫిక్ ఆవిర్భవించాలన్న నినాదం అమెరికా ఛత్రఛాయలో ఏర్పడింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంత సరిహద్దుల విషయంలో చైనాతో జపాన్‌కు తగాదా లేకున్నా, దాని దూకుడు పెద్ద సమస్యగా మారింది. చైనా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల జపాన్‌కు ఎగుమతుల సమస్య ఏర్పడుతోంది. చైనాను కట్టడి చేయాలన్న బృహత్తర పథకానికి ఈ వివాదం తోడ్పడుతుందని అమెరికా భావించి మనల్ని అందులో కీలక భాగస్వామిని చేసింది. సుంకాల వివాదంలో ఇది ఎటు పోతుందన్న ఆందోళన జపాన్‌కు సహజంగానే ఉంటుంది. అయితే తమ వైఖరి మారబోదని మోదీ చెప్పటం జపాన్‌కు ఊరటనిచ్చే అంశం. ఇండో–పసిఫిక్ విషయంలో మన వైఖరి చైనాకు కంటగింపుగానే ఉండొచ్చు. జపా న్‌తో సంబంధాలు సుహృద్భావంతో ఉండగా, చైనాతో సంబంధాలు అందుకు భిన్నం. సుంకాల వివాదం నేపథ్యంలో భారత్ దగ్గరవుతుందన్న అంచనా చైనాకుంది. ఎస్సీవో శిఖరాగ్ర సదస్సుకు మోదీ వెళ్తారా వెళ్లరా అనే సంశయం మొదట్లో ఉన్నా... రష్యా చొరవతో అది సాధ్యపడుతోంది. ఇది సాన్నిహిత్యానికి దారి తీస్తుందా లేదా అన్నది చూడాలి. చైనా ఇప్పటికే ఎరువులు, అరుదైన ఖనిజాలు, సొరంగాల తవ్వకంలో తోడ్పడే యంత్ర సామగ్రి ఎగుమతులపై ఉన్న నిషేధాలు తొలగించటానికి సూత్రప్రాయంగాఅంగీకరించింది. మోదీ చైనా పర్యటనలో ఈ విషయంలో మరింత స్పష్టత వస్తుంది. చైనాతో మన సంబంధాలు బలపడే సూచనలుండగా, ట్రంప్ సైతం చైనాతో సన్నిహితమై దక్షిణాసియాలో పలుకుబడి పెంచుకోవాలనుకుంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మన వ్యూహాత్మక ఆధిక్యతను నిలబెట్టుకుంటూ జపాన్, చైనాలతో సఖ్యత కుదుర్చుకోవటం దౌత్యపరంగా మనకు పెను సవాలే. మోదీ దీన్ని ఎలా ఛేదించగలరో చూడాలి. -
దారి మరిచిన ఎస్సీవో!
ఆర్భాటంగా ఏర్పడటం, ఘనంగా లక్ష్యాలు చాటుకోవటం, కీలక సమయాల్లో మొహం చాటేయటం ప్రాంతీయ సహకార సంస్థలకు అలవాటుగా మారింది. సంక్షుభిత ప్రపంచంలో సమస్యలు రావటం సహజమే అయినా, దేశాల మధ్య తలెత్తే విభేదాలు అలాంటి సంస్థల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆ సంస్థల వల్ల ఉద్రిక్తతలు ఉపశమిస్తాయనుకోవటం అమాయకత్వమని రుజువు చేస్తున్నాయి. సరిగ్గా 24 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) అవస్థ అలాగే ఉంది. ఆ సంస్థ రక్షణ మంత్రుల స్థాయి శిఖరాగ్ర సదస్సు రెండు రోజులు జరిగి గురువారం చైనాలోని చింగ్దావ్లో ముగిశాక విడుదల కావాల్సిన ఉమ్మడి ప్రకటన భారత్ కారణంగా మూలన పడింది. ఆ ప్రకటనపై సంతకం చేసేందుకు మన రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిరాకరించటంతో చేసేదేమీ లేక ఉమ్మడి ప్రకటన ఆలోచనే విరమించుకున్నారు. ఈ సదస్సుకు మన దేశంతోపాటు చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాన్, కిర్గిజ్ రిపబ్లిక్, కజఖ్‌స్తాన్ తదితర దేశాల రక్షణమంత్రులు హాజర య్యారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటం ఎలా అనే అంశంపై సదస్సు జరిగింది. ఎస్సీవో 2001లో షాంఘైలో ఏర్పడినప్పుడు అది అందరిలో ఆశలు రేకెత్తించింది. ఎందుకంటే మధ్య ఆసియా దేశాల భద్రత, అభివృద్ధిపైనే ప్రధానంగా కేంద్రీకరిస్తామని సంస్థ తెలిపింది. భారత్, చైనాల మధ్య ఏనాటి నుంచో సరిహద్దు వివాదాలున్నాయి. ఇక పాకిస్తాన్ నాలుగు దశా బ్దాలుగా సరిహద్దు చొరబాట్లను ప్రేరేపిస్తూ ఉగ్రవాద ఘటనలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఎస్సీవో వల్ల చైనా, పాక్‌లతో ఉన్న సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందన్న ఆశ ఉండేది. 2005 నుంచి మన దేశం పరిశీలక హోదాలో సదస్సులకు హాజరవుతూ వచ్చింది. 2017లో రష్యా అధినేత పుతిన్ చొరవతో భారత్ పూర్తి స్థాయి సభ్యదేశమైంది. కానీ, సభ్య దేశాల వ్యవహార శైలి దేని దారి దానిదే! ఎస్సీవో స్థాపనలో కీలక పాత్ర పోషించిన చైనాయే 2020 జూన్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)వద్ద చొరబాటు యత్నం చేసింది. చైనా సైన్యం రాళ్లతో, కర్రలతో, రాడ్లతో దాడి చేసి 21 మంది మన జవాన్ల ప్రాణాలు తీసింది. అంతకుముందూ, ఆ తర్వాతా చైనా తీరు అదే.తాజా శిఖరాగ్ర సదస్సులో విభేదాలకు దారితీసిన అంశం ఆశ్చర్యం కలిగిస్తుంది. మొన్న మార్చిలో పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసి పలువురు పాక్ సైనికులను హతమార్చారు. పాక్ సైన్యం కూడా ప్రతీకార దాడికి దిగి ఆ ఘటనలో పాల్గొన్న మిలిటెంట్లలో అత్యధికుల్ని కాల్చిచంపింది. ఆ మరుసటి నెలలో కశ్మీర్‌లోని పెహల్గామ్లో పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు నిరాయుధులైన పర్యాటకులపై దాడి చేసి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ రెండు దాడుల్లో కేవలం బలూచిస్తాన్ ఘటనను ఉమ్మడి ముసాయిదా ప్రకటన ప్రస్తావించి పెహల్‌గామ్‌ను మినహాయించింది. ఆ ఉదంతం తర్వాత మన దేశం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయటం, పాక్ సైన్యం దాడుల్ని తిప్పికొట్టడానికి వారి వైమానిక స్థావరాలను ధ్వంసం చేయటం పతాక శీర్షికలకెక్కాయి. ఆ ఘటనల పరంపర జరిగి నిండా నెల్లాళ్లు కాకుండానే ఎస్సీవో ఎలా మరిచి పోతుంది? చైనా, పాక్‌ల మధ్య సాన్నిహిత్యం ఉంది గనుక ఆ దేశం చెప్పి నట్టల్లా ఆడి ఉమ్మడి ప్రకటన రూపొందించటం, దానిపై మన దేశం సంతకం చేయాలని కోరుకోవటం తెలివితక్కువతనం కాదా? అసలు ఇలాంటి తీరుతెన్నులు సమష్టి తత్వాన్ని దెబ్బ తీస్తాయన్న స్పృహ ఉండొద్దా?ఎస్సీవో స్థాపించిన కాలంకన్నా ఇప్పుడు ప్రాంతీయంగా సవాళ్లు ఎన్నో రెట్లు పెరిగాయి. ఉగ్రవాదం వల్ల ఈ ప్రాంత శాంతికీ, భద్రతకూ ముప్పు ఏర్పడుతోంది. దేశాల మధ్య పరస్పరం అవిశ్వాసం కూడా గతంతో పోలిస్తే ఎంతగానో పెరిగింది. ఈ సమయంలో ఎస్సీవో వంటి సంస్థ ఈ సమస్యలకు అర్థవంతమైన పరిష్కారం ఆలోచించాలి. కానీ జరిగిందంతా వేరు. ఈ సదస్సులో ప్రసంగించిన రాజ్‌నాథ్ సింగ్ అన్నట్టు రాజ్యేతర శక్తుల వల్లా, ఉగ్రవాద ముఠాల వల్లా ప్రమాద కరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటి వెనకున్న దేశాలు ఆ పరిస్థితుల పర్యవసానాలను ఎదుర్కొని తీరాలని కూడా ఆయన అన్నారు. రాజ్‌నాథ్ ప్రసంగంలో పెహల్గామ్, ‘ఆపరేషన్ సిందూర్’ ప్రస్తావనకొచ్చాయి. అయినా ముసాయిదా ప్రకటన వాటిని మరిచినట్టు నటించింది.ఎస్సీవోను సభ్యదేశాలు తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి తప్ప సమష్టిగా అడుగులేయాలన్న సంకల్పం ప్రదర్శించటం లేదు. ఈ సంస్థ చాటున తన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ)నూ, పలుకుబడినీ పెంచుకోవటమే చైనా ఎజెండా. సంస్థను మధ్య ఆసియా దేశాలకు మించి విస్తరింప జేయాలన్న ఉద్దేశంలోని ఆంతర్యం కూడా అదే. ఇక రష్యాకు ప్రధానంగా పాశ్చాత్య దేశాలతో లడాయి ఉంది. వాటిని ఎదుర్కొనటానికి సంస్థ ఎంతో కొంత తోడ్పడుతుందన్న ఆశ ఉంది. ఎస్సీవోను చిత్తశుద్ధితో నిర్వహిస్తే ఈ ప్రాంత దేశాలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎస్సీవో వాటా 23 శాతం. ప్రపంచ జనాభాలో వాటా 42 శాతం. సంస్థ పెట్టినప్పుడు సభ్య దేశాలమధ్య సైనిక సహకారం, నిఘా నివేదికల్ని పంచుకోవటం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటం, విద్య, ఇంధనం, రవాణా రంగాల్లో సహకరించుకోవటం వంటి ఉద్దేశాలున్నాయి. కానీ ఇవన్నీ మరిచి ముఠాలు కట్టి నచ్చినవారికి అనుకూలంగా వ్యవహరించదల్చుకుంటే ఇలాంటి సంస్థలెందుకు? ఈ గంభీరమైన లక్ష్య ప్రకటనలెందుకు? అందుకే ఎస్సీవో తీరు మారాలి. -
ఉమ్మడి ప్రకటనపై సంతకానికి నో
ఖింగ్‌డావో: ఆనవాయితీకి భిన్నంగా ఉమ్మడి ప్రకటన జారీ చేయకుండానే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు గురువారం ముగిసింది. 26 మంది పర్యాటకులను బలితీసుకున్న పహల్గాం ఉగ్రవాద దాడితోపాటు భారత్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న సీమాంతర ఉగ్రవాదం, ముష్కరుల దాడుల పట్ల భారత్ ఆందోళన గురించి ఈ ప్రకటన ముసాయిదాలో మాటమాత్రంగానైనా ప్రస్తావించకపోవడం గమనార్హం. పైగా పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో స్థానిక వేర్పాటువాద ఉద్యమకారులకు, సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణల వెనుక భారత్ హస్తం ఉండొచ్చనే వాదనను ఈ జాయింట్ డాక్యుమెంట్ ముసాయిదాలో పొందుపర్చడం వివాదాస్పదంగా మారింది. దీనిపై సంతకం చేసేందుకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిరాకరించారు. ఫలితంగా ఏకాభిప్రాయం కుదరలేదన్న కారణంతో ఉమ్మడి ప్రకటన జారీ చేయకుండానే ఎస్సీఓ సదస్సును ముగించాలని నిర్ణయించారు. చైనాలోని తీరప్రాంత నగరం ఖింగ్డావోలో ఎస్సీఓ దేశాల రక్షణ శాఖ మంత్రుల సదస్సు బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. చైనా ఆతిథ్యం ఇచి్చన ఈ సదస్సులో ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు చేపట్టిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.🚨Breaking News: Rajnath Singh refused to sign the SCO joint statement. Why? Pakistan and China tried to weaken the conversation on terrorism. India stood firm on PulwamaAnd Rajnath Singh maintained a strong anti-terror stance#scosummit #RajnathSingh pic.twitter.com/ujsP9JiO9I— Priyanshi Bhargava (@PriyanshiBharg7) June 26, 2025 పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్, చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ఇండియాలో అశాంతి సృష్టించాలన్న లక్ష్యంతో సీమాంతర పొరుగుదేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని పరోక్షంగా పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ ఆర్థికంగా అండగా నిలస్తోందని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధానంగా మార్చుకుందని దుయ్యబట్టారు. ఉగ్రవాదులను ఏరిపారేసే విషయంలో ద్వంద్వ ప్రమాణాల పాటించొద్దని హితవు పలికారు. ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశాలపై కఠినంగా వ్యవహరించేందుకు ఏమాత్రం వెనుకాడొద్దని షాంఘై సహకార సంస్థకు సూచించారు. ఉగ్రవాదులను, వారి పోషకులను చట్టం ముందు నిలబెట్టి, శిక్షించాల్సిందేనని తేల్చిచెప్పారు. -
'దీన్ని అలా చూడకూడదు..': భారత్ పర్యటనపై పాక్ మంత్రి వ్యాఖ్యలు
భారత్‌లోని గోవాలో వచ్చే నెల మే 4 నుంచి 5 వరకు షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్(ఎస్సీఓ) సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఆ సమావేశానికి బిలావల్ భుట్టో జర్దారీ పాక్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. ఈ మేరకు జర్దారీ పాక్ స్థానిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ..వచ్చే నెలలో గోవాలో జరిగే విదేశాంగ మంత్రుల సమావేశంలో తాను పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. తాము ఎస్సీఓ చార్టర్‌కు కట్టుబడి ఉన్నాం అని చెప్పారు. తాను ఈ సమావేశంలో పాలుపంచుకోవడం అనేది SCO చార్టర్ పట్ల పాక్‌కు ఉన్న నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తోందన్నారు. ఈ పర్యటనను ద్వైపాక్షిక సంబంధాల కోణంలో చూడకూడదని జర్దారీ అన్నారు. కాగా, దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత భారత్‌లో పర్యటించనున్న తొలి విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో. చివరిసారిగా 2011లో అప్పటి పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ భారత్‌లో పర్యటించారు. భారత్‌లో జరగనున్న విదేశాంగ మత్రుల సమావేశానికి పాక్, చైనాతో సహా షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సభ్యులందరికీ భారత్ అధికారికంగా ఆహ్వానాలు పంపింది. ఈ సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. గతేడాది సెప్టంబర్లో తొమ్మిది మంది సభ్యులతో కూడిన మెగా గ్రూపింగ్‌కు భారతదేశం ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించగా, ఈ ఏడాది కీలక మంత్రి వర్గ సమావేశాలు, శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించనుంది. ఈ 20 ఏళ్ల షాంఘై సహకార సంస్థలో రష్యా, ఇండియా, చైనా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఇందులో ఇరాన్ ఇటీవలే తాజగా సభ్యత్వం పొందిన దేశం. పైగా తొలిసారిగా ఇరాన్ బారత్ సారథ్యంలో పూర్తిస్థాయి సభ్యునిగా గ్రూపింగ్ సమావేశానికి హాజరవుతోంది. ఇక షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 2022లో ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్లో జరిగింది. దీనికి నరేంద్ర మోదీ హజరయ్యారు. అంతేగాదు జూన్ 2019 కిర్గిజిస్థాన్‌లో షాంఘై సదస్సు తదనంతరం జరిగి తొలి వ్యక్తిగత శిఖరాగ్ర సదస్సు కూడా ఇదే. (చదవండి: ఇద్దరి అధికారహం, అంతర్యుద్ధం.. సామాన్యుల ఆకలి కేకలు) -
ఒకే వేదికపై భారత్, పాక్, చైనా
బీజింగ్: బద్ధ శత్రువులైన చైనా, పాకిస్తాన్ భారత్ ఒకే వేదికను పంచుకోనున్నాయి. భారత సైనికులతో కలిసి ఈ రెండు దేశాలు తమ బలగాలతో సైనిక విన్యాసాలలో పాల్గొనబోతున్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై ఈ మూడు దేశాలు త్వరలోనే ఈ విన్యాసాలను నిర్వహించనున్నాయి. షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) కూటమిలో భాగంగా ఈ కార్యక్రమం జరగనుంది. 8 దేశాలతో కూడిన ఈ కూటమిలో భారత్, చైనా, పాకిస్తాన్ దేశాలకు సభ్యత్వం ఉంది. ‘పబ్బి- యాంటీ టెర్రర్-2021’ పేరిట ఈ విన్యాసాలు జరుగుతాయని ఎస్సీవో తెలిపింది. అయితే, సైనిక విన్యాసాలు ఎక్కడ నిర్వహిస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. మార్చి 18 న ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్లో జరిగిన కౌన్సిల్ ఆఫ్ రీజినల్ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ (రాట్స్) 36వ సమావేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఎస్సీవో అనేది ఒక ఆర్థిక, భద్రతాపరమైన కూటమి. దీనిలో 2017న భారత్, పాకిస్తాన్‌ను పూర్తి సభ్యులుగా చేర్చారు. దీని వ్యవస్థాపక సభ్యులలో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఉన్నాయి. రాట్స్ సంబంధిత ఎస్సీవో కౌన్సిల్ తదుపరి సమావేశం సెప్టెంబరులో ఉజ్బెకిస్తాన్‌లో జరగనుంది. ( చదవండి : పాక్‌లో మళ్లీ లాక్డౌన్.. ) -
కోవిడ్-19 : ప్రపంచానికి భారత్ బాసట
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి ప్రపంచానికి విసిరిన సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ ప్రపంచానికి బాసటగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ దేశంగా భారత్ ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు తన సామర్ధ్యాలను పూర్తిగా వినియోగించుకుని మానవాళికి సాయంగా నిలుస్తుందని చెప్పారు. 150 దేశాలకు భారత ఫార్మా పరిశ్రమ అత్యవసర ఔషధాలను పంపిందని ప్రధాని గుర్తుచేశారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) భేటీ సందర్భంగా మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. ఎస్సీఓ దేశాలతో భారత్‌కు దృఢమైన సాంస్కృతిక, చారిత్రక సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ భేటీలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ సహా పలువురు నేతలు పాల్గొని కోవిడ్-19తో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని నిరోధించే చర్యలపై చర్చించారు. ఉగ్రవాద ముప్పును ఎదుర్కోనే వ్యూహాలపైనా నేతలు సంప్రదింపులు జరిపారు. చదవండి : ‘దీపావళికి స్థానిక ఉత్పత్తులే కొనండి’ -
చైనా మంత్రి సమక్షంలో రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
మాస్కో : షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా మంత్రి సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పరస్పర విశ్వాసం, సంయమనం, సామరస్య పరిష్కారం, అంతర్జాతీయ నిబంధనలను గౌరవించడం ద్వారానే ఈ ప్రాంతంలో శాంతి సుస్ధిరత నెలకొల్పగలమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భద్రత, రక్షణ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించే ఎనిమిది దేశాల ఎస్సీఓలో భారత్, చైనా సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రపంచ జనాభాలో 40 శాతానికి పైగా జనాభా కలిగిన ఎస్సీఓ సభ్య దేశాల మధ్య పరస్పర సహకారం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి కీలకమని అన్నారు. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడం, ఒకరి ప్రయోజనాలను మరొకరు గుర్తెరగడం అవసరమని మాస్కోలో జరిగిన ఎస్సీఓ మంత్రుల భేటీలో రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెంఘే కూడా పాల్గొన్నారు. సరిహద్దు వివాదంతో భారత్-చైనాల మధ్య ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సరిహద్దు వెంబడి భారత్, చైనా యుద్ధ ట్యాంకులు, పదాతిదళాలతో మోహరించడంతో ఎప్పుడేం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. చదవండి : భారత్‌లోనే ఏకే–47 తయారీ! -
ఆ భేటీకి ప్లాన్ చేయలేదు!
న్యూఢిల్లీ: ఈ నెల 13, 14 తేదీల్లో కిర్జిస్తాన్ రాజధాని బిషక్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పాకిస్థాన్ అధినేత ఇమ్రాన్ ఖాన్ మధ్య సమావేశం ఉండబోదని భారత్ గురువారం స్పష్టం చేసింది. తనకు తెలిసినంతవరకు బిషక్‌లో ఎస్సీవో సదస్సు సందర్భంగా మోదీ, ఇమ్రాన్ ఖాన్ భేటీకి ప్లాన్ చేయలేదని, వారిద్దరి మధ్య సమావేశం ఉండే అవకాశం లేదని విదేశాంగ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ మీడియాకు తెలిపారు. ఎస్సీవో సదస్సు అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశముందా? అన్న ప్రశ్నకు కూడా.. అలాంటి అవకాశం లేదని, సమీప భవిష్యత్తులో ఇలాంటి చర్చల గురించి ప్లాన్ చేయలేదని ఆయన తేల్చిచెప్పారు. 2016లో పఠాన్‌కోట్ వైమానిక శిబిరంపై ఉగ్రవాద దాడి అనంతరం భారత్, దాయాది పాకిస్థాన్‌తో అధికారిక చర్చలను నిలిపివేసింది. ఉగ్రవాదం, చర్చలు కలిసిసాగలేవంటూ అప్పటినుంచి దాయాదితో ద్వైపాక్షిక చర్చలకు ఫుల్స్టాప్ పెట్టింది. ఈ నెల 13, 14 తేదీల్లో బిషక్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. అటు పాక్ ప్రధాని ఇమ్రాన్ కూడా ఈ సదస్సుకు వస్తుండటంతో వీరిద్దరు భేటీ కావొచ్చునని ఊహాగానాలు వినిపించాయి. -
ఉగ్రవాదంపై ఐక్య పోరాటం
కార్యాచరణ వివరించనున్న ప్రధాని మోదీ ► నేడు షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు ► ఎస్సీఓలో భారత్, పాక్‌లకు శాశ్వత సభ్యత్వం అస్తానా: కజకిస్తాన్ రాజధాని అస్తానాలో శుక్రవారం జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచానికి పెనుసవాలుగా మారిన ఉగ్రవాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గళం విప్పనున్నారు. వివిధ దేశాల్లో వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరాటానికి పటిష్టమైన అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళిక అవసరాన్ని ఆయన గట్టిగా వినిపించనున్నారు. ఎంతో కాలంగా భారత్, పాకిస్తాన్‌లు ఎదురుచూస్తున్న ఎస్సీఓ శాశ్వత సభ్యత్వానికి రంగం సిద్ధమైన నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది. 2001లో ఎస్సీఓ ఏర్పడిన తరువాత తొలిసారిగా విస్తరిస్తుండటం విశేషం. చైనా, రష్యా తదితర ప్రధాన మధ్య ఆసియా దేశాధినేతలు పాల్గొంటున్న ఈ సమావేశానికి హాజరయ్యేందుకు మోదీ గురువారం అస్తానా చేరుకున్నారు. ఆయన రెండు రోజులు ఇక్కడ పర్యటిస్తారు. ఆర్థిక, అనుసంధాన అంశాలతో పాటు ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో సహకారంపై ముందడుగు వేసేందుకు ఎస్సీఓ సమావేశం కీలకం కానుందని అస్తానా బయలుదేరేముందు మోదీ పేర్కొన్నారు. చైనా ఆధిపత్యం సాగుతున్న ఎస్సీఓలో శాశ్వత సభ్యత్వం ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలు, వాణిజ్య లావాదేవీల్లో భారత్‌కు మైలురాయిగా నిలుస్తుంది. భారత్, పాక్‌ల సభ్యత్వం... ఈ ప్రాంతాల్లో సవాళ్లను అధిగమించడానికి, వాణిజ్య, పెట్టుబడుల ప్రోత్సాహానికి దోహదపడుతుందని ఎస్సీఓ సెక్రటరీ జనరల్ రషీద్ అలిమోవ్ చెప్పారు. చైనా అధ్యక్షుడితో సమావేశం! ప్రధాని మోదీ ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. అణు ఇంధన సరఫరా బృందం (ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వ ప్రయత్నాలు, చైనా–పాక్ ఎకనామిక్ కారిడార్ సహా వివిధ అంశాల్లో ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది. కజక్ అధ్యక్షుడితో మోదీ భేటీ... అస్తానా చేరుకున్న మోదీ గురువారం కజకి స్తాన్ అధ్యక్షుడు నూర్సుల్తాన్ నజార్బ యేవ్ తో భేటీ అయ్యారు. మోదీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పలకరించుకున్నారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, పాక్ ప్రధాని షరీఫ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎస్సీఓలో పాల్గొంటున్నారు. -
ఎస్సీవో సభ్య దేశంగా భారత్
- ఇప్పటిదాకా పరిశీలక హోదా మాత్రమే - కూటమిలోని దేశాలకు మోదీ కృతజ్ఞతలు ఉఫా(రష్యా): షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో)లో భారత్‌కు ఇకపై పూర్తిస్థాయి సభ్యత్వం దక్కనుంది. గత పదేళ్లుగా ఈ కూటమిలో భారత్‌కు పరిశీలక దేశం హోదా మాత్రమే ఉంది. చైనా రాజధాని బీజింగ్ కేంద్రంగా ఉన్న ఎస్సీవోలో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్లు సభ్య దేశాలుగా ఉన్నాయి. వచ్చే ఏడాది నుంచి ఈ కూటమిలో భారత్ కూడా చేరనుంది. పాకిస్తాన్‌ను కూడా సభ్య దేశంగా చేర్చుకోనున్నారు. ‘భారత్‌ను పూర్తిస్థాయి సభ్య దేశంగా చేర్చుకునేందుకు అంగీకరించిన ఎస్సీవో దేశాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇది ఎస్సీవో సభ్య దేశాలతో ఉన్న సహజ సంబంధాలకు పొడిగింపు మాత్రమే. ఇది ఈ ప్రాంతంలో శాంతి, సంపద సృష్టికి ఎంతగానో దోహదపడుతుంది. కూటమిలో చేరబోయే పాక్‌కు కూడా అభినందనలు తెలుపుతున్నా’ అని శుక్రవారమిక్కడ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అంతకుముందు మోదీతోపాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సమక్షంలో సదస్సు జరిగింది. ఈ సమావేశంలో.. ఎస్సీవోలో భారత్‌కు సభ్యదేశం హోదా కల్పించాలని నిర్ణయించారు. ఎస్సీవో కూటమిలో 2005 నుంచి భారత్ పరిశీలక దేశంగా వ్యవహరిస్తోంది. పూర్తిస్థాయి సభ్య దేశంగా పరిగణించాలని కిందటేడాదే కూటమిని భారత్ కోరింది. ఉగ్రవాదంపై పోరు, ఇంధన రంగంలో సహకారం, ప్రాంతాల అనుసంధానం, వాణిజ్య బంధాల బలోపేతం, మత్తుపదార్థాల అక్రమ రవాణాకు చెక్ పెట్టే ఉద్దేశంతో ఎస్సీవో ఏర్పడింది. -
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో)
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) ఒక రాజకీయ, ఆర్థిక, సైనిక సంస్థ. ఇది 2001లో ఏర్పడింది. దీంట్లో చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇది మొదట 1996లో ‘షాంఘై ఫైవ్’గా ఏర్పాటైంది. 2001లో ఉజ్బెకిస్థాన్ చేరడంతో షాంఘై సహకార సంస్థగా పేరు మార్చారు. దీని ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్‌లో ఉంది. దీని ప్రస్తుత సెక్రటరీ జనరల్ రష్యాకు చెందిన డిమిత్రి మెజెంత్సెవ్. ఈ సంస్థకు భారత్, అఫ్గానిస్థాన్, ఇరాన్, మంగోలియా, పాకిస్థాన్ పరిశీలక దేశాలుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం సభ్యదేశాలను ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం నుంచి కాపాడటం. 13వ శిఖరాగ్ర సదస్సు:షాంఘై సహకార సంస్థ 13వ శిఖరాగ్ర సదస్సు 2014, సెప్టెంబర్ 11,12న తజికిస్థాన్ రాజధాని దుషాంబేలో జరిగింది. సదస్సుకు హాజరైన దేశాధినేతలు: ఇమోమలీ రహమాన్ తజికిస్థాన్ జీ జిన్‌పింగ్ చైనా వ్లాదిమిర్ పుతిన్ రష్యా నుర్‌సుల్తాన్ నజర్బయేవ్ కజకిస్థాన్ అల్మాజ్బెక్ అతంబయేవ్ కిర్గిజిస్థాన్ ఇస్లామ్ కరిమోవ్ - ఉజ్బెకిస్థాన్ ఈ సదస్సుకు భారత్ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరయ్యారు. ఎస్సీవో 14వ శిఖరాగ్ర సదస్సు 2015, జూలై 9,10న రష్యాలోని ఉఫా నగరంలో జరగనుంది. ఈ సదస్సులో భారత్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం లభించే అవకాశముంది. ఈ సమావేశాన్ని ఏడో బ్రిక్స్ సదస్సుతోపాటు నిర్వహించనున్నారు.