
అంతా సవ్యంగా ఉన్న రోజుల్లో భిన్న దేశాలతో దౌత్య సంబంధాలు సాఫీగా సాగి పోతాయి. కానీ సవాళ్లు ఎదురయ్యే కాలంలో వాటిని నిలబెట్టుకోవటం, కొత్త బంధాలు ఏర్పర్చుకోవటం సులభం కాదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైఖరి కారణంగా భారత్–అమెరికా సంబంధాల్లో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జపాన్‌లో రెండు రోజుల పర్యటన ప్రారంభించారు. ఈ నెల 31న, ఆ మర్నాడూ చైనాలోని తియాన్‌జిన్‌లో జరగబోయే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో కూడా ఆయన పాలుపంచుకుంటారు.
జపాన్‌తో మనకు చిరకాల మైత్రి ఉంది. మన స్వాతంత్య్రోద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్‌ఏ)ని స్థాపించి పోరాడినప్పుడు అన్ని విధాలా చేయూతనందించింది జపానే. స్వాతంత్య్రానంతరం ఆ బంధం మరింత బలపడింది. రెండో ప్రపంచ యుద్ధ పరిసమాప్తి అనంతరం లాంఛనంగా 1951 సెప్టెంబర్ 8న శాన్‌ఫ్రాన్సిస్కో శాంతి ఒప్పందం కుదిరినప్పుడు జపాన్‌కు పాక్షిక సార్వభౌమత్వం మాత్రమే ఇవ్వాలన్న నిబంధనను మన దేశం తీవ్రంగా వ్యతిరేకించి సంతకం చేసేందుకు నిరాకరించింది. అందుకు జపాన్ ఈనాటికీ మన పట్ల కృతజ్ఞతగా ఉంటుంది.
తొలిసారి 2014లో ఎన్డీయే సర్కారు ఏర్పడినప్పుడే మోదీ జపాన్‌ను సందర్శించారు. ఈ దశాబ్ద కాలంలో ఇరు దేశాల సంబంధాలూ మోదీ అన్నట్టు ఎన్నో రెట్లు పెరిగాయి. మన దేశంలో ప్రస్తుత జపాన్ పెట్టుబడుల విలువ 4,200 కోట్ల డాలర్లు. దేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మెట్రో రైలు ప్రాజెక్టులు జపాన్ ఆర్థిక సహకారంతో సాకారమయ్యాయి. ఢిల్లీ–ముంబై పారిశ్రామిక వాడ, సెమీకండక్టర్లు తదితరాలపై జపాన్ ముద్ర బలంగా ఉంది. ముంబై–అహ్మదాబాద్ మధ్య సాకారం కానున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అత్యాధునిక ఈ–10 రకం బుల్లెట్ రైలును అందించాలని జపాన్ నిర్ణయించింది.
వచ్చే పదేళ్లలో మన దేశంలో జపాన్ పెట్టుబడుల్ని పది లక్షల కోట్ల యెన్‌ల(6,800 కోట్ల డాలర్ల) స్థాయికి తీసుకెళ్లాలని మోదీ, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా శిఖరాగ్ర సమావేశంలో నిర్ణయించటం, పెట్టుబడులతోపాటు నవీకరణ, పర్యావరణం, ఆరోగ్యం తది తరాల్లో కలిసి పనిచేయాలనుకోవటం... రాగల అయిదేళ్లలో భిన్న రంగాల నిపుణుల సేవలు పొందేందుకు పరస్పరం అయిదు లక్షల మందిని బదలాయించుకోవాలను కోవటం భారత్, జపాన్‌ల మైత్రి పటిష్ఠతకు నిదర్శనం.
ఈ క్రమంలో సహజంగానే సవాళ్లుంటాయి. స్వేచ్ఛాయుత, శాంతియుత, సంపద్వంత ఇండో–పసిఫిక్ ఆవిర్భవించాలన్న నినాదం అమెరికా ఛత్రఛాయలో ఏర్పడింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంత సరిహద్దుల విషయంలో చైనాతో జపాన్‌కు తగాదా లేకున్నా, దాని దూకుడు పెద్ద సమస్యగా మారింది. చైనా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల జపాన్‌కు ఎగుమతుల సమస్య ఏర్పడుతోంది. చైనాను కట్టడి చేయాలన్న బృహత్తర పథకానికి ఈ వివాదం తోడ్పడుతుందని అమెరికా భావించి మనల్ని అందులో కీలక భాగస్వామిని చేసింది. సుంకాల వివాదంలో ఇది ఎటు పోతుందన్న ఆందోళన జపాన్‌కు సహజంగానే ఉంటుంది. అయితే తమ వైఖరి మారబోదని మోదీ చెప్పటం జపాన్‌కు ఊరటనిచ్చే అంశం.
ఇండో–పసిఫిక్ విషయంలో మన వైఖరి చైనాకు కంటగింపుగానే ఉండొచ్చు. జపా న్‌తో సంబంధాలు సుహృద్భావంతో ఉండగా, చైనాతో సంబంధాలు అందుకు భిన్నం. సుంకాల వివాదం నేపథ్యంలో భారత్ దగ్గరవుతుందన్న అంచనా చైనాకుంది. ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సుకు మోదీ వెళ్తారా వెళ్లరా అనే సంశయం మొదట్లో ఉన్నా... రష్యా చొరవతో అది సాధ్యపడుతోంది. ఇది సాన్నిహిత్యానికి దారి తీస్తుందా లేదా అన్నది చూడాలి. చైనా ఇప్పటికే ఎరువులు, అరుదైన ఖనిజాలు, సొరంగాల తవ్వకంలో తోడ్పడే యంత్ర సామగ్రి ఎగుమతులపై ఉన్న నిషేధాలు తొలగించటానికి సూత్రప్రాయంగాఅంగీకరించింది.
మోదీ చైనా పర్యటనలో ఈ విషయంలో మరింత స్పష్టత వస్తుంది. చైనాతో మన సంబంధాలు బలపడే సూచనలుండగా, ట్రంప్ సైతం చైనాతో సన్నిహితమై దక్షిణాసియాలో పలుకుబడి పెంచుకోవాలనుకుంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మన వ్యూహాత్మక ఆధిక్యతను నిలబెట్టుకుంటూ జపాన్, చైనాలతో సఖ్యత కుదుర్చుకోవటం దౌత్యపరంగా మనకు పెను సవాలే. మోదీ దీన్ని ఎలా ఛేదించగలరో చూడాలి.