
న్యూఢిల్లీ: షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు ద్వైపాక్షిక అంశాలను చర్చించారు. ఇందులో చైనా సరిహద్దుల నుంచి భారత్‌లోకి చొరబడుతున్న పాక్ టెర్రరిస్టుల అంశాన్ని కూడా ప్రధాని మోదీ.. జిన్‌పింగ్ వద్ద ప్రస్తావించారు. అయితే దీనికి చైనా తన సంపూర్ణ మద్దతును భారత్‌కు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈ విషయాన్ని భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ‘ జిన్‌పింగ్ వద్ద పాక్ ఉగ్రవాద కార్యకలాపాలను కూడా మోదీ ప్రస్తావించారు. ఇందుకు చైనా సానుకూలంగా స్పందించింది. టెర్రర్ కార్యకలాపాల వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తామని జిన్‌పింగ్ అన్నారు. ఎటువంటి ఉగ్రవాద చర్యల నిర్మూలనకైనా తమ మద్దతు ఉంటుందని జిన్‌పింగ్ అన్నారు. ఇరుదేశాలకు ప్రమాదంగా మారిన ఉగ్రవాద అంశాన్ని జిన్‌పింగ్ కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నారు. ఉగ్రవాద నిర్మూలనకు భారత్‌కు తమ వంతు సహకారం అందిస్తామన్నారు’ అని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు.
టియాంజిన్ నగరంలో ఎస్‌సీవో సదస్సులో పాల్గొన్న మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రాంతీయ శాంతి, ఆర్థిక స్థిరత్వం, సరిహద్దు ఉద్రిక్తతల తగ్గింపు, సాంకేతిక రంగాల్లో సహకారం పెంచుకునే వంటి అంశాలపై చర్చలు జరిగాయి.వాణిజ్య, టెక్నాలజీ, రక్షణ రంగాల్లో ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
భారత్-చైనా మధ్య స్థిరమైన, స్నేహపూర్వక సంబంధాలు ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, శ్రేయస్సుపై సానుకూల ప్రభావం చూపుతాయి అని ప్రధాని మోదీ తెలపడంతో ఇరు దేశాల సంబంధాలు బలోపేతం కావడానికి అడుగులు పడ్డాయి. ఈ పర్యటన ద్వారా భారత్ తన ప్రాంతీయ ప్రాబల్యాన్ని చాటింది. ఇది భారత్-చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉంది.