
మంగోలియా అధ్యక్షుడు ఖురెల్‌సుఖ్ ఉఖ్నాతో ప్రధాని మోదీ వ్యాఖ్య
ఇరువురు నేతల మధ్య కొనసాగిన ద్వైపాక్షిక చర్చలు
మంగోలియా పౌరులకు ఉచితంగా ఈ–వీసాలిస్తామన్న మోదీ
న్యూఢిల్లీ: మంగోలియా దేశాభివృద్ధిలో భారత్ విశ్వసనీయ భాగస్వామి పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నాలుగురోజుల భారత పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి చేరుకున్న మంగోలియా అధ్యక్షుడు ఉఖ్నా(Khurelsukh Ukhnaa) ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఉఖ్నా భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఇరువురి ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ మాట్లాడారు. ‘‘ భారత్, మంగోలియా బంధం కేవలం ద్వైపాక్షికం కాదు. అంతకుమించిన గాఢమైన, ఆత్మీయ, ఆధ్యాత్మిక బంధం. మన ఇరుదేశాల భాగస్వామ్యం ఇరు దేశాల ప్రజల సత్సంబంధాల్లో ప్రతిబింబిస్తోంది.
భారత్ అందించిన 1.7 బిలియన్ డాలర్ల ఆర్థికసాయంతో మంగోలియాలో చేపట్టిన చమురు శుద్ధి కర్మాగారం ప్రాజెక్ట్ ఆ దేశ ఇంధన రక్షణకు మరింత భద్రత చేకూరుస్తుంది. విదేశాల్లో భారత్ చేపట్టిన అతిపెద్ద అభివృద్ధి భాగస్వామ్య ప్రాజెక్ట్ ఇదే. ఇందులో మంగోలియా సిబ్బందితోపాటు 2,500 మందికిపైగా భారతీయ నిపుణులు పనిచేస్తూ ఈ ప్రాజెక్ట్‌ను సుసాధ్యం చేస్తున్నారు. ఇది మాత్రమేకాకుండా ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాల భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఇండో–పసిఫిక్‌లో స్వేచ్ఛా, సులభతర, సమగ్రత వాణిజ్యానికి ఇరుదేశాలు కృషిచేస్తున్నాయి. గ్లోబల్ సౌత్ వాణిని గట్టిగా ఇరుదేశాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మంగోలియా పౌరులకు భారత్ ఉచితంగా ఈ–వీసాలను అందించనుంది’’ అని మోదీ చెప్పారు.
పలు రంగాల్లో పరస్పర సహకారం
ఈ సందర్భంగా ఉఖ్నా భారత్‌ను పొగిడారు. ‘‘స్వచ్ఛ ఇంధన రంగంలో భారత్ అద్భుతంగా నాయకత్వ పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ సౌరకూటమిలోనూ భారత్ తనదైన కీలక భూమిక పోషిస్తోంది’’ అని శ్లాఘించారు. తర్వాత మోదీ మాట్లాడారు. ‘‘బౌద్ధమతం విషయంలో ఇరుదేశాలు తోబుట్టువులే. గౌతమ బుద్దుడి ముఖ్య శిష్యులైన సరిపుత్ర, మౌద్గల్యయానల పవిత్ర అవశేషాలు వచ్చే ఏడాది మంగోలియాకు భారత్ అప్పగించనుంది. గందన్ బౌద్ధారామానికి భారత్ త్వరలో ఒక సాంస్కృతిక ఉపాధ్యాయుడిని పంపనుంది. ఆయన అక్కడి బౌద్ధ ప్రాచీన ప్రతులను అధ్యయనం చేయనున్నారు.
మంగోలియాలో బౌద్ధమత వ్యాప్తికి నాటి బిహార్‌లోని పురాతన నలంద విశ్వవిద్యాలయం ఎంతగానో సాయపడింది. ఇప్పుడు అదే రీతిలో గందన్ మఠం, నలంద వర్సిటీల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తాం ’’అని మోదీ చెప్పారు. ‘‘లద్దాఖ్ స్వయంప్రతిపత్తి పర్వతప్రాంత అభివృద్ధి మండలి, మంగోలియాలోని అర్ఖాంగాయ్ ప్రావిన్స్‌ల మధ్య సాంస్కృతిక బంధం బలపడేందుకు మంగళవారం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. రక్షణ మొదలు భద్రత, ఇంధనం, గనులు, సమాచార సాంకేతికత, విద్య, ఆరోగ్యం, సంస్కృతిక సహకార రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యం, పరస్పర సహకారం మరింత బలపడింది’’ అని మోదీ అన్నారు. 1955లో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు మొదలయ్యాయి.