
చెన్నై: తమిళ అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్ ఇంటికి గురువారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో నీలగిరిలోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయగా.. కాల్ చేసిన ఆగంతకుడ్ని గుర్తించే పనిలో ఉన్నారు.
చెన్నై పోలీసులకు కాల్ చేసిన సదరు వ్యక్తి.. భవిష్యత్తులో విజయ్ గనుక పబ్లిక్ ర్యాలీలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఇంటిని బాంబుతో పేల్చేస్తానని హెచ్చరించినట్లు సమాచారం. ఆ కాల్ కోయంబత్తూరు నుంచి వచ్చినట్లు నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉంటే..
సెప్టెంబర్ 27వ తేదీన కరూర్‌లో నిర్వహించిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ఘటన తర్వాత విజయ్ కనీసం బాధితులను పరామర్శించకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆపై దాడులు జరిగే అవకాశం ఉండడంతో.. విజయ్ ఇంటికి పోలీసు భద్రతను పెంచారు.
ఈ ఘటనపై నమోదైన కేసులో టీవీకే నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తునకు తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయగా, మద్రాస్ హైకోర్టు సిట్ ఏర్పాటునకు ఆదేశించింది. అయితే టీవీకే మాత్రం ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని, సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థను నియమించాలని డిమాండ్ చేస్తోంది. ఇక.. కరూర్ ఘటన నేపథ్యంలో రాజకీయ సభలకు, ర్యాలీలకు ప్రత్యేకమైన మార్గదర్శకాలను రూపొందించే పనిలో తమిళనాడు ప్రభుత్వం ఉంది. ఆ మార్గదర్శకాలను జారీ చేసే దాకా.. తమిళనాడులో ఏ పార్టీకి ఎలాంటి సభలకు, ర్యాలీలకు అనుమతులు ఇవ్వబోమని ఇప్పటికే మద్రాస్ హైకోర్టుకు స్పష్టం చేసింది కూడా.
ఇదిలా ఉంటే.. తమిళనాడు (Tamil Nadu)లో వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. గతకొంతకాలంగా సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లతో పాటు పలు ప్రదేశాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సినీ తారలు త్రిష, నయనతార నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి, డీజీపీ ఆఫీసుకి, రాజ్‌భవన్‌కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమై క్షుణ్ణంగా తనిఖీలు జరిపి.. ఆ బెదిరింపులు ఉత్తవేనని తేల్చాయి.
ఇదీ చదవండి: కరూర్ బాధితులకు విజయ్ పరామర్శ