
చెన్నై: కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలను విజయ్ ఇవాళ (మంగళవారం అక్టోబర్ 7) వీడియో కాల్‌లో పరామర్శించారు. వారిని ఓదార్చిన విజయ్.. త్వరలో కరూర్‌లో పర్యటిస్తానని తెలిపారు.
"నేను మీతో ఉన్నాను, మీకు అండగా ఉంటానని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. అయితే, వీడియో కాల్ సమయంలో ఫోటోలు తీసుకోవద్దని.. రికార్డ్ చేయవద్దని ఆయన బృందం కోరింది. ప్రతి వీడియో కాల్ సుమారు 20 నిమిషాల పాటు సాగిందని సమాచారం. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో కరూర్ తొక్కిసలాట తమిళనాడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
విజయ్ ర్యాలీలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే పార్టీకి చెందిన కొందరు నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, మొదట వ్యతిరేకించిన కోర్టు.. ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. కాగా, టీవీకే పార్టీకి 10 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ సుమారు 30 వేల మందికి పైగా హాజరయ్యారు. భారీగా జనం హాజరవుతారని అధికారులు ముందుగా అంచనా వేయలేకపోయారు.