తమిళనాడులో దారుణం జరిగింది. ప్రముఖ నటి విష్ణుప్రియ తండ్రి సూర్యనారాయణ(73) హత్యకు గురయ్యారు. ఈ విషయం ఇప్పుడు కలకలం సృష్టించింది. కొందరు దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అలానే మృతుడి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, ఉంగరం లాంటి విలువైన వస్తువులు తీసుకుని పరారయ్యారు.
సూర్యనారాయణ.. కొడైక్కెనాల్ సమీపంలోని కురించి ఆండవర్ కోయిల్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈయనకు అక్కడే ఓ పెద్ద బంగ్లా కూడా ఉంది. అందులో ఆరుముగం, మురళి అనే ఇద్దరు పనివాళ్లు కూడా ఉన్నారు. రెండురోజుల క్రితం విహారయాత్ర కోసం అని వచ్చిన ఐదుగురు వ్యక్తులు.. దగ్గరలో బసకు దిగారు. శనివారం రాత్రి, బంగ్లా దగ్గరకు వచ్చిన వ్యక్తులు.. పనిమనుషులని చితకబాదారు. తర్వాత సూర్యనారాయణ ముఖానికి టేప్ చుట్టి దారుణంగా హింసించారు. ఈ క్రమంలోనే ఆయన ఊపిరాడక చనిపోయారు.
సూర్యనారాయణని హత్య చేసిన అనంతరం ఆయన మెడలోని బంగారు గొలుసు, ఉంగరంతో పాటు సీసీటీవీల హార్ట్ డిస్క్‌లు తీసుకుని పరారయ్యారు. కాగా సూర్య 'మాయావి' సినిమాలో సహాయ నటిగా చేసిన విష్ణుప్రియ కాస్త గుర్తింపు తెచ్చుకుంది. 2018లో ఈమెని ప్రేమించిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇప్పుడు సూర్యనారాయణ హత్యకు.. అప్పటి హత్యకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


