
న్యూఢిల్లీ: భారత్‌పై 50శాతం టారిఫ్ విధింపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. నవంబర్ 30 తర్వాత భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై అందుబాటులోకి రానున్న 50శాతం టారిఫ్‌లో 25 శాతం పెనాల్టీ టారిఫ్‌ను రద్దు చేయనున్నట్లు సమాచారం
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుందని.. ఫలితంగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతోందంటూ భారత్‌పై ట్రంప్ టారిఫ్‌తో పాటు పెనాల్టీ టారిఫ్ 25శాతం విధించారు. ఆ పెనాల్టీ టారిఫ్ విషయంలో భారత్-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఆ చర్చలు సఫలమై.. పెనాల్టీ టారిఫ్‌ను తొలగించే అవకాశం ఉందంటూ కేంద్ర చీఫ్ ఎకనమిక్స్ అడ్వైజర్ (సీఈఏ)వీ అనంత నాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
గురువారం కోల్‌కతా మర్చంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎంసీసీఐ)సమావేశంలో వీ. అనంత నాగేశ్వరన్ మాట్లాడారు. మనదేశం నుంచి ఎగుమతయ్యే పలు ఉత్పత్తులపై 25శాతం ప్రతీకార సుంకం చెల్లించడంతో పాటు పెనాల్టీ కింద మరో 25శాతం.. మొత్తంగా 50శాతం టారిఫ్ చెల్లించేందుకు సిద్ధపడ్డాం. కానీ ఇకపై మనకు ఆ అవసరం ఉండదని నేను భావిస్తున్నాను.
25 శాతం పెనాల్టీ సుంకానికి భౌగోళిక రాజకీయ పరిస్థితులు కారణం. కానీ గత రెండు వారాలలో జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే నవంబర్ 30 తర్వాత 25శాతం జరిమానా సుంకం ఉండదని నేను నమ్ముతున్నాను. రాబోయే రెండు నెలల్లో ప్రతీకార సుంకంతో పాటు జరిమానా పరస్పర సుంకాలపై పరిష్కారం లభిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలతో భారత్‌పై టారిఫ్‌ల విషయంలో ట్రంప్ యూటర్న్ తీసుకునే అవకాశం ఉందంటూ ఆర్ధిక నిపుణుల అంచనా.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 1977లో రూపొందించిన ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్స్ పవర్ యాక్ట్ (ఐఈఈపీఏ) చట్టాన్ని ప్రస్తావిస్తూ, విదేశీ అత్యవసర పరిస్థితుల సమయంలో ఆర్థిక నియంత్రణలు, శిక్షలు విధించేందుకు ఈ చట్టాన్ని ఉపయోగించారు. ఈ చట్టం ఆధారంగా మనదేశంపై మొదట 25శాతం టారిఫ్‌లు విధించగా, ఇప్పుడు వాటిని 50శాతానికి పెంచారు.