ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మరాఠా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు దశాబ్దాలుగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న ఠాక్రే సోదరులు చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. కలిసికట్టుగా ముంబై ఎన్నికల బరిలోనే నిలిచేందుకు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ముందడుగు పడిందని, ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మున్ముందు ముంబై రాజకీయాలు మరింత రసవత్తరంగా ఉంటాయి.
ముంబై రాజకీయాలు అనగానే ముందుగానే ఠాక్రే కుటుంబం గుర్తుకు వస్తుంది. మరాఠా పులిగా పేరొందిన బాల్ ఠాక్రే (Bal Thackeray) మహారాష్ట్రలో రాజకీయాలను శాసించారు. ఆయన తర్వాత శివసేన పార్టీ చాలా అటుపోట్లు ఎదుర్కొంది. ప్రస్తుతం రెండు పార్టీలుగా కొనసాగుతోంది. శివసేన పార్టీని ఏక్‌నాథ్ షిండే దక్కించుకోవడంతో బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే.. శివసేన(యూబీటీ) పేరుతో పార్టీని నడుపుతున్నారు. శివసేను చీల్చి బీజేపీతో ఏక్‌నాథ్ షిండే చేతులు కలపడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఎన్నో మలుపు తిరిగాయి. ఈ క్రమంతో ఉద్ధవ్ ఠాక్రేపై సానుభూతి పెరిగింది. రెండు దశాబ్దాల వైరాన్ని వీడి రాజ్‌ఠాక్రే తన సోదరుడి చెంతకు వచ్చారు. కష్టకాలంలో సోదరుడికి అండగా నిలిచారు.
ముంబై సహా 29 కార్పొరేషన్లకు జనవరి 15న జరగనున్న ఎన్నికల్లో కలిసికట్టుగా బరిలోకి దిగాలని ఠాక్రే సోదరులు నిర్ణయించారు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా జరిపాయి. చర్చలు ఫలించాయని, సీట్ల పంపిణీపై స్పష్టత వచ్చిందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో.. శరద్‌పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా తమ రెండు పార్టీల అభ్యర్థులనే పోటీకి దించాలని ఉద్ధవ్, రాజ్ ఠాక్రే నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తియిందని, అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని తెలుస్తోంది.
బీఎంసీలో మొత్తం 227 వార్డులుండగా.. శివసేన (యూబీటీ) 157, మహారాష్ట్ర నవనిర్మాణ సేన 70 స్థానాల్లో పోటీకి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ శరద్ పవార్ (Sharad Pawar) పార్టీకి ఇవ్వాల్సివస్తే ఉద్ధవ్ పార్టీ నుంచి 15 సీట్లు కేటాయిస్తారని చెబుతున్నారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన (యూబీటీ), ఎమ్మెన్నెస్ కలిసి పోటీ చేస్తే.. రెండు దశాబ్దాలలో ఠాక్రే వారసులు ప్రత్యర్థులుగా కాకుండా మిత్రులుగా పోటీ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది.
కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?
మహా వికాస్ అఘాడీలో శివసేన(యూబీటీ), శరద్ పవార్ ఎన్సీపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉంది. అయితే బీఎంసీ ఎన్నికల్లో ఠాక్రే సోదరులు చేతులు కలపడంతో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హస్తం పార్టీని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదనట్టుగా శివసేన నాయకులు మాట్లాడుతున్నారు. ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి ఆనంద్ దూబే చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ వరుసగా ఓడిపోతూనే ఉందని, అలాంటి పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. తమకు, ఇతర పార్టీలకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నందున ఈమేరకు ఆలోచిస్తున్నామని కాంగ్రెస్ నాయకుడు సచిన్ సావంత్ వెల్లడించారు.
చదవండి: కాంగ్రెస్‌లో చీలికలేంటి?
కలిసి సాధిస్తారా?
గత కొంత కాలంగా ఉద్ధవ్ ఠాక్రేకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. 288 మున్సిపల్ కౌన్సిళ్లు, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి (Mahayuti) ప్రభుత్వం విజయదుందుభి మోగించింది. 207 చోట్ల గెలుపు సాధించి సత్తా చాటింది. విపక్ష మహా వికాస్ అఘాడీ 44 స్థానాలకే పరిమితమైంది. శివసేన(యూబీటీ)కి కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలంటే బీఎంసీ ఎన్నికల్లో నిరూపించుకోవడం చాలా అవసరం. తమ కుటుంబానికి కంచుకోట అయిన మహారాష్ట్ర రాజధానిలో కలిసికట్టుగా బరిలోకి దిగుతున్న ఠాక్రే సోదరులు ఈసారి ఎలాంటి ఫలితాలు రాబడతారో చూడాలి.


