మహారాష్ట్రలో బిగ్‌ ట్విస్ట్‌.. బీజేపీ, ఉద్దవ్‌ సేనకు ఝలక్‌ | Shinde Sena And MNS tie-up mayor bid in Kalyan-Dombivli | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో బిగ్‌ ట్విస్ట్‌.. బీజేపీ, ఉద్దవ్‌ సేనకు ఝలక్‌

Jan 21 2026 4:03 PM | Updated on Jan 21 2026 4:09 PM

Shinde Sena And MNS tie-up mayor bid in Kalyan-Dombivli

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్దవ్‌ థాక్రేకు తన సోదరుడు బాల్‌ థాక్రే ఊహించని షాకిచ్చారు. పదవుల కోసం మరోసారి శివసేనను రెండుగా చీల్చిన ఏక్‌నాథ్ షిండేతో రాజ్‌థాక్రే చేతులు కలిపారు. శివసేన (యూబీటీ) బద్ద శత్రువైన షిండేతో రాజ్ థాక్రే చేతులు కలపడం మహారాష్ట్ర పాలిటిక్స్‎లో సంచలనంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి సత్తా చాటింది. ఈ క్రమంలో కళ్యాణ్-డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ)లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) మద్దతు ఇచ్చింది. అయితే.. స్థానిక ఎంఎన్ఎస్ నాయకుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంఎన్ఎస్ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. కళ్యాణ్-డోంబివిలి ప్రాంతంలో అభివృద్ధి ప్రయోజనాల దృష్ట్యా షిండే నేతృత్వంలోని శివసేనకు మద్దతు ఇవ్వాలనే నిర్ణయం స్థానిక నాయకత్వం తీసుకుందని ఆ పార్టీ తెలిపింది. 122 మంది సభ్యులు ఉన్న కళ్యాణ్‌-డొంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి 50, షిండే సేనకు 53, ఎంఎన్ఎస్‌కు 05, ఉద్ధవ్ థాక్రే శివసేన యూబీటీ 11 స్థానాలను గెలుచుకుంది. కేడీఎంసీని దక్కించుకోవడానికి మ్యాజిక్ ఫిగర్ 62 కావాలి. ఈ నేపథ్యంలో బీజేపీకి మేయర్ పదవి దక్కకుండా రెండు పార్టీలు కలిసి అడ్డుకున్నాయి.

బీజేపీకి నో చాన్స్‌..
అయితే, శివసేన-బీజేపీలు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వాములు అయినప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం మేయర్ పదవుల్ని దక్కించుకోవడానికి పొరాడుతున్నాయి. బుధవారం కొంకణ్ భవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత, శివసేన ఎంపీ మరియు ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్, రాజ్‌థాక్రే పార్టీతో పొత్తును ధృవీకరించారు. ఇది వారి బలాన్ని 58కి పెంచుతుంది. ఉద్ధవ్ వర్గం నుంచి మరో నలుగురు కార్పొరేటర్లు ఈ కూటమిలో చేరవచ్చని శ్రీకాంత్ చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ అధికారాన్ని పంచుకునే పరిస్థితి లేకుండా చేసింది. మరోవైపు.. ఎంఎన్ఎస్ నిర్ణయంపై ఉద్ధవ్ థాక్రే ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది.  

ఉద్దవ్‌ వర్గానికి ఎదురుదెబ్బ!
ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో రాజకీయం ఎప్పుడు ఎలాంటి టర్న్‌ తీసుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రలో మున్సిపల్‌ ఎన్నికలకు ముందు 20 ఏళ్ల ఈగోను పక్కన బెట్టి థాక్రే సోదరులు మళ్లీ ఒక్కటయ్యారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), రాజ్ థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పార్టీలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. థాక్రే బ్రదర్స్ రీయూనియన్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. వీరి కలయిక మాత్రం రెండు పార్టీల కేడర్‎లో నూతనోత్తేజాన్ని నింపింది. కానీ, ఎన్నికలు ముగిసి పట్టుమని పది రోజులు కూడా కాకుండానే రాజ్‎థాక్రే ఇలా ట్విస్ట్‌ ఇవ్వడం ఉద్దవ్‌ వర్గానికి ఎదురుదెబ్బ అని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement