ముంబై: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చిరకాల ప్రత్యర్థులు, దాయాదులైన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం నాటి భారీ బహిరంగ సభలో చేతులు కలిపారు. మరాఠీ అస్తిత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా వీరిద్దరూ గళమెత్తారు. జనవరి 15న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, మరాఠీ ఓటర్లను ఏకీకృతం చేసేందుకు ఈ ఉమ్మడి వేదికను ఉపయోగించుకున్నారు.
ఈ బహిరంగ సభలో రాజ్ ఠాక్రే.. ఉత్తరప్రదేశ్, బీహార్ వలసదారులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘హిందీ మీ భాష కాదని యూపీ, బీహార్ ప్రజలు గుర్తించాలి. నాకు ఆ భాషపై ద్వేషం లేదు.. కానీ దానిని మాపై రుద్దాలని చూస్తే మాత్రం సహించేది లేదు’ తరిమికొడతాం’ అంటూ ఘాటుగా హెచ్చరించారు. మహారాష్ట్రకు దేశం నలుమూలల నుంచి వస్తున్న వారు స్థానికుల అవకాశాలను కొల్లగొడుతున్నారని, భాషా సంస్కృతులను కాపాడుకోకపోతే మరాఠీ ప్రజల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మరాఠీ మనుషుల ఉనికిని చాటుకునే చివరి ఎన్నికలని ఆయన అభివర్ణించారు.
శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ముంబై నగరం ఎదుర్కొంటున్న ముప్పును గుర్తించి, తాము విభేదాలను పక్కన పెట్టి, ఏకమయ్యామని స్పష్టం చేశారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలు మహారాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు. బీజేపీది నకిలీ హిందుత్వమని, ఎన్నికల సమయంలో ప్రజలను విడదీయడమే వారి పని అని విమర్శించారు. ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేసి అంతర్జాతీయ నగరంగా మార్చే కుట్ర జరుగుతున్నదని, ముంబైని గుజరాత్ ఆర్థిక పరిధిలోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆయన మండిపడ్డారు.
ముంబై సంపదను బీజేపీ లూటీ చేస్తున్నదని ఠాక్రే సోదరులు సంయుక్తంగా ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదానీ గ్రూపునకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని, వధవన్ పోర్టు వంటి ప్రాజెక్టుల ద్వారా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌ను గుజరాత్‌తో అనుసంధానించాలని చూస్తున్నారని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. బీఎంసీ తమ చేతుల్లో ఉంటేనే ముంబై భూములను అదానీకి బీజేపీ అమ్మకుండా అడ్డుకోగలమని ఓటర్లకు పిలుపునిచ్చారు. పోలింగ్ రోజున కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి, రిగ్గింగ్‌ను అడ్డుకోవాలని రాజ్ ఠాక్రే కోరారు.
ఇది కూడా చదవండి: భారత్ చేరుకున్న జర్మనీ చాన్స్‌లర్.. ప్రధాని మోదీతో భేటీ


