న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోనలుగురి హత్య తీవ్ర కలకలం రేపింది.
వీరిలో గర్భిణీ, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. హత్యలు జరిగిన తీరు చేసిన పోలీసులే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం బిహార్‌లోని పాట్నా జిల్లాకు చెందినఈ కుటుంబం ఢిల్లీలోని సమయ్‌పూర్ బద్లీలో గత రెండేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. కేవత్ ఆజాద్‌పూర్ మండిలో కూరగాయల విక్రేతగా పనిచేస్తున్నాడు. అయితే బుధవారం అద్దె ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ గదిలో అనిత (30), మూడు, నాలుగు, ఐదేళ్ల వయస్సున్న ఆమె కుమార్తెలు మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. వీరిని అత్యంత పాశవికంగా గొంతు కోసి హత్య చేసినట్టు తెలుస్తోంది.ఉదయం 8 గంటల ప్రాంతంలో సమీప బంధువు పోలీసులుకు, ఇతరులకు సమాచారం ఇవ్వడం విషయం వెలుగులోకి వచ్చింది. భర్త కేవత్ పరారీలో ఉండటంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఈ సంఘటనతో పొరుగువారు కూడా ఒక్కపారిగా షాక్‌కు గురయ్యారు. మొదట్లో కొంచెం గొడవపడినా, వీరంతా ఆ తరువాత సంతోషంగా ఉండేవారని పొరుగువారు చెప్పారు. అటుఅనిత వదిన, 36 ఏళ్ల సుగ్ని దేవి మాట్లాడుతూ, తన 10 ఏళ్ల కుమారుడు రక్తపు మడుగులో పడి వున్నవారిని గుర్తించి తమకు సమాచారం ఇచ్చారని, ఆ జంట మధ్య ఎటువంటి వైవాహిక విభేదాలు లేవని, అంతా బాగానే ఉందని చెబుతోంది. ఇద్దరూ చాలా ప్రేమగా ఉండేవారని మరో వదిన సోని దేవి వాపోయింది.
మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వారి మధ్య గొడవ జరిగిందని. కేవత్ తన భార్య, పిల్లలపై దాడి చేయడానికి ముందు వారిని మద్యం తాగించి ఉండవచ్చని ప్రాథమికంగా తేలిందని, నిర్దిష్ట కారణం వెలుగులోకి రాలేదని పోలీసు అధికారి తెలిపారు, వివాహేతర సంబంధం, మగపిల్లవాడి కోసం, సహా ఇతర అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. భర్తను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. హత్య వెనుక గల ఉద్దేశ్యాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు పారిపోయినట్టు గుర్తించారు.క్రైమ్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందాలు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించాయి. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. దర్యాప్తు కొనసాగుతోంది.


