పండ్లపై ఎలుకల మందు.. షాకవుతున్న జనం! | Fruit Sellers Arrested After Caught On Camera Rubbing Rat Poison On Fruits In Mumbai, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

పండ్లపై ఎలుకల మందు.. షాకవుతున్న జనం!

Feb 26 2026 10:13 AM | Updated on Feb 26 2026 10:50 AM

Fruit Sellers Caught on Camera Rubbing Rat Poison on Fruits

ముంబై: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పండ్ల వ్యాపారుల ఉదంతం వెలుగు చూపింది. అత్యంత ప్రమాదకరమైన ఎలుకల మందును పండ్లపై పూస్తున్న ఇద్దరు వ్యాపారులను ముంబైలోని మలాడ్ వెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో  స్థానికంగా కలకలం రేపింది. మలాడ్ పశ్చిమ ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న పండ్ల దుకాణం వద్ద ఒక వ్యాపారి అరటి పండ్లపై ‘రాటోల్’ అనే క్రీమ్ తరహా విషపూరిత పదార్థాన్ని  రాస్తుందటం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది.

ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన మలాడ్ పోలీసులు సదరు పండ్ల దుకాణంపై దాడి చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా ఘటనా స్థలంలో ‘రాటోల్’ అనే ఎలుకల మందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మందులో ‘ఎల్లో ఫాస్ఫరస్’ వంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయని అధికారులు తెలిపారు. నిందితులను మలాడ్ వెస్ట్‌లోని రాజన్‌పాడకు చెందిన మనోజ్ సంగంలాల్ కేసర్వానీ (42), రాహుల్ సదన్ లాల్ కేసర్వానీ (25)గా గుర్తించి, వారిపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 

బుధవారం వీరిని బోరివలిలోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఆ పండ్ల దుకాణాన్ని పోలీసులు సీజ్ చేశారు.
పోలీసుల విచారణలో నిందితులు విస్తుపోయే వివరాలు వెల్లడించారు. రాత్రి వేళల్లో ఎలుకలు తమ పండ్ల స్టాక్‌ను పాడు చేయకుండా ఉండేందుకే తాము ఆ మందును పూస్తున్నామని, వినియోగదారులకు హాని చేయాలనే ఉద్దేశ్యం తమకు లేదని వారు అన్నారు.  కాగా ఆహార పదార్థాలపై ఇటువంటి విషపూరిత రసాయనాలను వాడటం క్షమించరాని నేరమని ఆరోగ్య నిపుణులు  అంటున్నారు.

ఎల్లో ఫాస్ఫరస్ వంటి రసాయనాలు శరీరంలోకి చేరితే వాంతులు, తీవ్రమైన కడుపునొప్పి, కాలేయ సంబంధిత వ్యాధులు సంభవించడమే కాకుండా, అవయవాలు వైఫల్యం చెంది ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వారు వివరిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA),  బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు నగరవ్యాప్తంగా పండ్ల దుకాణాలపై నిఘా ఉంచాలని, తనిఖీలను ముమ్మరం చేయాలని ముంబై వాసులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: మోదీ స్టైల్‌లో నెతన్యాహు.. అంతటా ఇదే చర్చ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement