పోలీసు Vs పోలీసు.. కాంగ్రెస్‌ కార్యకర్తల అరెస్ట్‌తో ఉద్రిక్తత | Shimla Police registered kidnapping case against Delhi Police Delhi AI Summit | Sakshi
Sakshi News home page

పోలీసు Vs పోలీసు.. కాంగ్రెస్‌ కార్యకర్తల అరెస్ట్‌తో ఉద్రిక్తత

Feb 26 2026 8:47 AM | Updated on Feb 26 2026 10:06 AM

Shimla Police registered kidnapping case against Delhi Police Delhi AI Summit

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలకు అరెస్ట్‌ కారణంగా ఢిల్లీ పోలీసులు, హిమాచల్‌ పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో​, సిమ్లాలో బుధవారం అర్ధరాత్రి హైడ్రామా కొనసాగింది. చివరకు మేజిస్ట్రేట్‌ నుంచి రిమాండ్‌ ఆర్డర్‌ రావడంతో ఈ వివాదానికి తెరపడింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన ఏఐ సమ్మిట్‌ యూత్‌ కాంగ్రెస్‌ నేతలు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. వీరిలో హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యూత్‌ కాంగ్రెస్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో సిమ్లాలోని ఒక హోటల్‌లో ఉన్న సౌరభ్, సిద్ధార్థ్, అర్బాజ్‌లను అరెస్ట్‌ చేసేందుకు ఢిల్లీ పోలీసులు.. బుధవారం హిమాచల్‌ ప్రదేశ్‌కు వెళ్లారు. వీరిని పోలీసులు అరెస్ట్‌ చేసిన అనంతరం.. హిమాచల్‌ ప్రదేశ్‌ పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ పోలీసులు మఫ్టీలో రావడంతో కిడ్నాప్‌ చేశారని ఆరోపించారు. అలాగే, ముగ్గురి అరెస్ట్‌కు సంబంధించి విధి విధానాలు పాటించలేదని హిమాచల్‌ పోలీసులు.. ఢిల్లీ పోలీసులను అడ్డుకున్నారు. దీంతో, ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.

 

అనంతరం, ఢిల్లీ పోలీసులు.. ముగ్గుర్ని రాత్రి అదనపు చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా.. వారికి కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ ఇచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు వారిని రాజధానికి తీసుకెళ్లే అనుమతి పొందారు. అనంతరం, ఢిల్లీ వెళ్తున్న క్రమంలో గురువారం తెల్లవారుజామున మరోసారి వారిని హిమాచల్‌ పోలీసులు అడ్డుకున్నారు. చివరికి ఢిల్లీ పోలీసులు సీజ్ మెమో కాపీని చూపించడంతో హిమాచల్ పోలీసులు వెనక్కి తగ్గారు. అయితే, హిమాచల్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్న కారణంగానే ఇలా జరిగిందని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement