‘ఇన్‌స్టా’లో ప్రధాని మోదీ రికార్డు.. ట్రంప్‌ ఎక్కడంటే.. | PM Modi becomes first world leader to cross 100 million followers on Instagram | Sakshi
Sakshi News home page

‘ఇన్‌స్టా’లో ప్రధాని మోదీ రికార్డు.. ట్రంప్‌ ఎక్కడంటే..

Feb 26 2026 7:07 AM | Updated on Feb 27 2026 2:29 PM

PM Modi becomes first world leader to cross 100 million followers on Instagram

న్యూఢిల్లీ: ప్రపంచ వేదికలపై తిరుగులేని ప్రజాదరణతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో మరో సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ‘ఇన్‌స్టాగ్రామ్’లో 100 మిలియన్ల (10 కోట్ల) ఫాలోవర్ల మార్కును దాటిన తొలి ప్రపంచ నేతగా ప్రధాని మోదీ నిలిచారు. అంతర్జాతీయ నేతలతో పోలిస్తే ప్రధానమంత్రి మోదీ ప్రజాదరణ అందనంత ఎత్తులో ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 43.2 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉన్నారు. 

2014లో ఈ ప్లాట్‌ఫారమ్‌లో అడుగుపెట్టిన ప్రధాని మోదీ గత దశాబ్ద కాలంలో తన డిజిటల్ ఉనికిని అమితంగా చాటుకున్నారు. కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ యువతను ఆకర్షించడంలోనూ ఆయన ముందున్నారు. మోదీ సాధించిన ఈ ఘనత ఎంతటిదంటే.. ప్రపంచంలోని తదుపరి ఐదుగురు ప్రముఖ దేశాధినేతల మొత్తం ఫాలోవర్ల సంఖ్యను కలిపినా, అది మోదీ వ్యక్తిగత ఫాలోవర్ల సంఖ్య కంటే తక్కువగా ఉండటం గమనార్హం.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 43.2 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉండగా, మోదీ ఆయన కంటే రెట్టింపు కంటే ఎక్కువ ఫాలోవర్లను కలిగి ఉన్నారు. వీరి తర్వాత ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో (15 మిలియన్లు), బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా (14.4 మిలియన్లు), టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ (11.6 మిలియన్లు) వరుస స్థానాల్లో నిలిచారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ 6.4 మిలియన్ల ఫాలోవర్లతో జాబితాలో కొనసాగుతున్నారు.

దేశీయ రాజకీయాల్లోనూ ఇతర నేతలతో పోలిస్తే ప్రధానమంత్రికి ఉన్న ఆదరణ  అమితంగా ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 16.1 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉండగా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సుమారు 12.6 మిలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో నిలిచారు. కేవలం సోషల్ మీడియా ఫాలోయింగ్‌లోనే కాకుండా, ప్రపంచ నేతల ‘అప్రూవల్ రేటింగ్’ (ఆమోదయోగ్యత)లోనూ మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. స్టాటిస్టా నివేదిక ప్రకారం 2025 డిసెంబర్ నాటికి ప్రధాని మోదీ 70 శాతం రేటింగ్‌తో ప్రథమ స్థానంలో ఉండగా, జపాన్ ప్రధాని సనే తకైచి (63 శాతం), అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ (60 శాతం) తరువాతి స్థానాల్లో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 43 శాతం రేటింగ్‌తో 11వ స్థానానికి పరిమితమయ్యారు.

ప్రముఖ అంతర్జాతీయ బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘మోర్నింగ్ కన్సల్ట్’ విడుదల చేసిన గణాంకాలు సైతం మోదీదే పైచేయి అని చెబుతున్నాయి. 2026 ఫిబ్రవరి 2 నుంచి 8 మధ్య సేకరించిన సమాచారం ప్రకారం 67 శాతం ఆమోదయోగ్యతతో మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నిలిచారు. చెక్ రిపబ్లిక్ నేత ఆండ్రెజ్ బాబిస్ (59 శాతం) రెండో స్థానంలో నిలవగా, డొనాల్డ్ ట్రంప్ 40 శాతంతో 11వ స్థానంలోనే కొనసాగుతున్నారు. అంతకుముందు 2025 నాటి డేటాలోనూ 75 శాతం రేటింగ్‌తో మోదీ అగ్రస్థానంలో నిలవగా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ 59 శాతంతో తర్వాతి స్థానంలో నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement