దానిపై పోరులో రాజీ లేదు: మోదీ
భారత్, ఇజ్రాయెల్‌ది ఒకే వైఖరి
ఆ దేశానికి దన్నుగా నిలుస్తాం
గాజా శాంతి చర్చలకు మద్దతు
ఇజ్రాయెల్ పార్లమెంటు కెనెసెట్‌లో ప్రధాని ప్రసంగం
ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లోనూ సమూలంగా అంతం చేయడమే భారత్ లక్ష్యం. ఈ విషయంలో భారత్, ఇజ్రాయెల్‌ది ఒకే వైఖరి. ఎవరేమన్నా, ఎన్ని చెప్పినా ఉగ్రవాదం ఏవిధంగానూ సమర్థనీయం కాదు. ఈ విషయంలో మరో మాటకు తావు లేదు. ఇజ్రాయెలీలపై హమాస్ పాల్పడ్డ ఆటవిక దాడి తాలూకు బాధను భారతీయులందరమూ అనుభవించాం. ఇజ్రాయెలీ సోదరుల అంతులేని ఆవేదనను మేమంతా పంచుకున్నాం.
ఎందుకంటే ఉగ్రవాదం తాలూకు నొప్పిని భారత్ చాలాకాలంగా అనుభవిస్తూ వస్తోంది. రక్షణ, వ్యవసాయ, వాణిజ్య తదితర రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యం మున్ముందు మరింత బలోపేతం చేసుకుంటాం. అంతేగాక భారత్, ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికాలతో కూడిన ‘మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్’, ‘ఐ2యూ2 ఫ్రేమ్‌వర్క్’ల్లో కూడా మరింత చురుగ్గా భాగస్వాములం అవుతాం.
– ప్రధాని నరేంద్ర మోదీ
జెరూసలెం: ఉగ్రవాదం ఏ మూలన, ఏ రూపంలో ఉన్నా ప్రపంచమంతటికీ అది పెను ముప్పేనని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘‘ఉగ్రవాదంపై పోరులో రాజీ పడే ప్రసక్తే లేదు. దాన్ని అన్ని రూపాల్లోనూ సమూలంగా అంతం చేయడమే భారత లక్ష్యం. ఈ విషయంలో భారత్, ఇజ్రాయెల్‌లది ఒకే వైఖరి’’ అని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ఆయన బుధవారం ఆ దేశ పార్లమెంటు కెనెసెట్‌లో ప్రసంగించారు.
కెనెసెట్ సభ్యులంతా గౌరవ సూచకంగా లేచి నిలబడి మరీ మోదీని స్వాగతించారు. ‘మోదీ’, ‘మోదీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ, ‘‘ఉగ్రవాదం సమాజాలనే అస్థిరపరుస్తుంది. అభివృద్ధికి విఘాతంగా మారుతుంది. విశ్వాసాన్ని రూపుమాపుతుంది. అలాంటి ఉన్మాద భూతంపై పోరులో
ద్వంద్వ ప్రమాణాలు పనికిరావు. దాన్ని రూపుమాపాలంటే ప్రంపచ స్థాయిలో పూర్తి సమన్వయంతో కూడిన ప్రయత్నాలు తప్పనిసరి’’ అని కుండబద్దలు కొట్టారు. పశి్చమాసియాలో శాంతి సాధనకు ఉద్దేశించిన గాజా శాంతి చర్చలకు సంపూర్ణ మద్దతు పలికారు.
చిరకాల మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌కు భారత్ ఈ విషయంలో పూర్తిగా దన్నుగా నిలుస్తుందని ప్రకటించారు. గాజా శాంతి చర్చలు పశి్చమాసియా అంతటా సుస్థిర, చిరకాల శాంతికి బాటలు పరుస్తాయని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. ఐరాస ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రయత్నాలు పాలస్తీనా సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాయన్న నమ్మకం తనకుందన్నారు. ‘‘శాంతిమార్గం అంత సులువైనది కాదు. అయితే సదుద్దేశంతో కూడిన ప్రయత్నాలకు తెలివిడి, ధైర్యం, మానవత్వం తోడైతే విజయం సునిశి్చతం’’ అని పేర్కొన్నారు.
పశి్చమాసియాలో శాంతి కోసం కొన్నేళ్ల క్రితం ఇజ్రాయెల్ ‘అబ్రహం అకార్డ్స్’పై సంతకం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. ‘‘ఇజ్రాయెల్ చేపట్టిన ఆ చర్య దశాబ్దాల పాటు అట్టుడికిన పశి్చమాసియాలో కొత్త ఆశలకు నాంది పలికింది. నాటినుంచి ఈ ప్రాంతంలో పరిస్థితులు అనూహ్యంగా మెరుగుపడ్డాయి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. ఇజ్రాయెల్ ధైర్యసాహసాలు, దశాబ్దాలుగా ఆ దేశం సాధిస్తున్న ఘన విజయాలంటే భారత్‌లో అందరికీ గొప్ప ఆరాధనా భావముందని చెప్పారు. ఇరుదేశాల నడుమ 2,000 ఏళ్లకు పైగా సన్నిహిత బంధాలున్నాయని గుర్తు చేశారు.
హమాస్ దాడితో మేమూ ఆక్రోశించాం
2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్ర సంస్థ జరిపిన పాశవిక దాడిలో భారీ సంఖ్యలో ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోవడం భారతీయులందరినీ కలచివేసిందని ప్రధాని అన్నారు. ‘‘వారి కుటుంబీకులకు తనతో పాటు భారతీయులందరి తరఫునా ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఎవరేమన్నా, ఎన్ని చెప్పినా ఉగ్రవాదం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. ఈ విషయంలోమరో మాటకు తావు లేదు. ఇజ్రాయెలీలపై హమాస్ పాల్పడ్డ ఆటవిక దాడి తాలూకు బాధను భారతీయులందరమూ అనుభవించాం.
ఇజ్రాయెలీ సోదరులు అంతులేని ఆవేదనను మేమంతా పంచుకున్నాం. ఎందుకంటే ఉగ్రవాద తాలూకు నొప్పిని భారత్ చాలాకాలంగా అనుభవిస్తూ వస్తోంది. ముంబై ఉగ్ర దాడుల్లో భారతీయులతో పాటు పలువురు ఇజ్రాయెలీ సోదరులు కూడా నిష్కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ బాధాకర క్షణాల్లోనూ, ఇకముందు కూడా ఇజ్రాయెల్‌కు భారత్ అన్ని విషయాల్లోనూ పూర్తిస్థాయిలో అండగా, వెన్నుదన్నుగా నిలుస్తుంది’’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు సభ్యుల హర్షధ్వానాల నడుమ మోదీ ప్రకటించారు.
‘‘ఆర్థిక, సాంకేతిక రంగాల్లో భారత్ అపార ప్రగతి సాధిస్తోంది. ఇన్నొవేషన్లు, టెక్నాలజీ నాయకత్వ రంగాల్లో ఇజ్రాయెల్‌కు తిరుగు లేదు. కనుక పలు రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం. త్వరలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాం’’ అని వెల్లడించారు. భారత్, ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికాలతో కూడిన ‘‘మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్’, ‘ఐ2యూ2 ఫ్రేమ్‌వర్క్’ల్లో కూడా మరింత చురుగ్గా భాగస్వాములం అవుతామన్నారు.
రెడ్‌కార్పెట్ స్వాగతం
అంతకుముందు ప్రధాని మోదీకి ఇజ్రాయెల్‌లో రెడ్‌కార్పెట్‌తో ఘనస్వాగతం లభించింది. టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన భార్యతో కలిసి మోదీకి స్వయంగా స్వాగతం పలకడం విశేషం. ‘ప్రియమైన మిత్రునికి స్వాగతం’ అంటూ మోదీని ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. భారత ప్రధానికి స్వాగతం పలకడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఆయనతో తనకు వ్యక్తిగతంగా కూడా అతి సన్నిహిత బంధముందని అనంతరం ఎక్స్ పోస్టులో నెతన్యాహు గుర్తు చేసుకున్నారు.
తనకు లభించిన ఘనస్వాగతం పట్ల మోదీ హర్షం వెలిబుచ్చారు. అనంతరం విమానాశ్రయంలోనే నేతలిద్దరూ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పశి్చమాసియాలో తాజా పరిస్థితులు తదితరాలపై లోతుగా చర్చించారు. నెతన్యాహుతో భేటీ అద్భుతంగా సాగిందని మోదీ పేర్కొన్నారు. వ్యవసాయం, టెక్నాలజీ, నీటి నిర్వహణతో పాటు పలు అంశాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. గురువారం వారిద్దరూ మరో దఫా భేటీ కానున్నారు. ఆ సందర్భంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశముంది. గత తొమ్మిదేళ్లలో ఇజ్రాయెల్‌లో మోదీకి ఇది రెండో పర్యటన.
మోదీకి అత్యున్నత పురస్కారం
ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ‘స్పీకర్ ఆఫ్ ద కెనెసెట్ మెడల్’ దక్కింది. ఆ దేశ పార్లమెంటు ‘కెనెసెట్’ అందజేసే ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని ఆయనే. కెనెసెట్ స్పీకర్ అమీర్ ఒహానా మోదీకి ఆ మెడల్‌ను ప్రదానం చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం అందజేసినట్టు పేర్కొన్నారు. 2018లో పాలస్తీనా కూడా మోదీకి తమ అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్‌కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తైన్’ అందజేసింది. ఆ రెండు శత్రు దేశాల నుంచీ అత్యున్నత పురస్కారాలు అందుకుతున్న అరుదైన నాయకునిగా మోదీ నిలిచారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధాని కూడా ఆయనే.
‘మోదీ హగ్’ ప్రపంచ ప్రసిద్ధం!
కెనెసెట్‌లో మోదీని ఆహ్వానిస్తూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్వాగతోపన్యాసం చేశారు. ‘మోదీ నా మిత్రుడు మాత్రమే కాదు, ప్రియమైన సోదరుడు కూడా’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ప్రపంచ వేదిక లపై మోదీ గొప్ప నేతగా వెలుగుతున్నారన్నారు. ముఖ్యంగా ‘మోదీ కౌగిలి’ చాలా ప్రత్యేకమైనది. అది ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందింది’’ అంటూ చమత్కరించారు! ‘‘ఇజ్రా యెల్‌లో మోదీ గత పర్యటన సందర్భంగా ఇద్దరమూ మధ్యదరా సముద్ర తీరంలో విహరించాం. చెప్పు లు విడిచి నీళ్లలో నడుద్దామా అని మోదీని అడిగాను. మేమిద్దరం నీళ్లలో నడవలేదు గానీ ద్వైపాక్షిక సంబంధాల విషయంలో అద్భుతాలు చేస్తూ వస్తున్నాం. వర్తకాన్ని రెండింతలు, సహకారాన్ని మూడింతలు, అవగాహ నను నాలుగింతలు పెంచాం’’ అన్నారు.
– నెతన్యాహు


