భారత్, పాక్‌ యుద్ధం ఆపకుంటే... కోట్ల మంది చనిపోయేవారు!  | Donald Trump Repeats Claim of Averting India-Pakistan War | Sakshi
Sakshi News home page

భారత్, పాక్‌ యుద్ధం ఆపకుంటే... కోట్ల మంది చనిపోయేవారు! 

Feb 26 2026 4:27 AM | Updated on Feb 26 2026 12:19 PM

Donald Trump Repeats Claim of Averting India-Pakistan War

పాక్‌ ప్రధానే చెప్పారు 

 డొనాల్డ్‌ ట్రంప్‌  నోట మళ్లీ పాత పాట

న్యూయార్క్‌/వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి పాత పాటే పాడారు. భారత్, పాకిస్తాన్‌ నడుమ యుద్ధాన్ని తానే ఆపానని చెప్పుకున్నారు. కాకపోతే ఈసారి దానికి తనదైన శైలిలో మరిన్ని విశేషణాలు జోడించారు. ‘‘నేనే గనక జోక్యం చేసుకోకపోతే ఆ రెండు దేశాల మధ్య ఘర్షణ ఘోర అణుయుద్ధానికి తారి తీసేది. అప్పుడు ఏకంగా 3.5 కోట్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయేవారు.

 ఈ మాట పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నాతో స్వయంగా చెప్పారు’’అంటూ గొప్పలకు పోయారు. మంగళవారం ట్రంప్‌ అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి వార్షిక ప్రసంగం చేశారు. అధ్యక్షునిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక తొలి 10 నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 8 యుద్ధాలను ఆపానని పునరుద్ఘాటించారు. 

కంబోడియా–థాయ్‌లాండ్, కొసావో–సెర్బియా, ఇజ్రాయెల్‌–ఇరాన్, ఈజిప్‌్ట–ఇథియోపియా, అర్మనియా–అజర్‌బైజాన్, కాంగో–రువాండా, గాజా యుద్ధాల గురించి చెబుతూ భారత్, పాక్‌ ప్రస్తావన కూడా తెచ్చారు. 

దాయాదుల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని గత ఏడాది కాలంలో ట్రంప్‌ కనీసం 100 సార్లకు పైగా చెప్పుకోవడం తెలిసిందే. ఆపకపోతే కోటి మంది మరణించి ఉండేవారని ఒకసారి, 2.5 కోట్ల మంది చనిపోయేవారని మరోసారి చెప్పుకొచ్చిన ఆయన.. ఈసారి ఆ సంఖ్యను 3.5 కోట్లకు పెంచేయడం విశేషం! ట్రంప్‌ ప్రకటనలను భారత్‌ ఎప్పుడో ఖండించింది. పాక్‌ దిగొచ్చి స్పష్టంగా విజ్ఞప్తి చేసినందుకే ఆపరేషన్‌ సిందూర్‌కు స్వస్తి పలికినట్టు స్పష్టం చేసింది. 

బాబోయ్, మరీ ఇన్ని విజయాలా! 
అధ్యక్షునిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక తాను సాధించిన విజయాలు తదితరాలను ఏకరువు పెడుతూ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ట్రంప్‌ ఏకంగా 100 నిమిషాలకు పైగా మాట్లాడారు! తద్వారా తన గత రికార్డును తానే అధిగమించారు. ఏడాది పాలనలో అమెరికాను తిరిగి అత్యంత శక్తిమంతంగా తీర్చిదిద్దినట్టు చెప్పుకున్నారు. ‘‘ఇంటాబయటా అమెరికన్ల భద్రతను ఎన్నడూ లేనంతగా బలోపేతం చేసుకోగలిగాం. ఉపాధి నుంచి ఉత్పత్తి దాకా అన్ని రంగాల్లోనూ విజయ పరంపరలు కొనసాగిస్తున్నాం. టారిఫ్‌లతో దేశాలను దారికి తెచ్చి మనమేంటో చూపించాం. 

దేశం మళ్లీ గెలుపు బాటకు మళ్లింది. ఎన్నెన్ని విజయాలు సాధిస్తున్నామో చెప్పలేను! అందుకే ఏయే అంశాలను ప్రస్తావించాలో కూడా నాకే తెలియడం లేదు. ప్రజలు కూడా అదే అంటున్నారు. ‘బాబోయ్, ఇన్ని విజయాలా!? ప్రెసిడెంట్‌! మనం మరీ ఎక్కువ విజయాలు సాధిస్తున్నాం. ఇంతకుమించి తట్టుకోవడం మావల్ల కాదు. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్‌!’అని వేడుకుంటున్నారు’’అని చెప్పుకొచ్చారు. అమెరికాలో నవంబర్‌లో మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నానాటికీ పడిపోతున్న తన రేటింగ్స్‌ను పెంచుకోవడమే లక్ష్యంగా ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు. 

టారిఫ్‌లు కొనసాగుతాయ్‌ 
ప్రపంచ దేశాలపై తన టారిఫ్‌లను కొట్టేసిన సుప్రీంకోర్టు తీర్పును ట్రంప్‌ మరోసారి తూర్పారబట్టారు. సుంకాల రూపంలో దేశానికి భారీగా ఆదాయం వచ్చి పడుతూ అంతా బాగా సాగుతున్న వేళ పనికిమాలిన తీర్పు వచ్చి పడిందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఆమోదంతో నిమిత్తం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాటిని కొనసాగించి తీరతానని పునరుద్ఘాటించారు. అంతేకాదు, ‘‘ఏదో ఒకనాడు నా టారిఫ్‌లు ఆధునిక ఆదాయ పన్ను వ్యవస్థ స్థానాన్ని భర్తీ చేస్తాయి. చూస్తుండండి! అప్పుడు అందరూ నన్ను గొప్పగా ప్రస్తుతిస్తారు’’అని చెప్పుకొచ్చారు. ఇరాన్‌ అణ్వాయుధాలు తయారు చేసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తే లేదని ట్రంప్‌హెచ్చరించారు.

ఇది మూడో టర్మ్‌ కావాల్సింది
కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగం సందర్భంగా ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షునిగా తనకిది నిజానికి మూడో టర్ము కావాల్సిందని చెప్పుకొచ్చారు. ‘‘అనుకోనివి జరుగుతుంటాయి. ఏం చేస్తాం!’’అంటూ నిట్టూర్చారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ చేతిలో ఓటమిని ట్రంప్‌ అంగీకరించకపోవడం, క్యాపిటల్‌ హిల్‌ భవనంపై దాడికి తన మద్దతుదారులను రెచ్చగొట్టడం తెలిసిందే. దాన్ని ఉద్దేశించి తాజాగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్షుడు అయ్యేందుకు అమెరికా రాజ్యాంగం అనుమతించదు.  
 

Advertisement
 
Advertisement
Advertisement