కాంగ్రెస్ నిరసనపై.. మాజీ న్యాయమూర్తుల ధ్వజం | Former judges slam Congress protest at AI Impact conference | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నిరసనపై.. మాజీ న్యాయమూర్తుల ధ్వజం

Feb 24 2026 7:04 PM | Updated on Feb 24 2026 7:23 PM

Former judges slam Congress protest at AI Impact conference

ఢిల్లీ: ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శనపై దేశవ్యాప్తంగా దుమారం చేలరేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా  ఆ ఘటనను మాజీ న్యాయమూర్తులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటన జాతిద్రోహ చర్యగా అభివర్ణించారు. ‌

ఏఐ ఇంపాక్ట్ సదస్సులో కాంగ్రెస్ చర్యలపై 270కి పైగా మాజీ న్యాయమూర్తుులు, అధికారులు కలిసి సంయుక్తంగా కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇది అకస్మికంగా జరిగింది కాదు.  ఈ కుట్రను ముందుగానే ప్లాన్ చేశారు. ప్రపంచ సాంకేతికతకు చెందిన నాయకులకు, అంతర్జాతీయ ప్రతినిధులకు అతిథ్యం ఇస్తున్న తరుణంలో ఇలాంటి నిరసన చేయడం సరికాదు. ఇది జాతిద్రోహం. ఇది భారత దేశ ప్రతిష్ఠకు తీరని భంగం అని ‍అన్నారు.

ప్రపంచస్థాయికి కార్యక్రమాలు జరుగుతున్న వేదికలపై నిరసన తెలిపితే.. భారతదేశం ప్రపంచస్థాయి పెట్టుబడులకు మార్గంగా కాకుండా నిరసనలు జరిగే దేశంగా గుర్తింపు పొందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రదర్శనల వల్ల భారత్‌కు వచ్చే కంపెనీలు, పెట్టుబడిదారులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలాంటి ప్రదర్శనలు  మన దేశ శాస్త్రవేత్తల కృషిని, ఇంజనీర్ల కోరికను, 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలను అపహాస్యం చేస్తుందని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంగా నిరసన తెలపడమనేది ప్రాథమిక హక్కు అయినప్పటికీ, దేశాన్ని బహిరంగంగా ఇబ్బంది పెట్టే విధంగా అది ఉండకూడదన్నారు. ప్రభుత్వ విధానాల పట్ల ఏదైనా వ్యతిరేకత ఉంటే "మేధోపరమైన కఠినత్వం మరియు పార్లమెంటరీ చర్చ" ద్వారా వాటిని వ్యక్తపరచాలని పేర్కొన్నారు.  ఇటువంచి చర్యల వల్ల హానీ ప్రభుత్వాలకు కలగదని... ప్రజలకు కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సంయుక్త ప్రకటనలో ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్‌ఎన్‌ ధింగ్రా, త్రిపుర మాజీ డిజీపీ బీఎల్‌ వోహ్రా తదితర ప్రముఖులున్నారు.

అయితే ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో కాంగ్రెస్‌ నిరసన చేపట్టడంపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. ‘‘దేశాన్ని అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా పౌరులు నిరంతరం శ్రమిస్తున్నారు. కానీ మన దేశం విజయాలు సాధిస్తుండడాన్ని కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. 80కిపైగా దేశాల ప్రతినిధులు, 20 దేశాల అధినేతలు పాల్గొన్న సదస్సులో చొక్కాలు విప్పేసి నిరసన తెలపడం సమంజసమేనా? కాంగ్రెస్‌ నిజస్వరూపం అందరికీ తెలుసు. చొక్కాలు విప్పి నగ్నంగా మరోసారి బహిర్గతం చేసుకోవాల్సిన అవసరమేమిటి? అని ప్రశ్నించారు. కాగా గ్లోబల్‌ సమ్మిట్‌లో భారత ప్రతిష్ఠ దిగజార్చేలా కాంగ్రెస్ నిరసన చేపట్టిందని పలువురు విమర్శలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement