వరంగల్: వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల పురోగతిని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ పోరాటంతోనే ప్రభుత్వంలో చలనం వచ్చిందని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఆసుపత్రికి కేవలం రంగులు వేసి క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నారని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగించడంలో విఫలమైందని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని, మంత్రులు ఎవరికి నచ్చినట్లు వారు డేట్‌లైన్‌లు ప్రకటిస్తున్నారని ఆరోపించారు.
గోదావరి జలాల అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని, సీఎం సవాల్‌ను స్వీకరిస్తున్నామని చెప్పారు. మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలని ఆలోచించారని, కానీ సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. దేవాదుల ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆసుపత్రిని వెంటనే ప్రారంభించి వైద్యులు, సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఇప్పటికే ప్రారంభించేవాళ్లమని తెలిపారు.
అలాగే వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రి సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, బీఆర్‌ఎస్ నిర్మించిన ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు నిలిపివేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కక్ష్యపూరిత చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుతో చీకటి ఒప్పందం చేసుకుని నీటిని విడుదల చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఇకపై సీఎంను ప్రతి అడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు.


