తెలంగాణలో చివరి దశకు మావోయిస్టు ఉద్యమం | Key Maoist Leaders To Surrender In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో చివరి దశకు మావోయిస్టు ఉద్యమం

Feb 24 2026 9:28 AM | Updated on Feb 24 2026 12:49 PM

Key Maoist Leaders To Surrender In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో చివరి దశకు మావోయిస్టు ఉద్యమం చేరుకుంది. డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో నలుగురు మావోయిస్ట కీలక నేతలు లొంగిపోనున్నారు. దేవ్‌జీ.. అలియాస్‌ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌, నరసింహారెడ్డి అలియాస్‌ గంగన్న.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు లొంగిపోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేవ్‌జీ మావోయిస్టు పార్టీ సెక్రటరీగా ఉన్నారు. 

దేవ్‌జీ రాడికల్‌ విద్యార్థి సంఘం నాయకుడి నుంచి మావో అగ్రనేతగా ఎదిగారు. కోరుట్లలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన తిరుపతి ఈ ప్రాంతంలో సామాన్య ప్రజానీకం భూస్వాముల అణచివేతపై చిన్నప్పటి నుంచే తిరుగుబావుటా ఎగురవేశారు. 1981లో పదో తరగతి నుంచే ఆయన రాడికల్‌ విద్యార్థి సంఘం వైపు ఆకర్షితులయ్యారు. ఆర్‌ఎస్‌యూ క్రియాశీల సభ్యుడిగా పనిచేశారు.

కోరుట్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివే సమయంలో విద్యార్థుల్లో విప్లవ భావాలను నూరిపోయడంలో కీలకపాత్ర పోషించారు. ఆ సమయంలో ఏబీవీపీ, ఆర్‌ఎస్‌యూ విద్యార్థి సంఘాల మధ్య గొడవలు, దాడులు తీవ్రమయ్యాయి. పోలీసులు రాడికల్‌ విద్యార్థి సంఘం నాయకులపై నిఘా పెంచారు. ఇంటర్‌ పాసైన తిరుపతి 1983–84 సమయంలో కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో డిగ్రీలో చేరారు. అక్కడ ఆర్‌ఎస్‌యూ కార్యకలాపాల విస్తరణకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసుల నిఘా పెరగడంతో 1984 చివర్లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ఆపరేషన్‌ కగార్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం అడవులను జల్లెడ పడుతూ ఎన్‌కౌంటర్లకు పాల్పడుతుండటం, ఈ ఏడాది మార్చి 31కల్లా దేశాన్ని మావోయిస్టులరహితంగా మారుస్తామని ప్రకటించడంతో మావోయిస్టు ముఖ్య నాయకులు ఇక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారు. మరోవైపు, పార్టీ కేంద్ర నాయకత్వంలో నెలకొన్న సంక్షోభం కారణంగా తాము లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు సీపీఐ మావోయిస్టు (బీబీఎం) డివిజన్‌ కమిటీ వెల్లడించింది.

ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మకు లేఖ రాసింది. తమ భద్రత, భవిష్యత్తుకు హామీ ఇస్తూ రేడియో ద్వారా సందేశాన్ని వినిపించాలని కోరింది. రేడియో సందేశం పంపితే మార్చి 2 లేదా 3న లొంగిపోతామని ఆ లేఖలో పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌–ఒడిశా సరిహద్దులో ఉన్న బీబీఎం డివిజన్‌లో బొలాంగిర్‌–బార్‌ఘడ్‌–మహాసముంద్‌ జిల్లాలు ఉన్నాయి. మొత్తం 15 మంది మావోలు లొంగుబాటుకు సిద్ధంగా ఉండగా అందులో తెలంగాణ నుంచి ఒకరు, ఛత్తీస్‌గఢ్‌వాసులు 14 మంది ఉన్నారు.
 తెలంగాణలో చివరి దశకు మావోయిస్ట్ ఉద్యమం

 

 

Advertisement
 
Advertisement
Advertisement