నూతన వధూవరుల మధ్య చిన్నపాటి ఘర్షణ
మనస్తాపంతో ఉరివేసుకుని వరుడు బలవన్మరణం
నారాయణ పేట: పెళ్లికి పెట్టు కున్న పారాణి ఆరక ముందే.. వధువు చీరనే ఉరితాడుగా మార్చుకొని ఓ నవ వరుడు బలవన్మర ణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. నారాయణ పేట జిల్లా నర్వ గ్రామానికి చెందిన గోవిందమ్మ, కృష్ణయ్య దంపతుల మొదటి కుమారుడు రవి(25)కి ఈ నెల 20న కర్నూలుకు చెందిన ఓ యువతితో నర్వలోనే వివాహం జరిగింది.
రెండు రోజులు బాగానే ఉన్నప్పటికీ సోమవారం తెల్లవారుజామున నూతన వధూవరుల మధ్య చోటుచేసుకున్న కొద్దిపాటి తగాదాలో వధువు మూర్చపోయింది. ఈ ఘటనపై అమ్మాయి కుటుంబసభ్యులు వరుడు ఇంటికి వచ్చి కుటుంబసభ్యులపై దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వరుడు రవి తన భార్య పెళ్లి చీర తీసుకొని లంకాల్ గ్రామ శివారులోని ఓ పొలంలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. పెళ్లి జరిగి మూడు రోజులు గడవకముందే చావుబాజాలు మోగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకు న్నాయి. ఈ ఘటనపై వరుడు తల్లి గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్ తెలిపారు.


