ర్యాపిడో ప్రయాణం చివరి ప్రయాణం అయ్యింది..! | road accident in hyderabad | Sakshi
Sakshi News home page

ర్యాపిడో ప్రయాణం చివరి ప్రయాణం అయ్యింది..!

Feb 24 2026 6:58 AM | Updated on Feb 24 2026 8:23 AM

road accident in hyderabad

దుబాయ్‌ వీసా ప్రాసెస్‌కు నగరానికి యువతి 

కొద్దిసేపట్లో ఇంటికి వెళ్లాల్సిన హోంగార్డు

ట్యాంకర్‌ ఢీకొని ఇద్దరు దుర్మరణం

హైదరాబాద్: ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న యువతి.. పార్ట్‌టైమ్‌ ర్యాపిడో డ్రైవర్‌గా అదనపు సంపాదన కోసం కష్టపడుతున్న హోంగార్డు.. వేర్వేరు ప్రాంతాలు.. సోమవారం రోడ్డు ప్రమాదంలో  ఈ ఇద్దరూ మృతి చెందారు. బంజారాహిల్స్‌ పోలీసుల వివరాల ప్రకారం... 

ఏపీలోని విజయనగరానికి చెందిన కొల్లూరు అక్షిత (20) హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేసి దుబాయ్‌ వెళ్లేందుకు వీసా కోసం ఆదివారం రాత్రి హైదరాబాద్‌ వచ్చింది. చింతల్‌లోని స్నేహితురాలి ఇంట్లో ఉన్న ఆమె సోమవారం ఉదయం మెహిదీపట్నంలో దుబాయ్‌ వెళ్లే ప్రాసెస్‌లో భాగంగా ఇంటర్వ్యూకు హాజరై ర్యాపిడో బుక్‌ చేసుకుంది. సంతోష్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న సయ్యద్‌ హుస్సేన్‌ (40) ఉదయం 8 గంటలకు విధులు ముగించుకున్న అనంతరం  ర్యాపిడో విధుల్లోకి చేరాడు. మెహిదీపట్నంలో అక్షితను బైక్‌పై ఎక్కించుకుని పంజగుట్ట వైపు వెళుతున్నాడు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌–1 వెంగళరావు పార్కు టర్నింగ్ వద్ద మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన వాటర్‌ ట్యాంకర్‌  వీరి బైక్‌ను వెనుకనుంచి ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడ్డారు. ట్యాంకర్‌ వెనుక టైర్‌  ఇద్దరి మీదుగా వెళ్లడంతో అక్షిత అక్కడికక్కడే మృతి చెందింది. కొన ఊపిరితో ఉన్న హుస్సేన్‌ను నిమ్స్‌కు తరలించగా కొద్దిసేపటికే కన్నుమూశాడు. 

బంజారాహిల్స్‌ ఇబ్రహీంనగర్‌కు చెందిన ట్యాంకర్‌ డ్రైవర్‌ ఖాజాపాషా (30)ను  హత్యాయత్నం కింద పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా చాంద్రాయణగుట్ట అల్జుబెల్‌కాలనీకి చెందిన హుస్సేన్‌ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. తెల్లారితే దుబాయ్‌ వెళ్లే ఆనందంలో అక్షిత ఉండగా, కొద్దిసేపట్లో ఇంటికి వెళ్లాల్సిన హుస్సేన్‌.. అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement