అజ్ఞాతంలో ఇంకెందరు? | maoist leaders surrender devji and others operation kagar impact | Sakshi
Sakshi News home page

అజ్ఞాతంలో ఇంకెందరు?

Feb 24 2026 7:35 AM | Updated on Feb 24 2026 9:14 AM

maoist leaders surrender devji and others operation kagar impact

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ సహా మరికొందరు కీలక నేతలు తాజాగా లొంగిపోయారన్న వార్తల నేపథ్యంలో అజ్ఞాతంలో ఇంకెందరు మావోలు మిగిలి ఉన్నారన్న అంశం తెరపైకి వస్తోంది. ఆపరేషన్‌ కగార్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం అడవులను జల్లెడ పడుతూ ఎన్‌కౌంటర్లకు పాల్పడుతుండటం, ఈ ఏడాది మార్చి 31కల్లా దేశాన్ని మావోయిస్టులరహితంగా మారుస్తామని ప్రకటించడంతో మావోయిస్టు ముఖ్య నాయకులు ఇక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారు.

 అందులో భాగంగా కొందరు లొంగిపోగా ఈ వాదనతో ఏకీభవించని వారు ఇంకా ఉద్యమంలోనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో బస్తర్‌ పోలీస్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పొలిట్‌బ్యూరో మెంబర్‌ మిసిర్‌ బెస్రా, సీసీ సభ్యుడు పసునూరి నరహరి, మిలిటరీ ఆపరేషన్లలో దిట్టగా పేరున్న పాపారావు, దామోదర్‌ తదితర సీనియర్‌ నేతలతోపాటు ఇంకా 300 మంది మావోయిస్టులు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో అజ్ఞాతంలో ఉన్నారు. అయితే వారందరూ లొంగిపోయేలా చేసేందుకు కేంద్రం సామదానభేద దండోపాయాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మేము కూడా లొంగిపోతాం: బీబీఎం డివిజన్‌
పార్టీ కేంద్ర నాయకత్వంలో నెలకొన్న సంక్షోభం కారణంగా తాము లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు సీపీఐ మావోయిస్టు (బీబీఎం) డివిజన్‌ కమిటీ వెల్లడించింది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మకు లేఖ రాసింది. తమ భద్రత, భవిష్యత్తుకు హామీ ఇస్తూ రేడియో ద్వారా సందేశాన్ని వినిపించాలని కోరింది. రేడియో సందేశం పంపితే మార్చి 2 లేదా 3న లొంగిపోతామని ఆ లేఖలో పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌–ఒడిశా సరిహద్దులో ఉన్న బీబీఎం డివిజన్‌లో బొలాంగిర్‌–బార్‌ఘడ్‌–మహాసముంద్‌ జిల్లాలు ఉన్నాయి. మొత్తం 15 మంది మావోలు లొంగుబాటుకు సిద్ధంగా ఉండగా అందులో తెలంగాణ నుంచి ఒకరు, ఛత్తీస్‌గఢ్‌వాసులు 14 మంది ఉన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement