ఇంటర్ పరీక్షలకు రెడీ..
ఈసారి కొత్తగా..
● రేపటి నుంచి మొదటి సంవత్సరం, గురువారం నుంచి ద్వితీయ’ పరీక్షలు ● కేంద్రాల్లో సీసీ కేంద్రాలు, సమీపాన ఆంక్షలు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం నుంచి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 66 కేంద్రాలను ఏర్పాటు చేయగా కొన్ని నగరానికి దూరంగా ఉన్నాయి. ఈనేపథ్యాన విద్యార్థులు చివరి నిమిషంలో హడావుడి పడకుండా ముందుగా కేంద్రాలను చూసుకోవాలని, పరీక్షకు గంట ముందు చేరుకోవాలని అధికారులు సూచించారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 9నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులను 8–30గంటల నుంచే అనుమతిస్తామని తెలిపారు.
నిఘా నీడలో...
ఇంటర్మీడియట్ పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. ఒకే కళాశాల ఆవరణలోని మూడు నుంచి ఐదు పరీక్షా కేంద్రాలకు ఐదు సీసీ కెమెరాల చొప్పున ఏర్పాటు చేశారు. వీటిని ఇంటర్మీడియట్ బోర్డుకు అనుసంధానం చేశారు. తద్వారా అధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. అలాగే, కేంద్రాల సమీపాన జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయడంతో పాటు ఇతర పోలీసు ఆంక్షలు అమలుచేస్తారు. ఇక 17 కస్టోడియన్ పాయింట్లు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలే కాక సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటుచేశారు. మొత్తంగా పరీక్షల నిర్వహణలో 816 మంది ఉద్యోగులు పాలుపంచుకోనున్నారు. కాగా, కేంద్రాల్లో పరీక్ష సమయాన విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా ఏర్పాటుచేయడంతో పాటు తాగునీరు, వైద్యసౌకర్యాలు కల్పిస్తున్నారు. అలాగే, కేంద్రాలు ఉన్న రూట్లలో ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు నడిపించనున్నారు.
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలి. ముందుగా కేంద్రాలకు చేరితే ప్రశాంతంగా రాయొచ్చు. కేంద్రం ఎక్కడ ఉందో సరిచూసుకుని గంట ముందుగానే హాజరుకావాలి.
– కె.రవిబాబు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి
పరీక్షల వేళ విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారి తల్లిదండ్రుల ఫోన్లకు ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు మెసేజ్‌లు పంపిస్తున్నారు. గతంలో ఈ వ్యవస్థ ఉండేది కాదు. పలువురు విద్యార్థులు పరీక్షకు ఆలస్యంగా రావడం, కొందరు పరీక్ష రాయలేకపోవడానికి అవగాహన లోపమే కారణమని గుర్తించిన అధికారులు మెసేజ్‌లు పంపిస్తున్నారు. అంతేకాక సెల్‌ఫోన్‌కు పంపే లింక్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే, సెంటర్లకు సులువుగా చేరుకునేలా మార్గంతో కూడిన క్యూఆర్ కోడ్ కూడా ముద్రించడం విశేషం.
ఇంటర్ పరీక్షలకు రెడీ..


