ఫిర్యాదులు పెండింగ్‌ ఉండొద్దు.. | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులు పెండింగ్‌ ఉండొద్దు..

Feb 24 2026 7:06 AM | Updated on Feb 24 2026 7:06 AM

ఫిర్యాదులు పెండింగ్‌ ఉండొద్దు..

ఫిర్యాదులు పెండింగ్‌ ఉండొద్దు..

‘గ్రీవెన్స్‌ డే’లో కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి

ఖమ్మంసహకారనగర్‌: దూర ప్రాంతాల నుంచి ప్రజావాణికి వచ్చి ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు, వినతిపత్రాలను పెండింగ్‌ పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన అదనపు కలెక్టర్లు డాక్టర్‌ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, జెడ్పీ సీఈఓ దీక్షారైనాతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్‌ పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేయడమే కాక ఏవైనా దరఖాస్తులను తిరస్కరిస్తే కారణాలను తెలియజేయాలని పేర్కొన్నారు.

పాలనా అంశాలపై ప్రత్యేక దృష్టి

అన్నిశాఖల అధికారులు పాలనా అంశాలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ అటవీ వస్తువుల విక్రయానికి మార్ట్‌ నిర్మాణం కోసం గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున రూ.10 లక్షల మంజూరుకు ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. నేలకొండపల్లి, ధంసలాపురం, వెంకటగిరి వద్ద ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పనులపై నివేదిక ఇవ్వాలని, రెవెన్యూ సదస్సుల్లో అందిన భూ భారతి, సాదా బైనామా దరఖాస్తులు, పీఓబీ దరఖాస్తుల పురోగతిపై నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం భూసేకరణ కేసుల్లో కౌంటర్‌ ఫైళ్ల దాఖలు, వైరా, ఏదులాపురం మున్సిపాలిటీల్లో డంపింగ్‌ యార్డుల ఏర్పాటుకు స్థలసేకరణ, పీఎంశ్రీ పాఠశాలల్లో పనులు, ఈనెల 27 న జరిగే దిశ సమావేశంలో చర్చించే అంశాలు, సీ్త్రనిధి రుణాల రికవరీపై చర్చించారు.

సాంకేతికతతో మెరుగైన పనితీరు

ఏఐతో పాటు ఇతర సాంకేతిక అంశాలను వినియోగిస్తే పాలనలో మెరుగైన ఫలితాలు సాధించొచ్చని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ల వినియోగం, ఎక్సెల్‌ షీట్ల తయారీపై జిల్లా అధికారులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సాంకేతికతతో పనులు వేగంగా, మెరుగ్గా నిర్వహించే అవకాశం ఉన్నందున ప్రతీ అధికారి వినియోగించుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై ఐదేళ్ల వివరాలు నమోదు చేస్తే అధికంగా పెండింగ్‌ ఉన్న మిల్లర్ల జాబితా వస్తుందని.. తద్వారా ఎక్కడ దృష్టి సారించాలో అర్థమవుతుందన్నారు. ఇలా అన్ని అంశాల్లో సాంకేతికతతో ఉపయోగాలు ఉన్నందున దృష్టి సారించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement