మహిళల జీవితాల్లో వెలుగులు
‘ఇందిరా మహిళాశక్తి’ ద్వారా సోలార్ ప్లాంట్లు
జిల్లాకు రెండు చొప్పున మంజూరు
రాజుపాలెంలో పూర్తికావొస్తున్న రాష్ట్రంలోనే తొలి ప్లాంట్
ఖమ్మంవ్యవసాయం: మహిళా సంఘాల్లోని సభ్యులకు ఉపాధి కల్పించడం, వారి ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా‘ఇందిరా మహిళాశక్తి’ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రప్రభుత్వం పలు యూనిట్లు మంజూరు చేస్తోంది. బస్సుల కొనుగోలుకు రుణాలు అందించి ఆర్టీసీకి అద్దెకు ఇస్తుండగా.. సోలార్ ప్లాంట్ల విషయంలోనూ మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈమేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళా సంఘాల ద్వారా ఒక మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లోని రెండేసి గ్రామాల్లో తొలి దశగా ఏర్పాటు చేస్తున్నారు. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(సెర్ప్) ద్వారా ఈ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఉమ్మడి జిల్లాలో నాలుగు
ఇందిరా మహిళా శక్తి పథకం కింద ప్రభుత్వం ప్రతీ జిల్లాకు రెండు సోలార్ పవర్ ప్లాంట్లను మంజూరు చేసింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని రాజుపాలెం, కల్లూరు మండలంలోని చిన్న కోరుకొండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లి, మణుగూరు మండలంలోని ఉడతనేనిగుంపు గ్రామాల్లో వీటి ఏర్పాటుకు నిర్ణయించారు.
నాలుగు ఎకరాలు.. రూ.3కోట్లు
ఒక్కో సోలార్ ప్లాంట్ నిర్మాణానికి రూ.3 కోట్లు వెచ్చిస్తున్నారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసేందుకు గాను ప్రభుత్వ భూములు, అటవీ హక్కుల చట్టం(ఆర్‌ఓఎఫ్‌ఆర్) కింద గిరిజన భూములు, దేవాదాయ, నీటి పారుదల శాఖల భూములను గుర్తించారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయించారు.
పైలట్ ప్రాజెక్టు ఇక్కడే..
ప్లాంట్ల ఏర్పాటులో భాగంగా డిప్యూటీ సీఎం భటి ్ట విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలోని రాజుపాలెంను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇక్కడ ఒక మెగా వాట్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం చివరి దశకు చేరింది. ఇక్కడ 520 మాడ్యూళ్లు బిగించడమే కాక ఎంసీఆర్ గది నిర్మాణం, ఫెన్సింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. అలాగే, ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరఫరా కోసం జమలాపురం ఫీడర్‌కు 11 కేవీ లైన్ వేశారు. ఈ నెలాఖరు వరకు పనులను పూర్తి చేసి సీఈఐజీ నుంచి అనుమతులు పొందాలనే యోచనలో ఉన్నారు. అలాగే, చిన్నకోరుకొండిలో లే ఔట్ సిద్ధం చేసి స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. ఇక భద్రాద్రి జిల్లా సుజాత్‌నగర్ లక్ష్మీదేవిపల్లి, మణుగూరు మండలం ఉడతనేనిగుంపుల్లో స్థల సేకరణ పూర్తయింది.
అటు ఆదాయం.. ఇటు ఉపాధి
సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా రోజుకు సగటున 4,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్‌ను డిస్కంకు విక్రయించడం ద్వారా మహిళా సంఘాలకు యూనిట్‌కు రూ.3 చొప్పున ఆదాయం సమకూరుతుంది. తద్వారా మహిళా సంఘాలు తీసుకున్న రుణ కిస్తీలు చెల్లిస్తూనే.. ఇంకొంత నిర్వహణ ఖర్చుల కింద ఇద్దరేసి సభ్యులు తీసుకుంటారు. తద్వారా ఐటీఐ విద్యార్హత ఉన్న వారికి ఉపాధి లభించనుంది.
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్లాంట్లు మహిళల ఆర్థికాభివృద్ధికి ఎందో దోహదపడతాయి. రాష్ట్రంలో తొలిసారి రాజుపాలెంలో చేపట్టిన ప్లాంట్ నిర్మాణం చివరి దశలో ఉంది. ఈ నెలాఖరుకు ప్లాంట్ నుంచి సౌర విద్యుత్ ఉత్పత్తి మొదలుపెట్టి డిస్కంకు అందిస్తాం. మరో రెండు నెలల్లో మిగిలిన మూడింటిని పూర్తి చేస్తాం.
– పొలిశెట్టి అజయ్‌కుమార్,
రెడ్‌కో ఉమ్మడి జిల్లా మేనేజర్
మహిళల జీవితాల్లో వెలుగులు


