వందశాతం లక్ష్యాలు సాధించాలి
నారాయణపేట: ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం వందశాతం లక్ష్యాలు సాధించాలని నీతి అయోగ్ డిప్యూటీ సెక్రెటరీ, ప్రోగ్రాం మిషన్ అడిషనల్ డైరెక్టర్ గౌరవ్ కటియార్ అన్నారు. నర్వ మండల ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం పురోగతిపై సోమవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన ఆయన అధికారులతో సమీక్షించారు. అంతకు ముందు కలెక్టర్ డిప్యూటీ సెక్రెటరీకి స్వాగతం పలికారు. అనంతరం వీసీ హాల్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నర్వ మండల ఆస్పిరేషనల్ బ్లాక్‌పై వివరణాత్మకంగా విభాగాల వారీగా పురోగతి నివేదికను సమర్పించారు. క్షేత్రస్థాయిలో ఏబీపీని అమలు చేయడంలో ఉన్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి డిప్యూటీ డైరెక్టర్ గౌరవ్ కటియార్ జిల్లా అధికారులతో మాట్లాడారు. నీతి ఆయోగ్, సీఎస్‌ఆర్ వనరుల నుంచి అదనపు నిధులను పొందడానికి ఇన్నోవేషన్ కేటగిరీ కింద మరిన్ని ప్రతిపాదనలను సమర్పించాలని ఆయన కలెక్టర్‌ను కోరగా.. జిల్లా నుంచి కొత్త మండలాలను ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద చేర్చాలని సూచించారు. ఇప్పటికే సమర్పించిన ప్రతిపాదనలను మంజూరు చేస్తామని.. వీలైనంత త్వరగా నిధులు విడుదల చేస్తామని డిప్యూటీ డైరెక్టర్ హామీ ఇచ్చారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ ప్రణయ్ కుమార్, నీతి అయోగ్ రాష్ట్ర కార్యదర్శి లోకేష్, డీఆర్డీఓ మొగులప్ప, డీఏఓ జాన్‌సుధాకర్, డీఈఓ గోవిందరాజులు, డీపీఓ సుధాకర్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ అధికారి ఈశ్వర్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.శైలజ, ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్, ఎంపీడీఓ శ్రీనివాస్, సీడీపీఓ సరోజ, ఎంఈఓ రాంరెడ్డి ఉన్నారు.
నీతి అయోగ్ డిప్యూటీ సెక్రెటరీ
గౌరవ్ కటియార్


