రగులుతున్న కుమ్మెర
దాడి ఘటనపై ముమ్మరమైన విపక్షాల నిరసనలు
● మూడోరోజున కొనసాగిన ఆందోళనలు, ధర్నాలు
● బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
● ప్రభుత్వం తరపున స్పందించిన డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ
● నేడు జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు రాక
నేడు బీజేపీ
రాష్ట్ర అధ్యక్షుడి రాక..
బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు రానున్నారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో పాల్గొననున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, బీజేపీతోపాటు ప్రజాసంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరపున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పందించి హామీ ఇచ్చినా నిరసనల పర్వం ఆగడం లేదు. బాధితులు ఫిర్యాదు చేసిన మేరకు నిందితులందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతరలో నిర్వాహకుల దాడి ఘటనపై విపక్షాలు, ప్రజాసంఘాల నుంచి నిరసనల పర్వం కొనసాగుతోంది. జిల్లాకేంద్రంలో సోమవారం వరుసగా మూడోరోజు బాధిత కుటుంబానికి మద్దతుగా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్, బీఎస్పీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు చేపట్టగా.. మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు జిల్లా కేంద్రానికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మందిపై బాధితులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఇ ప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమా ండ్‌కు తరలించారు. మిగతా వారిని సైతం అరెస్ట్ చేయాలన్న డిమాండ్‌తో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల తరపున నిరసనలు కొనసాగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు..
కుమ్మెర ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయంలో రూ.100 టికెట్ కోసం మొదలైన గొడవతో గ్రామానికే చెందిన నిరుపేద కుటుంబంపై పైశాచికం ప్రదర్శిస్తూ నిర్వాహకులు దాడికి దిగడం.. ఈ క్రమంలో రెండు నెలల శిశువు కిందపడి మరణించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై ఇప్పటికే బీఆర్‌ఎస్‌తోపాటు ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కుల సంఘాల నేతలు స్పందించి బాధితుల తరపున ధర్నాలు, నిరసనల్లో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, డీఎస్పీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మార్పీఎస్ నేతలు ఈ నిరసనల్లో భాగమయ్యారు.
నిందితులు ఎవరైనా ఉపేక్షించం
కుమ్మెర ఘటనలో నిందితులు ఎవరైనా ఉపేక్షించేది లేదని డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. డీఎస్పీ కార్యాలయంలో ఉన్న బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితో కలిసి పరామర్శించారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిందితులందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసులుకు సూచించారు.
నిందితులపై చర్యలేవి..:
నిరుపేద కుటుంబంపై అమానుషంగా ప్రవర్తించిన జాతర నిర్వాహకులు, గ్రామంలో పెత్తనం చెలాయిస్తున్న పెద్దలపై చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో బాధిత కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. గ్రామ సర్పంచ్‌ను వెంటనే సస్పెండ్ చేసి జైలుకు పంపాలని, నిందితులందరిని రిమాండ్ చేయాలని నినదించారు.


