మనం తినే ఆహారం మన కడుపు నింపుతోంది కానీ, కాలానుగుణంగా మన ఆయుష్షుకు మాత్రం ఆటంకం కలిగిస్తోంది. ఆధునిక జీవనశైలి పుణ్యమా అని రుచికి బానిసలైన మనం, శరీరానికి అత్యంత అవసరమైన పీచు పదార్థం (ఫైబర్)ను విస్మరిస్తున్నాం. దేశంలోని 70 శాతం మంది తీవ్రమైన ఫైబర్ లోపంతో బాధపడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కాలేయ వ్యాధుల నుండి క్యాన్సర్ వరకు దారితీసే ప్రమాదం ఉందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కొని తెచ్చుకుంటున్న రోగాలు
నేటి కాలంలో చాలామంది రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌పైనే ఆధారపడుతున్నారు. ఈ ఆహారాల్లో పీచు పదార్థం దాదాపు సున్నా. ఢిల్లీలోని ఫోర్టిస్ వసంత్ కుంజ్ ఆస్పత్రి నిపుణుడు డాక్టర్ శుభమ్ వత్స తెలిపిన వివరాల ప్రకారం ఫైబర్ లేని ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియలు మందగిస్తాయి. ఫలితంగా గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలే కాకుండా, ఫ్యాటీ లివర్, మధుమేహం తదితర దీర్ఘకాలిక వ్యాధుల వచ్చే అవకాశాలు ఉన్నాయి.
రెండు రకాల రక్షణ కవచాలు
మన శరీరానికి పీచు పదార్థం రెండు రూపాల్లో మేలు చేస్తుంది. అవి ఒకటి ద్రావణీయ ఫైబర్ (Soluble Fiber). ఇది నీటిలో కరిగి, రక్తంలోని చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇది ఆపిల్స్, ఓట్స్, మొలకెత్తిన గింజల్లో లభిస్తుంది. రెండోది అద్రావణీయ ఫైబర్ (Insoluble Fiber). ఇది మన జీర్ణవ్యవస్థలో ఒక ‘బ్రెష్’ లాగా పనిచేసి, పేగులను క్లీన్ చేస్తుంది. క్యారెట్, క్యాబేజీ, తృణధాన్యాల ద్వారా ఇది మనకు అందుతుంది.
క్యాన్సర్‌ను అడ్డుకునే బ్యాక్టీరియా
మనం పీచు పదార్థం తీసుకున్నప్పుడు మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా దానిని ఆహారంగా తీసుకుని ‘బ్యూటిరేట్’ అనే ఫ్యాటీ యాసిడ్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి పెద్దపేగు కణాలకు అద్భుతమైన పోషణను అందిస్తాయి. తద్వారా ప్రాణాంతకమైన కోలోరెక్టల్ క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని కాపాడతాయి. అంటే మనం తీసుకునే ఫైబర్ కేవలం జీర్ణక్రియకే కాదు, మన ప్రాణాలను నిలబెట్టడానికి కూడా అవసరమని తెలుస్తోంది.
రోజూ 30 గ్రాములు తప్పనిసరి
ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకు కనీసం 25 నుంచి 30 గ్రాముల పీచు పదార్థాన్ని తీసుకోవాలి. దీనికోసం ప్రత్యేకమైన సప్లిమెంట్లు అవసరం లేదు. ఇందుకోసం తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ముడి తృణధాన్యాలు (జొన్నలు, సజ్జలు) తింటే సరిపోతుంది. ప్లేటులో రుచితో పాటు కొంచెం పీచు పదార్థాన్ని కూడా చేర్చుకుంటే, తరచూ ఆస్పత్రుల చుట్టూ తిరిగే పని ఉండదని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘ఇన్‌స్టా’లో ప్రధాని మోదీ రికార్డు.. ట్రంప్ ఎక్కడంటే..


