యాక్సిడెంట్‌ కాదు.. డాష్‌బోర్డ్ కెమెరా షాకింగ్‌ విజువల్స్‌ | Bengaluru Techie Crashes SUV Twice To Finish Off Friend Chilling Dashcam Truth, Watch Video Inside | Sakshi
Sakshi News home page

యాక్సిడెంట్‌ కాదు.. డాష్‌బోర్డ్ కెమెరా షాకింగ్‌ విజువల్స్‌

Jan 27 2026 1:17 PM | Updated on Jan 27 2026 1:23 PM

Bengaluru techie crashes SUV twice to finish off friend chilling dashcam truth

కర్ణాటకలోని బెంగళూరులోని హెబ్బగోడి ఠాణా పరిధిలో  ఆదివారం సాయంత్రం   ఎలక్ట్రానిక్స్ సిటీలోని అనంతనగర్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. హెబ్బగోడి నివాసి ప్రశాంత్‌ (28), రోషన్‌ హెగ్డే (27) ఆదివారం క్రికెట్‌ మ్యాచ్‌ ముగించుకుని సాయంత్రం మద్యం తాగారు. మద్యం మత్తులో కారును అడ్డదిడ్డంగా నడపడంతో కారు చెట్టుకు ఢీకొంది. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇదీ  తొలుత అందరూ అనుకున్న స్టోరీ. కానీ ఈ ఘటనకు సంబంధించి మరో ట్విస్ట్‌ వెలుగులో వచ్చింది.

 

ప్రమాదంగా భావించిన ఈ ఘటన చివరికి ఒళ్లు గగుర్పొడిచే హత్యగా తేలింది.  పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ప్రశాంత్‌, రోషన్‌ ఇద్దరు స్నేహితులు.  ప్రశాంత్ బాడీబిల్డర్‌గా పనిచేస్తుండగా, రోషన్ డొమ్లూరులోని ఒక సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కారులోని డాష్‌క్యామ్‌ను డీసీపీ (ఎలక్ట్రానిక్స్ సిటీ) ఎం నారాయణ గమనించి, ఆ ఫుటేజీని పరిశీలించమని ఆదేశించడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది.

ఆదివారం సాయంత్రం కమ్మసంద్రలో  కొంతమందితో కలిసి క్రికెట్ ఆడిన వీరు తరువాత మద్యం సేవించారు. మద్యం మత్తులో ప్రశాంత్ లైటర్ కోసం రోషన్ వద్దకు వచ్చి అతనిని దుర్భాషలాడాడని, దీనితో వాగ్వాదం చెలరేగింది.  ఇద్దరూ బీర్ బాటిళ్లతో ఒకరినొకరు దాడి చేసుకున్నాడు. పరిస్థితి దిగజారడంతో, రోషన్ తన టాటా సఫారీలోకి ఎక్కి అక్కడి నుండి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, ప్రశాంత్ కారును వెంబడించి, కదులుతున్న వాహనం ఎడమవైపు ఫుట్‌బోర్డ్‌పైకి ఎక్కి డోర్‌ను పట్టుకుని వేలాడాడు. కారు ఆపమని ప్రశాంత్ వేడుకుంటున్నా రోషన్ పట్టించుకోలేదు. సుమారు 600 మీటర్ల దూరం వరకు కారును వేగంగా, ప్రమాదకరంగా నడిపాడు. ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగానే మొదట ఓ కాంపౌండ్ గోడను, ఆ వెంటనే వెనక్కి తిప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రశాంత్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ  విజువల్స్‌ డాష్‌క్యామ్‌లో రికార్డయ్యాయని పోలీసు అధికారి తెలిపారు.

ఇది ఉద్దేశపూర్వకమైన హత్య అని తేలడంతో, తీవ్ర గాయాలతో రోషన్  చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి విచారణకోసం అదుపులోకితీసుకున్నామని అధికారి నారాయణ తెలిపారు. రోషన్‌కు నాలుక దాదాపు తెగిపోయిందని, చిన్న శస్త్రచికిత్స జరిగిందని వైద్యులు మాకు తెలిపారు. సోమవారం అతన్ని డిశ్చార్జ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement