ఈ పాపం పుతిన్ ప్రభుత్వానిదే
ఐదు యూరప్ దేశాల విదేశాంగ మంత్రుల ఆరోపణ
లండన్: రష్యా ప్రతిపక్ష నాయకుడు, దేశాధినేత పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్నీ మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని ఐదు యూరప్ దేశాల విదేశాంగ మంత్రులు ఆరోపించారు. విష ప్రయోగంతో ఆయనను హత్య చేశారని వెల్లడించారు. ఇది ముమ్మాటికీ పుతిన్ ప్రభుత్వం చేయించిన హత్యేనని తేల్చిచెప్పారు. నవాల్నీ 2024 ఫిబ్రవరి 16న జైలులో శిక్ష అనుభవిస్తూ మృతి చెందిన సంగతి తెలిసిందే.
అధిక రక్తపోటు కారణంగానే అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. అయితే, నవాల్నీ మృతదేహం నుంచి సేకరించిన నమూనాల విశ్లేషణపై యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రులు శనివారం ఒక ఉమ్మడి ప్రకటన విడుల చేశారు. ఎపిబాటిడైన్ అనే విషం కారణంగా నవాల్నీ మరణించినట్లు ఈ విశ్లేషణలో తేలిందని పేర్కొన్నారు.
దక్షిణ అమెరికాలో కనిపించే డార్ట్ కప్పల చర్మంలో ఈ విషం ఉంటుందని తెలిపారు. ఇలాంటి కప్పలు సాధారణంగా రష్యాలో కనిపించవని వెల్లడించారు. అంటే దక్షిణ అమెరికా కప్పల నుంచి సేకరించిన విషాన్ని నవాల్నీపై ప్రయోగించి హత్య చేశారని ఆరోపించారు. ఇదంతా రష్యా ప్రభుత్వ ప్రోద్బలంతోనే జరిగినట్లు మండిపడ్డారు. రసాయన ఆయుధాల ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘించిందని స్పష్టంచేశారు. దీనిపై రసాయన ఆయుధాల నియంత్రణ సంస్థకు ఫిర్యాదు చేస్తామన్నారు.
పుతిన్‌లో నవాల్నీ భయం
రష్యాలో పుతిన్ ప్రభుత్వం అలెక్సీ నవాల్నీని ఒక ముప్పుగా గుర్తించిందని, ఆయనను అడ్డు తొలగించుకోవాలని ఎప్పుడో నిర్ణయించిందని యూకే విదేశాంగ మంత్రి యెవిట్ కూపర్ పేర్కొన్నారు. అందుకే విష ప్రయోగంతో అంతం చేసిందని వెల్లడించారు. నవాల్నీ జీవించి ఉంటే ఎప్పటికైనా అధికారం నుంచి కూలదోస్తాడన్న భయంలో పుతిన్‌లో ఉండేదన్నారు. రష్యాలో ప్రభుత్వ అవినీతిపై నవాల్నీ గళమెత్తారు.
పుతిన్‌కు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆయనకు ప్రజాదరణ లభించింది. ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు సాగిస్తున్నారని ప్రభుత్వం అభియోగాలు మోపింది. న్యాయస్థానం 19 ఏళ్ల జైలుశిక్ష విధించింది. మరణానికి ముందు తన భర్తపై విష ప్రయోగం జరిగినట్లు రెండు స్వతంత్ర ప్రయోగశాలలు నిర్ధారించాయని ఆయన భార్య యూలియా నవాల్నీ గతేడాది వెల్లడించారు. నవాల్నీ మృతి వెనుక పుతిన్ హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణలను రష్యా ప్రభుత్వం ఖండిస్తోంది. ఇందులో ఎలాంటి కుట్ర లేదని, అనారోగ్యం వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయారని చెబుతోంది.


