భర్తపై కోపంతో ఎలుకల మందు కలిపిన కూల్‌డ్రింక్ కొద్దిగా తాగిన మహిళ
ఆ తర్వాత బాటిల్ వంటింట్లో పెట్టి నిద్రకు ఉపక్రమణ
మొత్తం బాటిల్ తాగేసిన ఐదేళ్ల కుమారుడు
భీమవరం: భర్తపై కోపంతో భార్య కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకొంటే.. ఆ విషయం తెలియక దానిని తాగి కుమారుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలుడి తల్లి కొద్ది మొత్తంలో దానిని తాగినప్పటికీ ఆమెకు ఎలాంటి హాని జరగలేదు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా చల్లపల్లి గ్రామానికి చెందిన మన్యం వెంకట సుబ్బారావు తన భార్య లక్ష్మితో కలసి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం బలుసుమూడిలో నివాసముంటున్నాడు. వారికి ఇద్దరు సంతానం.
ఈనెల 16న సుబ్బారావు బయటికి వెళ్లేందుకు ప్రయాణమవుతున్న సమయంలో అతని భార్య లక్ష్మి సాయంత్రం షాపింగ్‌కు వెళ్లడం కోసం త్వరగా ఇంటికి రావాలని చెప్పింది. అయితే సుబ్బారావు ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. దీంతో కోపగించిన లక్ష్మి కూల్‌డ్రింక్ బాటిల్లో ఎలుకల మందు కలుపుకొని కొద్దిగా తాగి మిగిలినది వంటింట్లో పెట్టి నిద్రపోయింది. అయితే కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలిపిన విషయం తెలియని ఆమె ఐదేళ్ల కుమారుడు మహారుద్ర కాంత్ (5) దానిని తాగి నిద్రపోయాడు.
తెల్లవారుజామున రుద్రకాంత్ వాంతులు చేసుకోవడంతో ఎలుకల మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగినట్టు గ్రహించి అతన్ని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం మృతిచెందాడు. ఈ ఘటనపై బాలుడి తండ్రి వెంకట సుబ్బారావు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు టూటౌన్ ఎస్‌ఐ రామారావు తెలిపారు.


