విశాఖపట్నం జిల్లా: వరకట్న దాహానికి మరో వివాహిత బలైంది. అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. న్యూపోర్టు పోలీసుల కథనం ప్రకారం.. గంగవరం గ్రామానికి చెందిన ఎరిపిల్లి నాగమణి కుమార్తె రమాదేవిక అలియాస్ ప్రత్యూష (23) ప్రస్తుతం బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.
ప్రత్యూషకు అదే ప్రాంతానికి చెందిన మాద ధనరాజుతో 2022 ఫిబ్రవరిలో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.3లక్షల కట్నం ఇస్తామని ఒప్పందం కుదుర్చుకోగా, అప్పట్లో రూ.1.50లక్షలు చెల్లించారు. మిగిలిన సొమ్ము కోసం భర్తతో పాటు అత్తమామలు కూడా ప్రతి రోజూ ఆమెను వేధిస్తుండేవారు.
ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ప్రత్యూష, ఈ నెల 3న ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను గాజువాకలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం ప్రత్యూష మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. తన కుమార్తె మృతికి అత్తమామల వేధింపులే కారణమని తల్లి నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీపీ చిట్టిబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


