బందరులో బరితెగింపు.. | liquor mafia row over hoardings and illegal sales in machilipatnam | Sakshi
Sakshi News home page

బందరులో బరితెగింపు..

Mar 6 2026 9:00 AM | Updated on Mar 6 2026 9:00 AM

 మహనీయుల విగ్రహాల వద్ద అపచారం 

ఎమ్మార్పీకే మద్యం అంటూ నగరం  అంతటా హోర్డింగులు, ఫ్లెక్సీలు  

నిబంధనలు అత్రికమిస్తున్నా  చర్యలు చేపట్టని అధికారులు   

మచిలీపట్నంటౌన్‌: మద్యం మాఫియా అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగులతో ప్రచారం హోరెత్తిస్తోంది. జిల్లా కేంద్రంలో మహనీయుల విగ్రహాలకు అడ్డుగా ఫ్లెక్సీలు కడుతున్నా అధికారులు చోద్యం చూస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అధిక ధరలకు తోడు సమయపాలన లేకుండా మద్యం విక్రయాలు జరుపుతూ మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ వ్యాపారం సాగిస్తున్నారు మచిలీపట్నంలోని మద్యం వ్యాపారులు. 


 మచిలీపట్నం లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌లోని బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బార్‌ హోర్డింగ్‌  

ఏ కూడలి చూసినా ఫ్లెక్సీలే..
బందరులో ఏ కూడలి చూసినా మద్యం ప్రచార ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. జిల్లా పరిషత్‌ సెంటర్‌లో ఉన్న ఆంధ్రాబ్యాంక్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య, లక్ష్మీ టాకీస్‌ సెంటర్లోని  బీఆర్‌ అంబేడ్కర్, జిల్లా కోర్టు సెంటర్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు, బస్టాండ్‌ సెంటర్లోని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, రేవతి సెంటర్లోని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రమణయ్య నాయుడు వంటి మహనీయుల విగ్రహాల వద్ద ఈ హోర్డింగులను ఏర్పాటు చేశారు. ఆయా విగ్రహాలను ఏర్పాటు చేసిన కమిటీల ప్రతినిధులు ఈ హోర్డింగులు ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. మహనీయుల విగ్రహాల వద్ద అభ్యంతరకరంగా ఉన్న హోర్డింగ్లను తొలగించాలని పలువురు నగర కమిషనర్‌ బాపిరాజుకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు.  


జిల్లా పరిషత్‌ సెంటర్లో భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలు  

ఆందోళన చేసినా బార్లా తెరిచారు... 
నగరంలోని హైనీచర్చి సమీపంలో నవ్య రెస్టారెంట్‌ అండ్‌ బార్‌ను నూతనంగా ఏర్పాటు చేశారు. చర్చి సమీపంలో బార్‌ ఏర్పాటుపై ఇటీవల క్రైస్తవులు ఆందోళన వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఈ బార్‌ను గురువారం ప్రారంభించేశారు కూడా. దీనిలో భాగంగా బార్‌ నిర్వాహకుడు ఏకంగా పెద్ద పెద్ద హోర్డింగులను నగరంలోని మహనీయుల విగ్రహాల వద్ద ప్రచారానికి ఏర్పాటు చేశారు. వాస్తవంగా ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలి. కానీ అదేదో మందుబాబులకు ప్రత్యేక ఆఫర్‌ ఇస్తున్నట్టు ఎమ్మార్పీకే మద్యం విక్రయిస్తామంటూ మద్యం బాటిళ్ల ఫోటోలతో బాహాటంగా వ్యాపారులు ఇలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం గమనార్హం.  

కోర్టు సెంటర్లో అమరజీవి విగ్రహం వద్ద ఇలా.. 

Advertisement
 
Advertisement
Advertisement