ఎర్రంపాలెం ఎంపీపీ పాఠశాల వద్ద కట్టెల పొయ్యిపైనే వంట
మన్యంలో పొగబారుతున్న విద్యారంగం
పాఠశాలల్లో కట్టెల పొయ్యిలే దిక్కు
గ్యాస్ సిలిండర్ల మాటే లేదు
వంట చేసే వారికి అవస్థలు
విద్యార్థులకు వడ్డించే ఆహారం తయారీకి మన్యంలో ఇంకా కట్టెల పొయ్యిలనే వినియోగిస్తున్నారు. తరగతి గదుల పక్కనే వంటలు చేయడంతో పొగతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఏళ్లకాలంగా పరిస్థితిలో మార్పురాక పొగమాటున విద్యాభ్యాసం సాగుతోంది. చంద్రబాబు సర్కారులో విద్యారంగానికి గ్రహణం పట్టింది. ఎక్కడి సమస్యలు అక్కడే అన్నట్టు తయారైంది. వంట తయారు చేసే వారికి ‘కట్టె’డు దుఖం మిగులుతోంది.
రంపచోడవరం: ఎన్నో ఆశల నడుమ కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటైంది. ఇక అభివృద్ధి పరుగులు పెడుతుందని అందరూ భావించారు. కానీ ఇక్కడ వి ద్యార్థుల కష్టాలు తీర్చే నాథుడే లేకపోయారు. పాఠశాలలు, వసతి గృహాల్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. జిల్లాలో 79 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 16,238 మంది విద్యా ర్థులు చదువుతున్నారు. ఇక 15 వసతి గృహాల్లో 1,281 మంది విద్యను అభ్యసిస్తున్నారు. అయితే జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో కట్టెల పొయ్యిలపైనే విద్యార్థులకు భోజనాలను తయారు చేస్తున్నారు. పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు గ్యాస్ సిలిండర్లను ఉయోగించి వంటలు చేసుకుంటున్నా, ఇక్కడ మాత్రం ఇంకా కట్టెల పొయ్యిలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఏళ్ల కాలంగా ఈ పరిస్థితి ఉంది.
కంట్లో పొగ.. ఇదో సెగ
పాఠశాలల భవనాల పక్కనే కట్టెల పొయ్యిపై విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నారు. వంట సమయంలో వెలువడుతున్న పొగతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉన్నా ఉన్నతాధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. పొగ కారణంగా చదువులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. వంట షెడ్లను నిర్మించకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. చాలా చోట్ల తరగతి గదులకు దగ్గరలోనే వంట చేయడంతో విద్యార్థులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లాలోని ఐటీడీఏల పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు గ్యాస్ సరఫరా చేయడం లేదు. అన్ని చోట్లా కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారు.
ఇష్టారాజ్యం
వంట కోసం గ్యాస్ అందించాలని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే నాలుగో తరగతి ఉద్యోగులు కోరుతున్నా, ఫలితం లేకుండా పోతోంది. కట్టెల పొయ్యి కారణంగా పొగచూరి ఆహార పదార్థాలకు పట్టడంతో ఒక్కోసారి తినడానికి ఇబ్బందిగా ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు. గతంలో ఆశ్రమ పాఠశాలలకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేశారు. కొన్ని నెలలు తర్వాత ఎక్కడా అవి కనిపించలేదు.
కనీసం ఆయా ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన లెక్కలే లేవు. కాగా.. ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలకు సంబంధించిన ఖాళీ గోనె సంచులు, విద్యార్థులు ఉపయోగించి, పాడైన ఐరన్ పెట్టెలు, పాత పుస్తకాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఫలసాయం డబ్బులను ట్రెజరీ ద్వారా గిరిజన సంక్షేమ శాఖ పద్దులో జమ అయ్యేటట్లు బ్యాంకు ద్వారా చెల్లించాలి. కానీ ఎక్కడా ఇదీ జరగడం లేదు. తమ ఇష్టారాజ్యంగా వార్డెన్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రతిపాదనలు పంపించాం
ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో గ్యాస్‌పైనే వంట చేసే విధంగా సిలిండర్ల సరఫరాకు ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌కు ఇక్కడి పరిస్థితిపై నివేదిక అందజేశాం. ప్రస్తుతం అన్ని చోట్లా గ్యాస్ సరఫరా చేసేందుకు అవకాశం ఉంది. జీసీసీ ద్వారానే గ్యాస్ సరఫరా చేసే అంశాలను ఆలోచన చేస్తున్నాం.
– రుక్మాంగదయ్య, డీడీ, రంపచోడవరం
ఇబ్బంది పడుతున్నాం
ఎంపీపీ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండేందుకు నెలకు ఒక్క సిలిండర్ మాత్రమే ఇస్తున్నారు. దీంతో రెండు వారాలకే అది ఖాళీ అవుతోంది. ఆ తర్వాత కట్టెల పొయ్యిపైనే వంట చేయాలి. కట్టెల పొయ్యిపై వంట చేయడం వలన పొగ వచ్చి ఇబ్బంది పడుతున్నాం. నెలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తే బాగుంటుంది. – లక్షి్మ, వంటమనిషి, ఎంపీపీ స్కూల్, ఎర్రంపాలెం
పొగతో ఆరోగ్యానికి ముప్పు
ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు కట్టెల పొయ్యిపై వంట చేసి భోజనం పెడుతున్నాం. దీని వల్ల పొగతో చాలా ఇబ్బంది పడుతున్నాం. కళ్లు పాడైన వారు, ఊపిరితిత్తులు పాడైన వారు కూడా ఉన్నారు. కట్టెల పొయ్యిపై వంట చేసే బాధను తప్పించాలి. – జమయమ్మ, ఆశ్రమ పాఠశాల, గంగవరం


