‘స్కిల్‌’ కేసు క్లోజర్‌ కాపీ ఇప్పించండి | Former Chairman of Skill Development Corporation Ajay Reddy approaches High Court | Sakshi
Sakshi News home page

‘స్కిల్‌’ కేసు క్లోజర్‌ కాపీ ఇప్పించండి

Mar 6 2026 5:30 AM | Updated on Mar 6 2026 5:30 AM

Former Chairman of Skill Development Corporation Ajay Reddy approaches High Court

హైకోర్టును ఆశ్రయించిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పూర్వ చైర్మన్‌ అజయ్‌రెడ్డి 

ఫిర్యాదుదారు అయిన నాకు సీఐడీ నోటీసు ఇవ్వలేదంటూ పిటిషన్‌ 

తదుపరి విచారణ 12కి వాయిదా

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణానికి సంబంధించి సీఎం చంద్రబాబుపై గతంలో నమోదు చేసిన కేసును మూసివేసే నిమిత్తం సీఐడీ దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్ట్‌ను సవాల్‌ చేస్తూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అప్పటి చైర్మన్‌ అజయ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తాను ఫిర్యాదుదారు అయితే సీఐడీ తనకు నోటీసు ఇవ్వకుండా క్లోజర్‌ రిపోర్ట్‌ దాఖలు చేసిందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. తనను థర్డ్‌పార్టీగా పేర్కొంటూ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. 

ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం విచారణ జరిపారు. అజయ్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో అజయ్‌రెడ్డి ఫిర్యాదుదారు అని తెలిపారు. సీఐడీ అధికారులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఫిర్యాదుదారు కాలమ్‌లో అజయ్‌రెడ్డి పేరే ఉందన్నారు. స్కిల్‌ కేసులో నిందితునిగా ఉన్న చంద్రబాబు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో దాఖలు చేసిన పలు వ్యాజ్యాల్లోనూ అజయ్‌రెడ్డిని డీఫ్యాక్టో ఫిర్యాదుదారుగా పేర్కొంటూ ప్రతివాదుల జాబితాలో కూడా చేర్చారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

సీఐడీ దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్ట్‌పై తనకు ముందస్తు నోటీసు ఇవ్వాలని, ఆ రిపోర్ట్‌ను వ్యతిరేకించే అవకాశం కల్పించాలని కోరుతూ ఏసీబీ కోర్టులో అజయ్‌రెడ్డి ఓ పిటిషన్‌ దాఖలు చేశారని వివరించారు. అయితే అజయ్‌రెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదంటూ, ఈ కేసులో అతన్ని థర్డ్‌ పార్టీగా పరిగణిస్తూ ఆ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసిందన్నారు. కేసును పూర్తిగా మూసివేస్తూ కోర్టు తుది నిర్ణయం తీసుకునేలోపు, సీఐడీ దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్ట్‌ను వ్యతిరేకిస్తూ ‘ప్రొటెస్ట్‌ పిటిషన్‌’ దాఖలు చేసే అవకాశం పిటిషనర్‌కు ఇవ్వాలని కోరారు. 

సీఐడీ సిట్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, మాధవ్‌ ఖురానా స్పందిస్తూ.. అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు. స్కిల్‌ కేసులో అజయ్‌రెడ్డి పిటిషనరే కాదన్నారు. ఈ దశలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేశారు.  

ఐఆర్‌ఆర్‌ కేసును ‘ప్రత్యేక’ కోర్టుకు బదిలీ చేయండి
హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 
ప్రాథమిక చార్జిషీట్, క్లోజర్‌ రిపోర్ట్‌ కాపీలు ఇప్పించాలంటూ మరో పిటిషన్‌
సాక్షి, అమరావతి: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్, మాస్టర్‌ ప్లాన్‌ అక్రమాలకు సంబంధించి తానిచి్చన ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన కేసును విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కుంభకోణం కేసులో సీఐడీ 2024లోనే చార్జిషీట్‌ దాఖలు చేసిందని, ఈ కేసును ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయకుండా సాధారణ ఏసీబీ కోర్టులో విచారించడం చట్టవిరుద్ధమని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కుంభకోణం కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి, ఓ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారని తెలిపారు. నిందితుల హోదాను బట్టి కేసు విచారణ కేవలం  ప్రత్యేక కోర్టులోనే జరగాల్సి ఉంటుందన్నారు. అయితే, ప్రస్తుతం ఈ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు విచారిస్తోందని తెలిపారు. 

తదుపరి చర్యలన్నీ నిలిపేయండి 
అశి్వనికుమార్‌ ఉపాధ్యాయ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా  కేసులో సుప్రీంకోర్టు ఇచి్చన చరిత్రాత్మక తీర్పు ప్రకారం ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్‌ కేసులను విచారించేందుకు ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక కోర్టులున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018లో విజయవాడలో ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిందన్నారు. 

నిందితుల హోదాను బట్టి కేసు విచారణ కేవలం ఈ ప్రత్యేక కోర్టులోనే జరగాలని, సాధారణ ఏసీబీ కోర్టులో కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కుంభకోణానికి సంబంధించిన కేసుపై ఏసీబీ స్పెషల్‌ కోర్టులో జరుగుతున్న విచారణలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. 

‘క్లోజర్‌’ కాపీలు ఇప్పించండి 
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) కుంభకోణం కేసులో 2024లో దాఖలు చేసిన ప్రాథమిక చార్జిషీట్, తాజాగా దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్ట్‌ కాపీలను తనకు అందచేసేలా సీఐడీని ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు 2014–19 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు భూ కుంభకోణంపై 2022లో తాను సీఐడీకి ఫిర్యాదు చేశానని రామకృష్ణారెడ్డి తెలిపారు. దర్యాప్తు జరిపిన సీఐడీ కుంభకోణానికి సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించిందని తెలిపారు. 

2024లో చార్జిషీట్‌ కూడా దాఖలు చేయగా.. కోర్టు దానిని సాంకేతిక కారణాలతో వెనక్కి పంపిందన్నారు. ప్రభుత్వం మారడంతో ఐఆర్‌ఆర్‌ కుంభకోణం కేసును మూసివేసేందుకు సీఐడీ సిద్ధమై విజయవాడ ఏసీబీ కోర్టులో క్లోజర్‌ రిపోర్ట్‌ దాఖలు చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో గత నెల 18న సీఐడీ అధికారులు తనకు ఓ నోటీసు పంపి కేసును మూసివేస్తున్నట్లు తెలిపారన్నారు. 

2024 నాటి తొలి చార్జిషీట్‌ కాపీని గానీ, ఇప్పుడు దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్ట్‌ కాపీని కానీ తనకు అందించడం లేదని వివరించారు. దీంతో సీఐడీ దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్ట్‌ను వ్యతిరేకిస్తూ కోర్టులో ‘ప్రొటెస్ట్‌ పిటిషన్‌’ దాఖలు చేయడం సాధ్యం కావడం లేదన్నారు. చార్జిషీట్‌ను, క్లోజర్‌ రిపోర్ట్‌ను ఫిర్యాదుదారునికి అందించడం దర్యాప్తు అధికారి బాధ్యత అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement