ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత తొలిసారిగా సమావేశం
రాష్ట్రాలతో మరింత సమన్వయం, సాంకేతిక అంశాలపై చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల నిర్వహణలో మరింత సమన్వయం పెంచే దిశగా అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ)లతో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కీలక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. చివరగా 1999 ఏడాదిలో ఇలాంటి భేటీ జరగ్గా 27 ఏళ్ల విరామం అనంతరం ఈ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 24న ఢిల్లీలోని భారతమండపంలో నిర్వహించనుంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎన్నికల కమిషనర్‌లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధూ, డాక్టర్ వివేక్ జోషి పాల్గొననున్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల కమిషనర్లు, వారి న్యాయ–సాంకేతిక నిపుణులు, అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశం ప్ర ధానంగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం.
ఎన్నికల ప్రక్రియలు, సాంకేతిక వనరుల వినియోగంలో చర్చించనున్నారు. సహకార సమాఖ్య స్పూర్తిని మరింత బలపరచాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమావేశంలో ఈవీఎంల భద్రత, ఓటర్ల జాబితా తయారీలో చట్టపరమైన మార్గ దర్శకాలు, రాష్ట్రాల వారీగా ఓటరు అర్హతలపై తులనాత్మక సమీక్ష, ఈసీఐనెట్ డిజిటల్ ఫ్లాట్‌ఫారమ్‌లపై చర్చించనున్నారు. దేశవ్యా ప్తంగా ఎన్నికల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థంగా తీర్చిదిద్దే దిశగా ఈ సమావేశం కీలకంగా మారనుంది.


