ఢిల్లీలో ఘోరం.. తల్లీకూతుళ్ల దారుణ హత్య | Woman And Daughter Incident South East Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఘోరం.. తల్లీకూతుళ్ల దారుణ హత్య

Feb 22 2026 8:32 AM | Updated on Feb 22 2026 12:40 PM

Woman And Daughter Incident South East Delhi

ఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. సరితా విహార్‌ ప్రాంతంలోని ఓ మహిళ(35), ఆమె ఆరేళ్ల కుమార్తె తమ ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ కేసులో పొరుగు వ్యక్తే నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఆలీ విహార్‌లోని  ఓ ఇంట్లో రెండు మృతదేహాలు ఉన్నట్లు శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా, ఇంటిలోని మంచం స్టోరేజ్ బాక్స్‌లో మహిళ, బాలికను గుర్తించారు. వెంటనే వారిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతులను జ్యోతి, ఆమె ఆరేళ్ల కుమార్తెగా గుర్తించారు.

ప్రాథమిక పరీక్షల్లో బయటకి ఎటువంటి గాయాలు కనిపించలేదు. అయితే శనివారం నిర్వహించిన పోస్ట్‌మార్టం రిపోర్టులో గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేయడం వల్లే వారు మరణించినట్లు తేలింది. అదే భవనంలో నివసించే అకౌంటెంట్ దీన్ దయాళ్ (35) ఈ కేసులో ప్రధాన నిందితుడి ప్రాథమిక విచారణలో తేలిసింది. ఇతడు బాధితుల కుటుంబానికి బంధువు (మేనల్లుడు) అని స్థానికులు చెబుతున్నారు.

స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆ ఇంట్లో దంపతులు తమ ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నారు. రాత్రి భర్త ఇంటికి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు బయటే కూర్చుని ఉన్నారు. తలుపు లోపల నుండి గడియ పెట్టి ఉండటంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లోని సామాన్లన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి, కానీ ఏ వస్తువు పోలేదని తెలిపారు. నిందితుడు దీన్ దయాళ్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం నుండి ఆధారాలను సేకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement