నాపై కుట్రకు ప్లాన్‌.. సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు | CM Siddaramaiah Sensational Comments He Targeted over caste | Sakshi
Sakshi News home page

నాపై కుట్రకు ప్లాన్‌.. సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు

Feb 22 2026 8:27 AM | Updated on Feb 22 2026 12:39 PM

CM Siddaramaiah Sensational Comments He Targeted over caste

బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సిద్దరామయ్య సోషల్‌ మీడియా వేదికగా తన కులం, సామాజిక నేపథ్యం కారణంగా కొందరు టార్గెట్‌ చేసి తనను దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీంతో, కన్నడ రాజకీయంలో మరో కొత్త ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు సైతం సిద్దరామయ్యను ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోషల్‌ మీడియా వేదికగా..‘నాలుగు దశాబ్దాలుగా నేడు రాజకీయాల్లో ఉన్నాను. నా రాజకీయ జీవితం ఏనాడూ పూల పాన్పు కాదు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. చాలా మంది పెద్ద నాయకులు నన్ను రాజకీయంగా అంతం చేయడానికి అనేక మోసపూరిత కుట్రలు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో నేను వాటన్నిటినీ అధిగమించాను. కానీ, కొందరు వ్యక్తులు ఇప్పుడు నాపై కులం, సామాజిక నేపథ్యం కారణంగా కుట్రలు చేస్తున్నారు. నా కులం కారణంగా నేను టార్గెట్‌ అవుతున్నాను.

గొర్రెల కాపరి (కురుబ సామాజిక వర్గం) ముఖ్యమంత్రి అయ్యాడు. ఆర్థిక నిపుణులతో కలిసి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నాడని కొన్ని వర్గాలు నాపై కక్ష కట్టాయి. వారు నన్ను అంతం చేస్తే వారి మార్గం సజావుగా మారుతుందని ప్లాన్‌ చేస్తున్నారు. నన్ను మాత్రమే కాకుండా, నాకు మద్దతు ఇచ్చే వ్యక్తులను కూడా అణగదొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను అన్నీ గమనిస్తున్నాను.

ఇది నా ఒక్కడిపై జరిగిన కుట్ర కాదని నాకు బాగా తెలుసు. ఇది నన్ను నమ్మిన మీపై జరిగిన కుట్ర. అందుకే, నేను ఊపిరి ఉన్నంత వరకు, ఈ రాజకీయ కుట్రకు, అసూయ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతాను. ఇది నిజం. న్యాయం, ధర్మం కోసం పోరాటం చేస్తాను. మీ మద్దతుతో, నేను ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాను. నేను యుద్ధభూమి నుండి పారిపోయే పిరికివాడిని ఎప్పటికీ కాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

దీంతో, సిద్దరామయ్య పోస్టుపై రాజకీయంగా చర్చ మొదలైంది. కర్ణాటక సీఎం కుర్చీ కోసం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం కన్నడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరోవైపు.. సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారని ప్రతిపక్ష నేతలు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో కులం కార్డులో సిద్దరామయ్య కొత్త రాజకీయాలకు తెరలేపారని వ్యాఖ్యలు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement