అనుమానిత ఉగ్రవాది పట్టివేత
బనశంకరి: బెయిల్‌పై విడుదలై పరారీలో ఉన్న అనుమానిత ఉగ్రవాది అర్షాద్‌ఖాన్ ను శనివారం ఎన్‌ఐఏ, పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో పేలుళ్లకు కుట్ర చేయడం, గ్రెనేడ్లు కలిగి ఉన్న కేసులో నిందితుడు. పరప్పన జైలులో ఉన్న అర్షాద్‌ఖాన్ కొన్నినెలల క్రితం బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. కానీ కోర్టుకు హాజరు కావడం లేదు. పోలీసులు ఆరా తీయగా పరారయ్యాడు. ఎన్‌ఐఏ అధికారులు, పోలీసులు అతని కోసం అరెస్టు వారంట్ జారీ చేశారు. ఇతని జాడ తెలిసి నిర్బంధించి ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న సమయంలో అతడు ఏం చేశాడు, ఎవరిని కలిశాడు అనేది విచారణ చేపట్టారు.
చెరకు తోటలో చిరుత కూనలు
మైసూరు: చెరకు తోటలో రెండు చిరుత పిల్లలు కనిపించాయి. జిల్లాలోని హెచ్‌డీకోటె తాలూకా హైరిగె గ్రామంలో జరిగింది. రైతు అనిల్‌కుమార్ చెరకు తోటలో ఈ చిరుత పిల్లలు కనిపించాయి. పొలం యజమాని, స్థానికులు వాటిని అటవీ శాఖకు అప్పగించారు. తల్లి చిరుత చెరకు తోటలోకి వచ్చే అవకాశాలున్నందున దాని వద్దకు పిల్లలను చేర్చేలా అటవీ సిబ్బంది చర్యలు చేపట్టారు.
నిమిషాంబకు కుంకుమార్చన
మండ్య: మండ్య జిల్లాలోని శ్రీరంగపట్నంలో గంజాంలోని శ్రీ నిమిషాంబ ఆలయంలో ధర్మస్థల గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిమిషాంబ దేవికి సామూహిక కుంకుమార్చన, సత్యనారాయణ పూజా వేడుకలు జరిపించారు. ధార్మిక సంస్కృతిలో భాగమైన ఆచారాలను పాటిస్తూ నైతికతను పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు.
స్నేహమయి విడుదల!
బనశంకరి: సీఎం సిద్దరామయ్యపై ముడా కేసు వేసి పేరుపొందిన సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణను సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేసి, విచారించి విడుదలచేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శాలిని రజనీశ్ పై ఆరోపణలు చేయడం, పోలీసులు మైసూరులో ఆయన ఇంటిపై దాడి చేసి అరెస్టు చేయడం తెలిసిందే. శనివారం కృష్ణ సోషల్ మీడియాలో పోస్ట్‌పెట్టి, బెంగళూరు సీసీబీ ఠాణాలో విచారణ ముగిసిందని, తనను వదిలేశారని తెలిపారు. తన ద్వారా తప్పు జరిగిందని, శాలిని రజనీశ్ కు క్షమాపణ చెబుతున్నానని తెలిపారు. ముడా మాజీ కమిషనర్ నటేశ్ పదోన్నతి కోసం శాలిని రజనీశ్ కు రూ.1.60 కోట్ల లంచం ఇచ్చారని స్నేహమయి కృష్ణ ఆరోపించడం తెలిసిందే. 4 రోజుల్లోనే పదోన్నతి వచ్చిందని తెలిపారు. నటేశ్‌తో గొడవలున్న వినోద్ అనే వ్యక్తి తనకు తప్పుడు సమాచారం ఇచ్చాడన్నారు.
ఏటీఎంల డబ్బు..
రూ.3.40 కోట్లు స్వాహా
● హాసన్‌లో భారీ స్కాం
యశవంతపుర: ఏటీఎంలలో నగదు నింపే సిబ్బంది దురాశకు పోయి మోసాలకు పాల్పడుతున్నారు. బెంగళూరులో భారీ దోపిడీకి పాల్పడిన ఉదంతం మరువకముందే హాసన్ జిల్లాలో రూ. 3 కోట్లకు పైగా స్కాం బయటపడింది. ఆ జిల్లాలో ఏటీఎంలలో డబ్బులు నింపే సంస్థ సిబ్బంది డబ్బులు స్వాహా చేశారు. 11 కెనరా బ్యాంక్ ఏటీఎంలు, మూడు ఎస్‌బీఐ, ఒక బ్యాంక్ అఫ్ ఇండియా ఎటీఎంకు రోజు నగదును నింపుతుంటారు. నందీశ్, మధుకుమార్ అనే ఇద్దరు ఉద్యోగులు ఒక నెల వ్యవధిలో రూ 3.40 కోట్లను జేబులోకి వేసుకున్నట్లు తేలింది. నగదు నింపినట్లు తప్పుడు రసీదులను సృష్టించారు. ఈ నెల 18, 19 తేదీలలో నిధుల గురించి ఆడిటింగ్ జరిగినప్పుడు ఇది బయటపడినట్లు తెలిసింది. దీంతో బ్యాంకుల అధికారులు హాసన్ బడావణె ఠాణాలో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.
పరువు నష్టం కేసు..
రోహిణి అర్జీ డిస్మిస్
శివాజీనగర: ఐపీఎస్ అధికారి డి.రూపా మౌద్గిల్ తనపై వేసిన పరువు నష్టం కేసును రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారి డి.రోహిణి సింధూరి సమర్పించిన పిటిషన్‌ను శనివారం హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసు విచారణ కొనసాగుతుందని తెలిపింది. దీంతో కింది కోర్టులో కేసు విచారణకు ఉన్న అడ్డంకి తొలగినట్లయింది. 2023 ఫిబ్రవరిలో రోహిణి సింధూరి మీద రూప ప్రైవేట్ కేసు (పీసీఆర్) నమోదు చేశారు. సోషల్ మీడియాలో రోహిణి తనను అవమానపరిచేలా పోస్టులు పెట్టారని, పరువుకు నష్టం కలిగించారని, మానసిక అస్వస్థురాలిగా పేర్కొన్నారని రూపా ఆరోపించారు. ఆమె పోస్టుల వల్ల ప్రభుత్వం తనకు కొన్ని నెలలపాటు పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసింది, కుటుంబ సభ్యులకు తీవ్ర మానసిక క్షోభ కలిగిందని డీ.రూపా కోర్టు మెట్లెక్కారు. కేసు విచారణలో ఉండగా, కొట్టివేయాలని రోహిణి హైకోర్టును ఆశ్రయించగా ఈ మేరకు తీర్పు వచ్చింది. ప్రస్తుతం రూపా అదనపు డీజీపీగా, రోహిణి ఓ శాఖ కార్యదర్శి స్థాయిలో ఉన్నారు.
అనుమానిత ఉగ్రవాది పట్టివేత


