గీజర్ లీక్‌తోనే టెక్కీ మృతి
● పోస్టుమార్టం నివేదిక
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా ఆల్దూరు వద్ద ఓ హోం స్టేలో టెక్కీ అనుమానాస్పదరీతిలో చనిపోయింది. ఇది జరిగిన 4 నెలల తరువాత హోంస్టే యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. బెంగళూరులో ఐటీ కంపెనీలో పనిచేసే టెక్కీ రంజిత గతేడాది అక్టోబర్ 25న స్నేహితురాలి నిశ్చితార్థానికి వెళ్లారు. హోంస్టేలో బస చేసిన ఆమె అదే రోజు బాత్‌రూంలో స్పృహ తప్పి పడిపోయింది. ఆస్పత్రికి తరలించగా మరణించింది. ఇప్పుడు పోస్టుమార్టం నివేదికలో వచ్చింది, బాత్‌రూంలో గ్యాస్ గీజర్ నుంచి గ్యాస్ లీకై ఊపిరాడక ఈ ప్రమాదం జరిగినట్లు బయటపడింది. దీంతో హోంస్టే యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నాటు బాంబుతో బ్యాటింగ్
● బాలునికి గాయాలు
యశవంతపుర: దొరికిన నాటు బాంబును బాల్ అనుకుని క్రికెట్ ఆడగా అది పేలి బాలుడు గాయపడిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా బంగారు గ్రామంలో జరిగింది. ఇంటికి దగ్గరలోని ఓ తోటలో రైతు అడవి పందులు చొరబడకుండా అక్కడక్కడా నాటుబాంబులను తయారు చేసి పెట్టాడు. ఓ బాంబును చూసిన బాలుడు అభిశ్ అదేమిటో తెలియక స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడదామని చెప్పాడు. దానిని బ్యాట్‌తో జోరుగా బాదటంతో పెద్ద శబ్ధంతో పేలిపోయింది. దాని ముక్కలు తగిలి రెండు కాళ్లకు చిన్న చిన్న గాయాలైన అభిశ్‌ను స్థానికులు బెళ్తంగడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ధర్మస్థల పోలీసులు కేసు నమోదు చేశారు.
భూతప్పస్వామి హారతి జాతర
తుమకూరు: తుమకూరు జిల్లా శిర తాలూకాలోని హనుమనహళ్లి శ్రీ భూతప్ప స్వామి దేవస్థానం జాతర మహోత్సవాల హారతి ఉత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఆలయ అధికారులు, స్థానిక నేతలు, భక్తులు పాల్గొన్నారు. భూతప్ప స్వామికి వందలాది మంది మహిళలు హారతి పట్టారు.
ఆలయంలో అస్పృశ్యత
● నవ దంపతుల ఆవేదన
తుమకూరు: హోంమంత్రి పరమేశ్వర్ సొంతజిల్లా తుమకూరు అన్నది తెలిసిందే. అదే జిల్లాలో అంటరానితనం అనే అనాచారం ఇంకా కొనసాగుతోంది. దేవుడు పూనాడంటూ దళితులను ఆలయం నుంచి వెళ్లగొట్టిన గ్రామస్థుని ఉదంతమిది. తురువెకెరె తాలూకాలోని అరసమ్మ ఆలయంలో ఈ సంఘటన జరిగింది. వివరాలు.. దళిత కులానికి చెందిన నూతన దంపతులు స్థానిక ఆలయంలో పూజలు చేయడానికి వెళ్లారు. ఆలయం లోపల ఉన్న ఓ స్థానికుడు నారాయణప్ప వారిని అడ్డుకున్నాడు. దళితులారా, మీకు ప్రవేశం లేదు. మీరు మంచి పనులు చేయాలి. బయటకు వెళ్లండి అని కేకలు వేశాడు. తనకు దేవుడు పూనాడని విచిత్ర చేష్టలు చేస్తూ వారిని బలవంతంగా బయటకు పంపేశాడు. భయాందోళనకు గురైన కొత్త దంపతులు ఆవేదనకు లోనయ్యారు. బాధిత జంట తురువెకెరె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నారాయణప్ప, ప్రభ, కాంతన్న, అమూల్య, పుట్టెగౌడ, పద్మ తదితరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నారాయణప్పను అరెస్టు చేసి మిగిలిన వారి కోసం వెతుకుతున్నారు.
మాదప్పకు శివరాత్రి ఆదాయం రూ.3.35 కోట్లు
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని ప్రసిద్ధ మలె మహదేశ్వర బెట్ట దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాల తరువాత హుండీల లెక్కింపు చేపట్టగా, రికార్డుస్థాయిలో రూ.3.35 కోట్ల ఆదాయం లభించింది. 5 రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు జరగ్గా, సుమారు 10 లక్షల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించున్నట్లు క్షేత్ర ప్రాధికార కార్యదర్శి ఏఈ రఘు తెలిపారు.
గీజర్ లీక్‌తోనే టెక్కీ మృతి
గీజర్ లీక్‌తోనే టెక్కీ మృతి


