సీఎం కుర్చీ తగాదాకు త్వరలో ముగింపు?
ఖర్గే ఏమన్నారు..?
అతి త్వరలో సీఎం మార్పు గందరగోళాన్ని పరిష్కరిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. శనివారం ఖర్గేతో ఢిల్లీలో రాష్ట్ర మంత్రి సతీశ్ జార్కిహొళి సమావేశమై రాష్ట్ర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శీఘ్రమే సీఎం మార్పు వివాదానికి తెరదించుతామని ఖర్గే హామీనిచ్చినట్లు సతీశ్ తెలిపారు. పదవి రగడ పరిణామాలు కాంగ్రెస్ పార్టీని, కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తున్నట్లు ఖర్గేకు సతీశ్ వివరించారు. వీలయినంత త్వరగా సీఎం మార్పు అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని కోరారు. తాము కూడా ఒక ముగింపునకు వచ్చినట్లు ఖర్గే సూచన ఇచ్చారు. దీని గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని, హైకమాండ్ సీరియస్‌గా తీసుకుని చర్చించిందని, అంతా ముగుస్తుందని హామీనిచ్చినట్లు తెలిపారు. ఖర్గే వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌కు హైకమాండ్ నుంచి పిలుపు అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌కు ముందు ఇద్దరినీ ఢిల్లీకి పిలిపించి హైకమాండ్ మాట్లాడి ఒప్పిస్తుందా అనేది చూడాలి.
సాక్షి, బెంగళూరు: గత కొన్ని నెలలుగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ముఖ్యమంత్రి మార్పు వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వైకుంఠపాళి ఆట తరహాలో సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ మధ్య నాయకత్వ మార్పు అంశం ఊగిసలాడుతూ వస్తోంది. ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు నిత్యకృత్యమయ్యాయి. హైకమాండ్ ఏమీ తేల్చకుండా వ్యవహరిస్తోంది. ఈ సుదీర్ఘ వివాదానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఢిల్లీ పెద్దల నిర్ణయమేమిటి? అనేది మిస్టరీగా మారింది.
సంతోషమే కదా: డీసీఎం
బెంగళూరులో డీసీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ ఈ గందరగోళానికి పరిష్కారం లభిస్తే చాలా సంతోషమేనని చెప్పారు. పోరాటం చేస్తూనే ఉంటానని సీఎం సిద్ధరామయ్య చేసిన ట్వీట్‌పై తనకు ఏమీ తెలియదన్నారు. శుక్రవారం రాత్రి అసోం నుంచి బెంగళూరుకు వచ్చానని, బాగల్‌కోట అల్లర్ల గురించి తెలియదని అన్నారు.
శనివారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో సీఎం సిద్దరామయ్య డీసీఎం డీకే శివకుమార్
26న హస్తినకు డీసీఎం: ఎమ్మెల్యే ఇక్బాల్
సీఎం మార్పుపై చర్చకు ఈ నెల 26న డీకే శివకుమార్‌ను ఢిల్లీకి ఆహ్వానించినట్లు ఆయన మద్దతుదారుడు, ఎమ్మెల్యే హెచ్‌ఏ ఇక్బాల్ హుస్సేన్ చెప్పారు. డీకే కు మంచి జరుగుతుందని అన్నారు. సీఎం సిద్ధరామయ్య ఇటీవలే రెండున్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారని, మిగిలిన సమయాన్ని డీకే శివకుమార్‌కు ఇవ్వాలని ఆయన కోరారు. శివకుమార్‌కు చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట!
మంత్రి సతీశ్ జార్కిహొళి ప్రకటన
ఢిల్లీలో ఇద్దరి మధ్య చర్చలు
హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ
సీఎం కుర్చీ తగాదాకు త్వరలో ముగింపు?
సీఎం కుర్చీ తగాదాకు త్వరలో ముగింపు?


