హంపీ తీరంలో కిష్కింధకాండ
రాయచూరు రూరల్: ప్రఖ్యాత పర్యాటక నగరి హంపీ వద్ద తుంగభద్ర నది తీరంలో విదేశీ టూరిస్టులు ఘర్షణకు దిగారు. గుంపులుగా విడిపోయి కొట్టుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. హంపీలో నదికి అవతల కొప్పళ జిల్లా లోకి వచ్చే గంగావతి పరిధిలో ఈ రగడ చోటుచేసుకుంది. వివరాలు.. విదేశీ టూరిస్టులు డీజే మ్యూజిక్ వేసుకుని చిందులు వేస్తున్న సమయంలో పరస్పరం గొడవకు దిగారు. గట్టిగా కేకలు వేసుకుంటూ పోట్లాటకు దిగడంతో గందరగోళం నెలకొంది. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ప్రాంతంలో పెద్దసంఖ్యలో అక్రమ రిసార్టులు ఉన్నాయి. వాటిలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు ముందునుంచీ ఆరోపణలున్నాయి. వీటిలో యూరోపియన్ దేశాల నుంచి వచ్చే వందలాది టూరిస్టులు నెలల తరబడి మకాం వేస్తున్నారు. రిసార్టుల్లో వారికి కావలసినవన్నీ సమకూరుస్తారు. ఇందుకోసం భారీ మొత్తాల్లో వసూళ్లు చేస్తారని ఆరోపణలున్నాయి. తరచూ ఓపెన్ పార్టీలు నిర్వహిస్తుంటారు.
విచారణ చేస్తున్నాం: ఎస్పీ రామ్
కొట్లాటల నేపథ్యంలో స్థానిక మునీరాబాద్ పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి రిసార్టుల యజమానులను ప్రశ్నించారు. రిసార్ట్ యజమానుల పై కేసుల నమోదుకు సిద్ధమయ్యారు. యథేచ్ఛగా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ రామ్ అరసిద్ది మాట్లాడుతూ ఈ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారనేది వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. కేసు విచారణకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని, ప్రమేయం ఉన్నవారికి నోటీసులు జారీ చేస్తామని చెప్పారు.
తన్నుకున్న విదేశీయులు
రిసార్టుల వద్ద ఉద్రిక్తత
పోలీసుల విచారణ


