ఉన్నది మెరిట్‌ కోటానే | CM Revanth Reddy Comments at DCC Presidents Training Camp | Sakshi
Sakshi News home page

ఉన్నది మెరిట్‌ కోటానే

Feb 22 2026 5:05 AM | Updated on Feb 22 2026 5:05 AM

CM Revanth Reddy Comments at DCC Presidents Training Camp

పనిచేసే వారికే కాంగ్రెస్‌లో తగిన ప్రాధాన్యం

దేశం ఆత్మనే కాంగ్రెస్‌.. పార్టీని, దేశాన్ని ఎవ్వరూ విడదీయలేరు  

ప్రజల మనసు గెలవడంతోనే ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్ల శాతం పెరుగుతోంది 

డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

వికారాబాద్‌: కాంగ్రెస్‌లో ఏ కోటా ఉండదు.. కేవలం మెరిట్‌ కోటా మాత్రమే ఉంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బాగా పనిచేసే వారికి పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కుతుందని చెప్పారు. వికారాబాద్‌లోని అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాన్ని శనివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. డీసీసీ అధ్యక్షులుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. దేశం ఆత్మనే కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ పార్టీని దేశాన్ని ఎవ్వరూ విడదీయలేరు అని చెప్పారు. 

దేశ స్వాతంత్య్రానికి 140 ఏళ్ల ముందే కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించిందని.. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ తెచ్చిన స్వాతంత్య్రం.. ఇచ్చిన రాజ్యాంగాన్ని వినియోగించుకొని ఉద్భవించిన పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అంటున్నాయని ఎద్దేవా చేశారు. 

త్యాగాల పార్టీ కాంగ్రెస్‌  
భారత దేశ ఆత్మగౌరవం గ్రామాల్లో ఉందని నమ్మే పార్టీ కాంగ్రెస్‌ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇటీవల కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, లేదంటే సమూలంగా మార్చేయాలనే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మహాత్మాగాందీ, నెహ్రూ వంటి నాయకులు దేశ స్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్లారన్నారు. గాంధీ బ్రిటిష్‌ వారిపై తిరగబడితే వారు ఆయనపై కనీసం లాఠీ కూడా ఎత్తలేదని, కానీ మన దేశానికి చెందిన ఓ పార్టీ నాయకుల తుపాకీ గుండ్లకు బలి కావాల్సి వచ్చిందని తెలిపారు. గాం«దీ, ఇందిరాగాందీ, రాజీవ్‌గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారన్నారు. త్యాగాల చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌గాంధీ 4వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు.  

పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు.. 
‘డీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైనవారు జిల్లాకు అధిపతులమని భావించొద్దు.. వ్యతిరేకించిన వారిని అణచివేసే ప్రయత్నాలు చేయొద్దు’అని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ప్రతీ నాయకుడి ఇంటికి వెళ్లి కలిసి మద్దతు అడిగానని గుర్తు చేసుకున్నారు. అందరూ కలిసి పనిచేయడంతోనే రెండున్నర శాతం ఉన్న కాంగ్రెస్‌ ఓట్లను 40 శాతానికి తెచ్చుకోవడంతోపాటు అధికారంలోకి రాగలిగామని స్పష్టం చేశారు. 119 నియోజకవర్గాల్లో 42 లక్షల డిజిటల్‌ సభ్యత్వాలు చేయించామన్నారు. డీసీసీ అధ్యక్షులుగా బాగా పనిచేసిన వారికి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చామని చెప్పారు. డీసీసీ అధ్యక్ష పదవులను దుర్వినియోగం చేయొద్దని, పార్టీ విశ్వాసాన్ని దెబ్బతీయొద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు శాతం తేడాతో అధికారంలోకి వచ్చిన మనం పార్లమెంట్‌ ఎన్నికల్లో 4 శాతం ఓట్లు పెంచుకున్నామని, మున్సిపల్‌ ఎన్నికల్లో 12 శాతానికి చేరుకున్నామని, ప్రజల మనసు గెలవడంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు.  

గొంతు నొక్కే కుట్ర 
బీజేపీ కాంగ్రెస్‌ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పార్లమెంటులో రాహుల్‌గాం«దీని మాట్లాడనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బడుగులు, బలహీన వర్గాల గొంతు నొక్కే కుట్ర చేస్తోందని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో క్వాలిటీ లీడర్‌íÙప్‌ను తయారు చేయటమే సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ లక్ష్యమని చెప్పారు. దేశంలో సంస్థాగత మార్పునకు ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, శిక్షణ నిర్వహణ కమిటీ చైర్మన్‌ టి.రామ్మోహన్‌రెడ్డి, వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గడ్డం అనన్య తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement