తెలంగాణ పట్ల ఎలాంటి వివక్ష ఉండదు | There will be no political differences in development programs says Shivraj Singh Chouhan | Sakshi
Sakshi News home page

తెలంగాణ పట్ల ఎలాంటి వివక్ష ఉండదు

Feb 22 2026 4:40 AM | Updated on Feb 22 2026 4:40 AM

There will be no political differences in development programs says Shivraj Singh Chouhan

అభివృద్ధిలో ఎలాంటి తేడాలుండవు 

ఢిల్లీ–హైదరాబాద్‌ కలిసి పనిచేస్తూ ముందుకు సాగాలి  

కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎలాంటి రాజకీయాలు తేడాలు ఉండవని, ఢిల్లీ–హైదరాబాద్‌ కలిసి పనిచేస్తూ ముందుకు సాగాల్సి ఉందని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. కేంద్రం–రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేద్దామని, తెలంగాణకు ఏయే సహాయ, సహకారాలు అందాల్సిఉందో వాటన్నింటినీ అందిస్తామన్నారు. తెలంగాణ పట్ల ఎలాంటి వివక్షతను కేంద్రం ప్రదర్శించదని స్పష్టంచేశారు. కేంద్రమంత్రిగా తెలంగాణకు హామీనిస్తున్నానని, అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల కేటాయింపు విషయంలో ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు. 

శనివారం ఐటీసీ కాకతీయ హోటల్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌ ‘జాతీయ ఆర్థిక అక్షరాస్యత–సమర్థత’– 25వ కేంద్ర స్థాయి సమన్వయ కమిటీ (సీఎల్‌సీసీ) సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా మూడు ప్రధాన జాతీయ స్థాయి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. వీటిలో స్వయం సహాయక బృందాల సభ్యుల వ్యక్తిగత వ్యాపారాల కోసం బ్యాంక్‌ రుణాల వ్యవస్థ, స్వయం సహాయక బృందాల సభ్యుల కోసం యూపీఐ ఆధారిత రుణ ఎంపికలు, స్వయం సహాయక బృందాల సభ్యులకు ఆర్థిక అవగాహనను పెంపొందించే డిజిటల్‌ మాడ్యూల్స్‌ ఉన్నాయి. 

ఈ సందర్భంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నియంత్రణ సంస్థలు, ఆర్థిక అక్షరాస్యత కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్ల ప్రతినిధులను ఉద్దేశించి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ దేశం–రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధన సాధ్యమవుతుందన్నారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ కలిసి పనిచేసి మరింత మెరుగైన ఫలితాలు సాధిద్దామని, అందుకు ఢిల్లీలో తమ శాఖ కార్యాలయాల గేట్లు ఎప్పుడూ తెరిచి ఉంటాయని చెప్పారు. 

కేంద్రమంత్రిగా తెలంగాణకు హామీనిస్తున్నానని, అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల కేటాయింపు విషయంలో ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు. ఈ సమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం అందించిన సహాయసహకారాలు అభినందనీయమన్నారు. ఎస్‌హెచ్‌జీ మహిళలకు రుణాలు అందించడం నష్టం కాదని, దేశానికి అత్యంత సురక్షితమైన పెట్టుబడుల్లో ఒకటని పేర్కొన్నారు.  

లఖ్‌పతి దీదీలుగా ఎస్‌హెచ్‌జీ మహళలు 
నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం)లో భాగంగా ఎస్‌హెచ్‌జీ (స్వయం సహాయక సంఘాలు)లకు గత 12 ఏళ్లలో రూ.12 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని, వచ్చే ఐదేళ్లలో ప్రతీ ఎస్‌హెచ్‌జీ కవర్‌ చేసేలా మరో 3 కోట్ల మందిని ‘లఖ్‌పతి దీదీ’లుగా మార్చేందుకు ఏడాదికి రూ. 2 లక్షల కోట్ల చొప్పున రూ.10 లక్షల కోట్లను బ్యాంకులు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. 

1.5 కోట్ల మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులకు పింఛన్‌ జతచేసేలా చేస్తున్నామన్నారు. అదేవిధంగా 90 శాతం ఎస్‌హెచ్‌జీ సభ్యులకు పీఎం సురక్షా బీమా యోజన, పీఎం జీవన్‌జ్యోతి యోజన కింద బీమా కవర్‌ చేసేలా చూస్తామన్నారు. 

గత ప్రభుత్వ వైఖరితో పేదలకు నష్టం 
పీఎం ఆవాస్‌ యోజనలో తెలంగాణ భాగస్వామి అవుతుందని ఈ పర్యటనలో భాగంగా తనను తెలంగాణ గ్రామీణాభివృద్ధిశాఖ, రెవెన్యూ, గృహనిర్మాణశాఖల మంత్రులు కలిసి విజ్ఞప్తి చేయడంతో పాటు ముఖ్యమంత్రి కూడా లేఖ రాశారని మంత్రి చౌహాన్‌ తెలిపారు. ఈ పథకంలో తెలంగాణ జతకలవడం సంతోషదాయకమని, ఆధార్, మొబైల్‌యాప్‌ల ద్వారా ఎంపికతో 11,56, 929 మంది గ్రామీణ పేదలకు ఇళ్లు లభిస్తాయన్నారు. తెలంగాణలోని గత ప్రభుత్వం పీఎంఏవై పథకం నుంచి ప్రయోజనం పొందకపోవడం దురదృష్టకరమన్నారు. 

ఈ పథకం కింద మొదటి దఫా నిధులను కూడా కేంద్రం పంపించగా కొన్నేళ్లపాటు వాటిని వినియోగించకుండా పెట్టుకుని 2023లో తిప్పిపంపించిందన్నారు. దేశ జీడీపీలో మహిళల భాగస్వామ్యం 18 శాతమే ఉన్నందున, ఈ అంతరాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకర్లు, అభివృద్ధి భాగస్వాములు కలిసికట్టుగా పనిచేయాలని సీతక్క సూచించడం అభినందనీయమని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ...తాను ఆంధ్రప్రదేశ్‌కి చెందినా, తెలంగాణ కూడా తన సొంత రాష్ట్రమేనని చెప్పారు. 

ఎస్‌హెచ్‌జీలకు బ్యాంక్‌ రుణాలు, తదితరాలను సరళీకరణ, సులభతరం చేసేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ దేశంలో కొత్త రాష్ట్రమైనప్పటికీ మిషన్‌ ఆధారిత కార్యక్రమాలు, తెలంగాణ మహిళలు తదుపరి దశ వ్యాపార ఏర్పాటుకు నాయకత్వం వహించడానికి వీలు కల్పిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 

కేంద్రగ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శైలేష్‌ కుమార్‌ సింగ్, అదనపు కార్యదర్శి టి. కె. అనిల్‌ కుమార్, సంయుక్త కార్యదర్శులు స్మృతి శరణ్, స్వాతి శర్మ, రాష్ట్ర పీఆర్‌ఆర్డీ ముఖ్య కార్యదర్శి ఎన్‌. శ్రీధర్, పీఆర్‌ కమిషనర్, సెర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్, నాబార్డ్, ఆర్‌బిఐ, బ్యాంకులు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు, వివిధ రాష్ట్రాల స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

రైతుల లాభదాయకతను పెంచేందుకు.. 
ఏజీవర్సిటీ: దేశంలోని రైతుల లాభదాయకతను పెంచేందుకు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (నారమ్స్‌) లోని శాస్త్రవేత్తలు, విద్యార్థులు కృషి చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు. శనివారం నారమ్స్‌లో క్షమతా భవన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐసీఎఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ల పురోగతి భవష్యత్తు ప్రణాళికను సమీక్షించారు.

నిరుపేదల ఇళ్లకు చేయూత ఇవ్వండి
కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు మంత్రి పొంగులేటి విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్‌: గూడు లేని నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టినందున, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తదనుగుణంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ఇళ్లను మంజూరు చేయాలని గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంత ఇళ్లను మంజురు చేయాలని గడిచిన రెండు సంవత్సరాలుగా పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా గ్రామీణ ప్రాంతాలకు 3 లక్షల ఇళ్లు మంజురు చేయాలని కోరారు. 

కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా శనివారం ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గృహ నిర్మాణానికి సంబంధించి పలు అంశాలను ప్రస్తావించి ఆయనకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ సొంత ఇళ్లు సమకూర్చేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఈ ఏడాది నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజురు చేశామని, కేంద్రం చేయూతనందిస్తే ఈ కార్యక్రమం మరింత వేగిరం అవుతుందని పేర్కొన్నారు. 

ఇంటింటికీ విస్తృత సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల డేటాబేస్‌ను సిద్ధం చేశామని, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం మొబైల్‌ యాప్‌ ద్వారా మరోసారి సర్వే నిర్వహించి 11.57 లక్షల అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించామని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో గత 12 ఏళ్లలో ఏర్పడిన పెండింగ్‌ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకొని ఈ ఆర్థిక సంవత్సరంలో 3 లక్షలు, వచ్చే ఏడాది మరో రెండు లక్షల ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement