నిమ్స్‌లో కొత్తగా 4 కోర్సులు.. 16 సీట్లు | NIMS introduces four new super specialty courses in different departments | Sakshi
Sakshi News home page

నిమ్స్‌లో కొత్తగా 4 కోర్సులు.. 16 సీట్లు

Feb 22 2026 4:09 AM | Updated on Feb 22 2026 4:09 AM

NIMS introduces four new super specialty courses in different departments

నాలుగు చొప్పున ఎంసీహెచ్,డీఎం సీట్లకు ఎన్‌ఎంసీ అనుమతి

‘గాంధీ’కి మూడు డీఎం క్రిటికల్‌ కేర్‌ సీట్లు మంజూరు

లక్డీకాపూల్‌/గాంధీ ఆస్పత్రి: నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)కు కొత్తగా నాలుగు విభాగాలకు సంబంధించి సూపర్‌ స్పెషాలిటీ కోర్సులను నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతించింది. సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో మాస్టర్‌ ఆఫ్‌ సూపర్‌ స్పెషాలిటీ (ఎంసీహెచ్‌), డాక్టరేట్‌ ఆఫ్‌ మెడిసిన్‌ (డీఎం) కోర్సులకు అనుమతి లభించినట్లు నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నగరి బీరప్ప వెల్లడించారు. సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో మాస్టర్‌ ఆఫ్‌ సూపర్‌ స్పెషాలిటీ కోర్సు (ఎంసీహెచ్‌)కు సంబంధించి నాలుగు సీట్లు పెరిగాయన్నారు. 

అలాగే వాస్కులర్‌ సర్జరీ, సర్జికల్‌ ఆంకాలజీ విభాగాలకు కూడా ఎంసీహెచ్‌ సీట్లు నాలుగు చొప్పున పెరిగినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆంకో–పాథాలజీ విభాగానికి డీఎం (డాక్టరేట్‌ ఆఫ్‌ మెడిసిన్‌) సీట్లు కూడా మరో నాలుగు పెరిగాయన్నారు. మొత్తం 16 సీట్లు మంజూరు కావడం విశేషమని పేర్కొంటూ.. ప్రభుత్వ వైద్య సంస్థలలో ఆంకో–పాథాలజీ విభాగంలో డీఎం సూపర్‌ స్పెషాలిటీ కోర్సులకు అనుమతి పొందిన తొలి సంస్థగా నిమ్స్‌ నిలిచిందన్నారు. 

ఈ కోర్సు ద్వారా హిస్టోపాథాలజీ, సైటోపాథాలజీ, హీమటోపాథాలజీ, మాలిక్యులర్‌ డయాగ్నస్టిక్స్, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ, సైటోజెనెటిక్స్, జెనోమిక్‌ ప్రొఫైలింగ్‌ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సాంకేతికతల సమన్వయంతో కచ్చితమైన, వ్యక్తిగతీకరించిన క్యాన్సర్‌ నిర్ధారణ సాధ్యమవుతుందన్నారు. నిమ్స్‌లో ఇప్పటికే 51 విభాగాలకు సంబంధించి బీఎస్సీ, బీపీటీ, పీజీడీ, ఎండీ, ఎంఎస్, ఎంపీటీ, ఎంహెచ్‌ఎం, డిప్లామా, ఎంసీహెచ్, డీఎం కోర్సులు ఉన్నాయని బీరప్ప తెలిపారు. 

మరోవైపు సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీకి మూడు డీఎం క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌ సీట్లను ఎన్‌ఎంసీ మంజూరు చేసిందని గాంధీ క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌ విభాగాధిపతి ప్రొ. కిరణ్‌ మాదల తెలిపారు. దీంతో న్యూరాలజీ, కార్డియాలజీ, పల్మనాలజీ, నెఫ్రాలజీ, జనరల్‌ సర్జరీ, పోస్టు ఆపరేషన్, ఇన్ఫెక్షన్‌ తదితర విభాగాల్లో ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు ఎమర్జెన్సీ, క్రిటికల్‌ కేర్‌లో మరింత మెరుగైన సేవలు అందించేందుకు, హైఎండ్‌ సర్జరీలు నిర్వహించేందుకు అవకాశం లభిస్తుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement